విద్యుత్‌ బిల్లులు భారం కాకుండా ఉండాలంటే.. ఇదొక్కటే మార్గం!

20 Mar, 2023 11:33 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: భవిష్యత్తులో చార్జీలు పెరగకుండా.. విద్యుత్‌ బిల్లులు భారం కాకుండా ఉండాలంటే.. కరెంటు వినియోగంలో పొదుపు ఒక్కటే మార్గమని అంటున్నారు తెలంగాణ రాష్ట్ర విద్యుత్‌ నియంత్రణ మండలి(ఈఆర్సీ) చైర్మన్‌ తన్నీరు శ్రీరంగారావు. రాష్ట్రంలో పీక్‌ విద్యుత్‌ డిమాండ్‌ భారీగా పెరిగే వేళల్లో నిరంతర విద్యుత్‌ సరఫరా కొనసాగించేందుకు రాష్ట్ర విద్యుత్‌ పంపిణీ సంస్థ(డిస్కం)లు గరిష్టంగా యూనిట్‌కు రూ.12 ధరతో బహిరంగ మార్కెట్‌ నుంచి విద్యుత్‌ కొనుగోళ్లు జరుపుతున్నాయి.

దీంతో డిస్కంల విద్యుత్‌ కొనుగోళ్ల వ్యయం భారీగా పెరిగిపోతోంది. ఈ వ్యయభారాన్ని చివరకు వినియోగదారులపై బిల్లులను మరింతగా పెంచి బదిలీ చేయకతప్పదని ఆయన స్పష్టం చేశారు. రెక్కాడితే కాని డొక్కాడని నిరుపేదలకు ఈ బిల్లులు మోయలేని భారంగా మారుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. అయితే, విద్యుత్‌ పొదుపు చర్యలను పాటించి సలువుగా విద్యుత్‌ బిల్లులను తగ్గించుకోవచ్చని ఆయన స్పష్టం చేశారు.  

అవసరం లేకున్నా విద్యుత్‌ను వృథాగా వినియోగిస్తుండడంతోనే బిల్లులు అధికంగా వస్తున్నాయని, విద్యుత్‌ పొదుపుపై రాష్ట్రంలో మరింత అవగాహన పెంచాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఈ మేరకు ఈఆర్సీ తరఫున వినియోగదారులకు సూచనలు, సలహాలతో  ఆదివారం ఆయన ఓ పత్రికా ప్రకటన విడుదల చేశారు.   


తన్నీరు శ్రీరంగారావు

మరిన్ని వార్తలు