సత్ఫలితాలిస్తున్న అటవీశాఖ చర్యలు.. అమ్రాబాద్ టైగర్ రిజర్వ్‌లో 21కి చేరిన పులులు

3 Oct, 2022 10:54 IST|Sakshi

సాక్షి, నాగర్‌కర్నూల్‌: నల్లమల అటవీప్రాంతంలో పులుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. కోర్‌ ఏరియా విస్తీర్ణంలో దేశంలోనే రెండో స్థానంలో ఉన్న అమ్రాబాద్‌ టైగర్‌ రిజర్వ్‌ (ఏటీఆర్‌) పరిధిలో ఇప్పటివరకు 21 పులులు కెమెరాకు చిక్కాయి. నేషనల్‌ టైగర్‌ కన్జర్వేషన్‌ అథారిటీ (ఎనీ్టసీఏ) నాలుగేళ్లకు ఒకసారి పులుల గణన చేపడుతుంది. 2018లో విడుదల చేసిన నివేదికలో అమ్రాబాద్‌ రిజర్వ్‌లో 12 పులులు ఉండగా, గతేడాది నాటికి వాటి సంఖ్య 16కి పెరిగింది. తాజాగా అటవీశాఖ అధికారులు ఏర్పాటు చేసిన ట్రాప్‌ కెమెరాల్లో 21 పులులు చిక్కాయి. పులుల సంతతి పెంచేందుకు అటవీశాఖ చేపడుతున్న చర్యలు సత్ఫలితాలిస్తున్నాయి.  

పెరుగుతున్న ఆడ పులులు 
అమ్రాబాద్‌ టైగర్‌ రిజర్వ్‌ మొత్తం విస్తీర్ణం 2,611.39 చ.కి.మీ. కాగా, ఇందులో కోర్‌ ఏరియా 2,166.37 చ.కి.మీ. కోర్‌ ఏరియాపరంగా ఏటీఆర్‌ దేశంలోనే రెండో అతిపెద్ద టైగర్‌ రిజర్వ్‌. ఇక్కడ సుమారు 200 వరకు పులులు స్వేచ్ఛగా సంచరించేందుకు సరిపడా అభయారణ్యం ఉందని అధికారులు చెబుతున్నారు. సాధారణంగా పులులు రెండున్నర ఏళ్ల తర్వాత సంతానోత్పత్తికి సిద్ధంగా ఉంటాయి. అమ్రాబాద్‌ రిజర్వ్‌లో సంతానోత్పత్తికి అనుకూలంగా ఉన్న ఆడ పులుల సంఖ్య పెరిగిందని అటవీ అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం అలాంటి ఆడపులులు ఏడు ఉండగా, మరో ఆరు పులి పిల్లలు ఉన్నాయి. 


ప్రజల మద్దతుతో... 
ఎనీ్టసీఏ మార్గదర్శకాల ప్రకారం పులుల సంరక్షణ కోసం అటవీశాఖ ప్రత్యేక కార్యక్రమాలను అమలు చేస్తోంది. పులుల వేటను పూర్తిస్థాయిలో కట్టడి చేయడంతోపాటు స్థానిక ప్రజల్లో పులుల ఆవశ్యకతపై క్షేత్రస్థాయిలో అవగాహన కలి్పస్తోంది. తద్వారా పులుల సంరక్షణ కోసం స్థానిక ప్రజల మద్దతు పొందుతోంది. పులులకు ఆహారమయ్యే వన్యప్రాణుల సంతతి పెంచేందుకు ప్రత్యేకంగా 300 ఎకరాల్లో గడ్డిని పెంచుతున్నారు. నల్లమలలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల సరిహద్దుగా ఉన్న కృష్ణానది తీరప్రాంతాల్లో పులులు ఎక్కువగా సంచరిస్తుంటాయి. ఆడ పులులు, పిల్లల సంరక్షణ కోసం కృష్ణానది దాటి రాకపోకలు సాగిస్తుంటాయి. ఈ క్రమంలో కృష్ణాతీరంలో అక్రమంగా చేపల వేట కొనసాగించే వారితో పులులకు ముప్పు పొంచి ఉండటంతో అటవీశాఖ ప్రత్యేక చర్యలు చేపట్టింది. జాయింట్‌ రివర్‌ పెట్రోలింగ్‌ ద్వారా సుమారు 30 కి.మీ. పరిధిలో పులులు ఇరురాష్ట్రాల సరిహద్దుల్లో స్వేచ్ఛగా సంచరించేందుకు అవకాశం కలి్పస్తున్నారు. 

పులుల ఆవాసాలకు ఇబ్బంది లేకుండా.. 
అమ్రాబాద్‌ టైగర్‌ రిజర్వ్‌లో పులుల సంరక్షణకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నాం. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య జాయింట్‌ రివర్‌ పెట్రోలింగ్‌ చేపట్టాం. దీనిని ఇంకా విస్తరిస్తాం. పులుల ఆవాసాలకు ఇబ్బంది కలగకుండా స్థానికులకు అవగాహన కలి్పస్తున్నాం. ప్రజలు సైతం ఎంతగానో సహకరిస్తున్నారు.  
– రోహిత్‌ గోపిడి, జిల్లా అటవీశాఖ అధికారి
చదవండి: పోలీసు కొలువులకు తగ్గిన కటాఫ్‌

మరిన్ని వార్తలు