TS Rains: ప్రజలారా జర పైలం.. మూడు వారాలు మస్తు వానలే!

4 Aug, 2022 03:14 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: నైరుతి రుతుపవనాలు చురుకుగా కదులుతుండటం, వాటికి అల్పపీడనం, ఉపరితల ఆవర్తనం వంటివి తోడవడంతో.. రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ పరిస్థితి మరో మూడు వారాల పాటు కొనసాగే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. 25వరకు వానల సరళి ఎలా ఉంటుందనే అంచనాలను తాజాగా వెల్లడించింది. రాష్ట్రవ్యాప్తంగా రానున్న మూడు వారాల పాటు విస్తారంగా వానలు పడతాయని.. కొన్నిచోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. 

అప్రమత్తతే మేలు.. 
రాష్ట్రవ్యాప్తంగా చాలా చోట్ల గత నెలంతా భారీ వర్షాలు నమోదయ్యాయి. మొత్తం నైరుతి సీజన్‌లో నమోదవ్వాల్సిన వర్షపాతంలో మూడింట రెండు వంతుల మేర ఒక్క నెలలోనే కురిసింది. చెరువులు, కుంటలు చాలా వరకు నిండిపోయాయి. వాగులు, వంకలతోపాటు కృష్ణా, గోదావరి ప్రధాన నదులు, ఉప నదుల్లోనూ ప్రవాహాలు కొనసాగుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో మళ్లీ భారీ వర్షాలు పడితే.. వరదలతో జన జీవనానికి ఇబ్బంది తలెత్తే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. అందువల్ల ప్రభుత్వ యంత్రాంగం వానల తీవ్రతను బట్టి తగిన చర్యలు తీసుకోవాలని సూచించింది. 

అప్పుడే ఎండ.. కాసేపటికే వాన.. 
ఉదయం భారీ వర్షం.. కాసేపటికే భానుడి ప్రతాపం.. మళ్లీ సాయంత్రం మోస్తరు వర్షం.. వారం రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో కనిపిస్తున్న పరిస్థితి ఇది. సాధారణంగా వర్షం కురిశాక వాతావరణం చల్లబడి ఆహ్లాదకరంగా మారడం, కొన్నిసార్లు చలి వేయడం కనిపించేవి. కానీ ప్రస్తుతం భిన్నమైన వాతావరణ పరిస్థితుల్లో ఒక్కసారిగా ఉక్కపోత, వెంటనే వాన.. కాసేపటికే తిరిగి ఎండ తీవ్రత కనిపిస్తున్నాయి. 

ఇది కూడా చదవండి: ఇది మూసీనేనా..? స్వచ్ఛ జల ప్రవాహం చూసి సెల్ఫీలు

మరిన్ని వార్తలు