పెద్దపులి టెర్రర్‌: యువకుడ్ని చంపి..

11 Nov, 2020 15:24 IST|Sakshi

కొమరం భీం: జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఓ పెద్దపులి యువకుడిని పొట్టన పెట్టుకుంది. ఈ సంఘటన అసిఫాబాద్‌లోని దహెగాం మండలం దిగిడా గ్రామంలో జరిగింది. మంగళవారం పొలంలో పనిచేసుకుంటున్న విఘ్నేష్‌ అనే యువకుడిపై పులి హఠాత్తుగా దాడి చేసింది. అనంతరం అతడ్ని చంపి మృతదేహాన్ని అడవిలోకి లాక్కెళ్లిపోయింది. విషయం తెలుసుకున్న అటవీ శాఖ అధికారులు విఘ్నేష్ మృతుదేహం కోసం గాలింపు చర్యలు చేపట్టారు. కాగా, పులి దాడితో చుట్టు ప్రక్కలి గ్రామాల్లోని ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.

గత నెల 12వ తేదీన ఏటూరునాగారం వైల్డ్‌ లైఫ్‌ పరిధి కన్నాయిగూడెం మండలంలోని అటవీ ప్రాంతాల్లో పులి సంచరించినట్లుగా అటవీ శాఖ అధికారులు గుర్తించారు. అనంతరం 20 రోజుల సమయంలో ఏటూరునాగారం అడవుల్లో పులి జాడ ఎక్కడా కనిపించలేదు. అయితే వారం పది రోజుల క్రితం మహబూబాబాద్‌ జిల్లా గూడురు, కొత్తగూడ అడవుల్లో పులి సంచరిస్తున్నట్లు అధికారులు గుర్తించగా.. తాజాగా ఈ నెల 6న వరంగల్‌ రూరల్‌ జిల్లా నర్సంపేట నియోజకవర్గం ఖానాపురం మండలంలోని బండమీది మామిడితండా అడవుల్లో పులి సంచరించినట్లు అడుగు జాడలు కనిపించాయి. ( దుబ్బాక ఫలితం.. గందళగోళంలో కాంగ్రెస్‌ )

కాగా ఏటూరునాగారం అభయారణ్యానికి కొత్తగూడ, పాకాల అభయారణ్యాలకు కనెక్టివిటీ ఉండడంతో ఒకే పులి ఆయా అడవుల్లో సంచరిస్తుందా లేదా మరోటి ఉందా అనే అనుమానంలో అధికారులు ఉన్నారు. ఈ మేరకు స్థానికంగా ఉన్న గిరిజనులు, గొత్తికోయ గూడేల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. ఇదిలా ఉండగా గోదావరి సరిహద్దు ప్రాంతాల్లో నాలుగు పులులు సంచరిస్తున్నట్లుగా రెండు నెలలుగా వార్తలు వినిపిస్తుండడంతో పులుల సంఖ్య అంశం సమస్యగా మారింది.

>
మరిన్ని వార్తలు