ఫోన్లు కట్టేయండి

26 Jul, 2021 03:00 IST|Sakshi

మొబైల్స్‌ వాడకంపై ప్రభుత్వ ఉద్యోగులకు మార్గదర్శకాలు 

ఉద్యోగుల పనితీరుపై వచ్చిన ఫిర్యాదులతో ప్రభుత్వ చర్యలు 

సాధ్యమైనంత మేర సెల్‌ఫోన్‌ వినియోగం తగ్గించాలని ఆదేశం 

నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరిక 

సాక్షి, ముంబై: పనివేళల్లో మొబైల్‌ ఫోన్ల వినియోగంపై ప్రభుత్వం తమ ఉద్యోగులు, అధికారులకు ఆంక్షలు విధించింది. ఈ మేరకు సాధారణ పరిపాలనా విభాగం (జీఏడీ) కొన్ని మార్గదర్శకాలను జారీచేసింది. వీటిని ఉల్లంఘించిన అధికారులు, ఉద్యోగులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ప్రస్తుత కాలంలో ప్రతీ ఒక్కరికి మొబైల్‌ ఫోన్‌ జీవితంలో ఒక భాగమైన సంగతి తెలిసిందే. పనులు పక్కన పెట్టి వీడియో గేమ్‌లు ఆడటం, చాటింగ్‌ చేయడం, బంధువులు, మిత్రులతో గంటల తరబడి మాట్లాడటం లాంటివి విపరీతంగా పెరిగిపోయాయి. దీనికి ప్రభుత్వ ఉద్యోగులు కూడా అతీతం కాదు. మంత్రాలయతో పాటు వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసే అనేక మంది ఉద్యోగులు మొబైల్‌ ఫోన్‌ వినియోగిస్తూ పనిపై అంత దృష్టి పెట్టడం లేదని ప్రభుత్వానికి ఇప్పటికే అనేక ఫిర్యాదులు వెళ్లాయి. ఉద్యోగులు కూడా గంటల తరబడి ఫోన్‌లలో మాట్లాడుతున్నారు.

కొందరు సీట్లలో కూర్చొని మాట్లాడలేక బయటకు వెళ్లి మరీ ఫోన్‌ కబుర్లలో మునిగి తేలుతున్నారు. మరికొందరు తమ మొబైల్‌ ఫోన్‌లలో వీడియో గేమ్‌లు ఆడుతూ కాలయాపన చేస్తున్నట్లు ప్రభుత్వానికి ఫిర్యాదులు వెళ్లాయి. ఉన్నతాధికారులు మొదలుకొని కింది స్థాయి ఉద్యోగుల వరకు అందరి ప్రవర్తన దాదాపు ఇలాగే ఉంది. దీంతో వివిధ ప్రాంతాల నుంచి పనుల నిమిత్తం కార్యాలయాలకు వచ్చే సామాన్య ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వారి పనులు సకాలంలో పూర్తి కావడం లేదు. ఫలితంగా పలుమార్లు కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వస్తోంది. కొందరి నిర్వాకం వల్ల క్రమశిక్షణతో పనిచేసే ఉద్యోగులకు కూడా చెడ్డ పేరు వస్తోంది. కొందరు ఉద్యోగుల వల్ల ప్రభుత్వ ప్రతిష్ట దెబ్బతింటోంది.

ప్రభుత్వ ఉద్యోగుల పనితీరుపై ఇప్పటికే అనేక రంగాల నుంచి సైతం విమర్శలు వస్తున్నాయి. వీటన్నింటిని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ప్రస్తుతం మార్గదర్శకాలను జారీ చేసింది. అయితే, దీనిపై అధికారులు, ఉద్యోగులు, ఉద్యోగ సంఘాలు ఎలా స్పందిస్తాయనే దానిపై ఉత్కంఠ నెలకొంది. గతంలో రాష్ట్ర ప్రభుత్వం తమ ఉద్యోగులకు డ్రెస్‌ కోడ్‌ అమలుచేద్దామని నిర్ణయించిన సంగతి తెలిసిందే. కార్యాలయాల్లో విధులకు హాజరయ్యే పురుష ఉద్యోగులు, మహిళా ఉద్యోగులు ఎలాంటి దుస్తులు ధరించాలనే దానిపై అప్పట్లో మార్గదర్శకాలు కూడా విడుదల చేసింది. ఆ ప్రకారమే దుస్తులు ధరించి కార్యాలయానికి రావాలని సూచించింది. దీనిపై ఉద్యోగులు, ఉద్యోగ సంఘాల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో ఆ మార్గదర్శకాలు అమలుకు నోచుకోలేదు. ఇప్పుడు మొబైల్‌ ఫోన్‌ వినియోగంపై తాజాగా విధించిన ఆంక్షలపై ఉద్యోగుల నుంచి ఎలాంటి స్పందన వస్తుందనేది ఆసక్తిగా మారింది.  

ప్రభుత్వ మార్గదర్శకాలు 
విధి నిర్వహణలో ఉండగా సాధ్యమైనంత వరకు మొబైల్‌ ఫోన్‌ వినియోగించరాదు.  
అత్యవసరమైతే తప్ప ఫోన్‌ వాడరాదు. ఒకవేళ బయట నుంచి కాల్‌ వస్తే తొందరగా మాట్లాడి ముగించాలి.  
అధికారిక కాల్స్‌ కోసం ల్యాండ్‌లైన్‌ వినియోగానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. 
ఫోన్‌లో వివాదాస్పద సంభాషణలు చేయకూడదు. కుటుంబ కలహాల గురించి అసభ్యకరంగా, బిగ్గరగా మాట్లాడకూడదు. 
సంక్షిప్త సందేశాలకే (ఎస్‌ఎంఎస్‌) ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలి. 
విధులు పూర్తయ్యేంత వరకు ఫోన్‌ను సైలెంట్‌ మోడ్‌లో పెట్టాలి.  
మంత్రుల చాంబర్‌లలో సమావేశాలు జరుగుతున్నప్పుడు అధికారులు, ఉద్యోగులు రహస్యంగా చాటింగ్‌ చేయడం, సందేశాలు పంపుకోవడం, వాట్సాప్‌ వాడటం వంటివి పూర్తిగా మానేయాలి.   

మరిన్ని వార్తలు