కారిడార్‌లోనే సంచారం: కొత్త, పాత పులుల మధ్య ఘర్షణ

6 Jan, 2021 13:24 IST|Sakshi

కవ్వాల్‌ కోర్‌ ఏరియాలో కనిపించని పులి

టైగర్‌ కారిడార్‌లోనే ఎక్కువగా సంచారం

తాజాగా రెండు పిల్లలకు జన్మనిచ్చిన ‘ఎస్‌6’

సాక్షి, మంచిర్యాల: కవ్వాల్‌ పులుల అభయారణ్యంలో విచిత్ర పరిస్థితి.. పులులు ఉంటాయని భావించే కోర్‌ ప్రాంతం (టైగర్‌ రిజర్వ్‌)లో కంటే టైగర్‌ కారిడార్‌ (పులి రాకపోకలు సాగించే) ప్రాంతాల్లోనే అవి జీవనాన్ని సాగిస్తున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో 2 లక్షల ఎకరాలకుపైగా విస్తరించిన కవ్వాల్‌ టైగర్‌ రిజర్వ్‌ పరిధిలోని కేవలం ఆసిఫాబాద్‌ జిల్లా కాగజ్‌నగర్‌ డివిజన్‌ నుంచి మంచిర్యాల జిల్లా చెన్నూర్‌ డివిజన్‌ వరకే పులులు సంచరిస్తున్నాయి. ఇప్పటికే 12 పులుల వరకు అక్కడే స్థిర ఆవాసం ఏర్పర్చుకున్నాయి. గతేడాది మహారాష్ట్రలోని తడోబా నుంచి వలస వచ్చిన ఎస్‌6 అనే ఆడపులి తాజాగా కాగజ్‌నగర్‌ డివిజన్‌లోనే రెండు పిల్లలకు జన్మనిచ్చింది. ఇటీవల తల్లి పులి తన రెండు నెలల వయసున్న కూనలతో పశువును వేటాడి తింటూ కెమెరాకు చిక్కింది. వీటితోపాటు ఈ కారిడార్‌ పరిధిలోనే ఫాల్గుణ సంతతికి చెందిన మరో రెండు పులులు గర్భంతో ఉన్నట్లు అధికారులు గుర్తించారు. గతంలో ఫాల్గుణ అనే ఆడపులి రెండు ఈతల్లో తొమ్మిది పిల్లలకు జన్మనిచ్చింది.

దీంతో ఈ ప్రాంతంలో పులుల సంతతి పెరిగింది. దేశంలో పులుల చరిత్రలో అభయారణ్యం వెలుపల ఓ పులి రెండుసార్లు ఒకేచోట ప్రసవించడం అరుదైన ఘటనగా గుర్తించిన కేంద్రం.. ఫాల్గుణ పేరుతో పోస్టల్‌ స్టాంపును విడుదల చేసింది. మహారాష్ట్రలోని తిప్పేశ్వర్, తడోబా నుంచి వలస వచ్చి కాగజ్‌నగర్, మంచిర్యాల జిల్లా ప్రాణహిత తీరం చెన్నూరు డివిజన్‌ మీదుగా పెద్దపల్లి, భూపాలపల్లి, వరంగల్‌ రూరల్‌ జిల్లాల మీదుగా చివరకు భద్రాది కొత్తగూడెం వరకూ ఇక్కడి పులులు వెళ్లాయి. ఛత్తీస్‌గఢ్‌లోని ఇంద్రావతి టైగర్‌ రిజర్వుకు సైతం ఫాల్గుణ సంతతికి చెందిన ఓ పులి వలస వెళ్లింది. కారిడార్‌లో పులుల సంచారం పెరుగుతున్న క్రమంలోనే మనుషులపైనా దాడులు జరుగుతున్నాయని భావిస్తున్నారు.(చదవండి: వేటగాళ్ల పాపమా?.. బర్డ్‌ఫ్లూ శాపమా?)

కవ్వాల్‌ కోర్‌లో కనిపించని పులి.. కొత్తపాత పులుల మధ్య ఘర్షణ 
రూ. కోట్లు ఖర్చు చేసి, ఎన్ని రక్షణ చర్యలు చేపట్టినా కవ్వాల్‌ కోర్‌ పరిధిలో ఒక్క పులీ కనిపించట్లేదు. కవ్వాల్‌ కోర్‌ ప్రాంతంగా ఉన్న జన్నారం డివిజన్‌ పరిధిలో అభయారణ్యాన్ని గుర్తించిన రెండేళ్లకు ఓ పులి వచ్చి.. కొన్నాళ్లకే వెళ్లిపోయింది. అనంతరం వచ్చిన ఓ మగ పులి జే1.. మూడు నెలల క్రితం ఆడతోడు వెతుక్కుంటూ కాగజ్‌నగర్‌ డివిజన్‌లోకే వెళ్లింది. పులులు ఇక్కడే ఉంటాయని భావించి అధికారులు కోర్‌ పరిధిలో గడ్డిక్షేత్రాల, శాకాహార జంతువుల పెంపకం చేపట్టినా ఫలితం కనిపించలేదు. ప్రస్తుతం చలికాలంలో ఆడ–మగ జతకట్టే సమయం కావడంతో టైగర్‌ కారిడార్‌లో తమ ఆవాసంలోకి వచ్చిన కొత్త పులులకు పాతవాటికి మధ్య ఘర్షణలు జరుగుతున్నాయి.

ఈ కారణంతోనే గత డిసెంబర్‌లో కోపంగా ఉన్న పులి పంజాకు ఇద్దరు బలైనట్లు అధికారులు గుర్తించారు. దీంతో పులుల ఆవాసాలను ఎక్కడికక్కడ గుర్తించి ఏ పులి ఎక్కడ తిరుగుతుందో.. ఇక్కడ సంచరించే ఆడ, మగ పులులతో పాటు కొత్తగా వచ్చే పులులు ఎలా ప్రవర్తిస్తున్నాయో రోజూ అంచనా వేస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేక బృందాలు పని చేస్తున్నాయి. అడవిలో పలుచోట్ల కెమెరాలు బిగించారు. 

పులిని బంధించేందుకు ప్రయత్నాలు 
మరోవైపు గత డిసెంబర్‌లో ఇద్దరిని చంపిన పులిని బంధించే ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయి. ప్రత్యేకంగా పులి సంచరించే ప్రాంతంలో ఎరగా పశువును వేసి.. పులి రాగానే వెటర్నరీ డాక్టర్‌ పర్యవేక్షణలో మత్తు మందు వదిలి బంధించాలని చూస్తున్నారు. పులి సంచారాన్ని గమనించేందుకు ఐదుచోట్ల మంచెలు ఏర్పాటు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు