1,41,340 మందికి సీట్లు

22 Sep, 2020 03:58 IST|Sakshi

మొదటి దశ డిగ్రీ ప్రవేశాల వివరాలు ప్రకటించిన దోస్త్‌

కొత్త కోర్సు డేటా సైన్స్‌లో 2,598 మందికి సీట్లు

26 వరకు ఆన్‌లైన్‌లో సెల్ఫ్‌ రిపోర్టింగ్‌కు అవకాశం

సీట్లు పొందిన వారిలో బాలికలే అత్యధికం

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాలకు నిర్వహించిన మొదటి దశ ఆన్‌లైన్‌ ప్రక్రియలో 1,41,340 మంది విద్యార్థులకు సీట్లు లభించాయి. ఈ మేరకు డిగ్రీ ఆన్‌లైన్‌ సర్వీసెస్‌ తెలంగాణ (దోస్త్‌) సోమవారం సీట్ల కేటాయింపును ప్రకటించింది. ఉన్నత విద్యా మండలి చైర్మన్‌ ప్రొఫెసర్‌ తుమ్మల పాపిరెడ్డి, కళాశాల విద్యా కమిషనర్‌ నవీన్‌ మిట్టల్, దోస్త్‌ కన్వీనర్, మండలి వైస్‌ చైర్మన్‌ ప్రొఫెసర్‌ ఆర్‌.లింబాద్రి, సీజీజీ డీజీ రాజేంద్ర నిమ్జే, కళాశాల విద్య ఏజీవో బాలభాస్కర్‌ తదితరులు వివరాలు వెల్లడించారు. మొదటి దశలో 1,71,275 మంది విద్యార్థులు రిజిస్ట్రేషన్‌ చేసుకోగా, 1,53,323 మంది ఆప్షన్లు ఇచ్చుకున్నారు. వీరిలో 1,41,340 మందికి సీట్లు లభించాయి. ఈసారి సీట్లు పొందిన వారిలో బాలికలే అత్యధికం.
మొదటి ఆప్షన్‌ కాలేజీల్లోనే

అధిక శాతం మందికి..
ఈసారి తక్కువ వెబ్‌ ఆప్షన్లు ఇచ్చినందున 11,983 మందికి సీట్లు లభించలేదు. విద్యార్థులు ఎంచుకున్న జిల్లా, కోర్సు, ప్రభుత్వ కాలేజీలో సీట్లు పొందిన వారు 282 మంది ఉన్నారు. ఈసారి కొత్తగా ప్రవేశపెట్టిన బీఎస్సీ డేటా సైన్స్‌ కోర్సులో మొత్తం 6,780 సీట్లు అందుబాటులో ఉండగా, 2,598 మందికి సీట్లు లభించాయి. సీట్లు పొందిన మొత్తం విద్యార్థుల్లో 65,167 మంది (46.10శాతం) బాలురు, 76,173 మంది (53.90 శాతం) బాలికలు ఉన్నారు. రాష్ట్రంలో మొత్తం 982 కాలేజీల్లో 4,07,390 సీట్లు ఉండగా, మొదటి దశ సీట్ల కేటాయింపు 1,41,340 (34.69 శాతం) తరువాత ఇంకా 2,66,050 సీట్లు ఖాళీగా ఉన్నాయి. చాయిస్‌ బేస్డ్‌ క్రెడిట్‌ సిస్టం వల్ల ఈసారి విద్యార్థులు కొత్త కాంబినేషన్లు ఎంచుకున్నారు. గతేడాది 174 రకాల కాంబినేషన్లతో కోర్సులు ఉంటే ఈసారి 501 రకాల కాంబినేషన్లతో కోర్సులు అందుబాటులోకి తెచ్చారు. ఇక ఇంటర్‌లో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థుల్లో ఎక్కువగా బాలికలే ఉన్నారు. వారిలో అధికశాతం మందికి యూనివర్సిటీ కాలేజీలు, నిజాం కాలేజీల్లో సీట్లు లభించాయి. 

ఈ జాగ్రత్తలు తప్పనిసరి..
మొదటి దశ కౌన్సెలింగ్‌లో సీట్లు పొందిన విద్యార్థులు కచ్చితంగా మొదట ఫీజు చెల్లించి సీటు కన్‌ఫర్మ్‌ చేసుకోవాలని, అలా చేయకపోతే ఈ సీటు ఉండదని దోస్త్‌ కన్వీనర్‌ ప్రొఫెసర్‌ ఆర్‌.లింబాద్రి పేర్కొన్నారు. ‘విద్యార్థులు సీటు కన్‌ఫర్మ్‌ చేసుకున్న తరువాత రెండో దశ, మూడో దశ కౌన్సెలింగ్‌లో పాల్గొనవచ్చు. ఇపుడు నచ్చిన కాలేజీలోనే సీటు వచ్చిందనుకుంటే రెండు, మూడు దశల కౌన్సెలింగ్‌లో పాల్గొనవద్దు. ప్రస్తుత కాలేజీ నచ్చకపోతేనే రెండో దశ కౌన్సెలింగ్‌లో ఇంతకంటే నచ్చిన కాలేజీల్లో మాత్రమే ఆప్షన్లు ఇచ్చుకోవాలి. అపుడు ఆ కాలేజీలో సీటు వస్తే సరే. లేదంటే ఇపుడున్న సీటు అలాగే ఉంటుంది.

ఒకవేళ రెండు మూడు దశల్లో ఇపుడు సీటు వచ్చిన కాలేజీ కంటే సాధారణ కాలేజీలకు ఆప్షన్‌ ఇస్తే, వాటిల్లో ఏదేని కాలేజీల్లో సీటు లభిస్తే ఇపుడు వచ్చిన సీటు ఆటోమెటిక్‌గా రద్దు అవుతుంది. కాబట్టి తమకు బెటర్‌ అనుకున్న దానికే ఆప్షన్‌ ఇవ్వాలి. ఇపుడు చెల్లించిన ఫీజు విషయంలో ఎలాంటి ఆందోళన అక్కర్లేదు. రెండు, మూడు దశలో సీటు వచ్చినా ఆ కాలేజీ ఫీజు ప్రకారమే ఇపుడు చెల్లించిన మొత్తాన్ని సర్దుబాటు చేస్తారు. సీట్లు పొందిన విద్యార్థులకు ఎస్‌ఎంఎస్‌ ద్వారా మొబైల్‌కు వస్తాయి. దోస్త్‌ వెబ్‌సైట్‌లో విద్యార్థులు లాగిన్‌ అయి సీటు కేటా యింపు ఫీజు రూ. 500/రూ.1000 చెల్లించి ఈనెల 26లోగా సెల్ఫ్‌ రిపోర్టింగ్‌ ద్వారా సీటు కన్‌ఫర్మ్‌ చేసుకోవాలి’అని సూచించారు. 

మరిన్ని వార్తలు