అవసరమైతే సీఎం కాళ్లు మొక్కుతా..

10 Oct, 2020 12:53 IST|Sakshi

ఉద్యోగుల సమస్యల పరిష్కారమే లక్ష్యం

తప్పుడు నేతల మాటలు విని వీధిన పడొద్దు

టీఎన్జీవోన్‌ నూతన అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్‌

సాక్షి, హన్మకొండ: ఉద్యోగుల సమస్యలు పరిష్కారం కోసం ప్రభుత్వంతో సామరస్యపూర్వక ధోరణితో పోరాడుతామని, అవసరమైతే ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ముఖ్యమంత్రి కాళ్లు మొక్కడానికి కూడా సిద్ధమేనని టీఎన్జీవోస్‌ కేంద్ర సంఘం నూతన అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్‌ అన్నారు. నాడు తెలంగాణ ఉద్యమంలో, నేడు తెలంగాణ అభివృద్దిలో ప్రతీ ఉద్యోగి ముఖ్యమంత్రి వెంట కండువా లేని టీఆర్‌ఎస్‌ కార్యకర్తల్లా పనిచేస్తున్నారని తెలిపారు. టీఎన్జీవోస్‌ వరంగల్‌ జిల్లా కౌన్సిల్‌ సమావేశం, కేంద్ర సంఘం నూతన నాయకులకు అభినందన, పూర్వ అధ్యక్షులు కారం రవీందర్‌రెడ్డి వీడ్కోలు సమావేశం హన్మకొండలోని అంబేద్కర్‌ భవన్‌లో శుక్రవారం జరిగింది. టీఎన్జీవోస్‌ జిల్లా అధ్యక్షుడు కోలా రాజేష్‌కుమార్‌ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో విశిష్ట అతిథులుగా ప్రభుత్వ చీఫ్‌ విప్‌ దాస్యం వినయ్‌భాస్కర్, ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్, రాష్ట్ర నూతన కార్యదర్శి రాయికంటి ప్రతాప్, జేఏసీ ఛైర్మన్‌ పరిటాల సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజేందర్‌ మాట్లాడుతూ పరిస్థితులను అర్థం చేసుకోకుండా కొందరు తప్పుడు నాయకులు, తప్పుడు సంఘాల మాటలు విని ఉద్యోగులు వీధిన పడొద్దని హితవు పలికారు. 70ఏళ్ల చరిత్ర కలిగిన టీఎన్జీవోస్‌ సంఘం అధికారంలో ఉన్నవారికి అనుకూలంగా ఉంటూనే సమస్యలు పరిష్కారం చేస్తున్న వైనాన్ని చరిత్ర చెబుతోందన్నారు. ఉద్యోగులకు దసరా లోపు కనీసం రెండు డీఏలను ప్రభుత్వం ప్రకటిస్తుందని ప్రభుత్వ పెద్దలు హామీ ఇచ్చారన్నారు. 

పీఆర్‌సీ కమిషన్‌ రాజీనామా చేయాలి
మూడు నెలల కాల పరిమితితో ఏర్పాటు చేసిన పీఆర్‌సీ కమిషన్‌ మూడేళ్లుయినా నివేదిక ఇవ్వకపోవడంతో ఉద్యోగులు తీవ్రంగా నష్టపోతున్నారని రాజేందర్‌ అన్నారు. ఉద్యోగుల సమస్య పరిష్కారానికి ప్రతిపాదనలు చేయలేని కమిషన్‌ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. ఉద్యోగులు ఇప్పటికే 14వ వీఆర్‌సీ స్థానంలో 11పీఆర్‌సీ కోసం పోరాడాల్సి వస్తోందన్నారు. అది కూడా ఇప్పుడు ఇస్తారో తెలియని ఆందోళనలో ఉద్యోగ లోకం ఉందని తెలిపారు. ఈ మేరకు ముఖ్యమంత్రి ఉద్యోగులను చర్చలకు పిలిచి సమస్యలు పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. కాగా, టీఎన్జీవోస్‌ కేంద్ర సంఘం తాజా మాజీ అధ్యక్షుడు కారం రవీందర్‌రెడ్డికి గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ స్థానం నుంచి టీఆర్‌ఎస్‌ పోటీకి అవకాశం కల్పించాలని సమావేశంలో నేతలు కోరారు. తద్వారా ఉద్యోగుల గొంతుక అక్కడ వినిపించే అవకాశముంటుందని తెలిపారు. 

తెలంగాణలో వినతులు... ఆంధ్రాలో జీఓలు
తెలంగాణ ప్రభుత్వానికి ఉద్యోగులు సమస్యలపై వినతులు ఇస్తుంటే ఇక్కడ పరిష్కారం కావడం లేదని మామిళ్ల రాజేందర్‌ అన్నారు. అయితే, ఇదే వినతులకు సంబంధించి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేస్తోందని తెలిపారు. ఇక్కడి ఉద్యోగం పోరాటంతో అక్కడి ఉద్యోగ సోదరులకు లాభం జరుగుతోందని చెప్పారు. అదేవిధంగా సీఎం కేసీఆర్‌ నుంచి కూడా సమస్యలు పరిష్కారానికి త్వరలో పిలుపు వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కాగా, ఉద్యోగుల పెండింగ్‌ సమస్యలకు సంబంధించి 18డిమాండ్లకు కౌన్సిల్‌ ఏకగ్రీవంగా ఆమోదించింది. ఇక రాష్ట్ర నూతన అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్‌తో పాటు పూర్వ కారం వీందర్‌రెడ్డి, జేఏసీ చైర్మన్‌ పరిటాల సుబ్బారావును ఘనంగా సత్కరించారు. ఈ సమావేశం ఆద్యంతం ఎమ్మెల్సీ ఎన్నికల ప్రస్తావనతో కొనసాగగా, కరోనాను పట్టించుకోకుండా నేతల పలకరింపులు, సత్కారాలు, సన్మానాలు సాగాయి.

రవన్నకు మంచి హోదా
ప్రభుత్వ చీఫ్‌ విప్‌ దాస్యం వినయ్‌భాస్కర్‌ మాట్లాడుతూ ఉద్యోగ విరమణ చేసిన కారం రవీందర్‌రెడ్డిను ముఖ్యమంత్రికి ఒకరు సిఫారసు చేయాల్సి అవసరం లేదని తెలిపారు. ఆయనతో పాటు జిల్లా ఉద్యోగ నాయకుల గురించి సీఎంకు పూర్తిగా తెలుసనని చెప్పారు. ఎమ్మెల్సీ హోదా కావొచ్చు, మరొకటైనా కానీ త్వరలో రవీందర్‌రెడ్డిని మంచి హోదాలో చూస్తామని తెలిపారు. కాగా, కారం రవీందర్‌రెడ్డి తొలుత హన్మకొండ తహసీల్దార్‌ కార్యాలయంలో తన ఓటరు నమోదు దరఖాస్తు అందజేశారు. టీజీవోస్‌ అధ్యక్షులు జగన్మోహన్‌రావు, ట్రెసా అధ్యక్షుడు రాజ్‌కుమార్, నాయకులు ఇట్టె కిరణ్‌రెడ్డి, జిలుకర రమేష్, ఎంజీఎం సూపరిటెంటెండెంట్‌ నాగార్జునరెడ్డి, డీఎంహెచ్‌ఓ లలితాదేవితో పాటు రామినేని శ్రీనివాస్, చందు, పుల్లూరి వేణుగోపాల్, ఆకుల రాజేందర్, శ్యాంసుందర్, రామునాయక్, షఫీ, నర్సింహస్వామి తదితరులు పాల్గొన్నారు.

ఉద్యోగులందరూ ఓటరుగా నమోదు చేసుకోవాలి
హన్మకొండ చౌరస్తా: త్వరలో జరగనున్న వరంగల్, నల్గొండ, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కోసం డిగ్రీ అర్హత ఉన్న ఉద్యోగులందరూ ఓటర్లు నమోదు చేసుకోవాలని టీఎన్జీవోస్‌ కేంద్ర సంఘం అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్‌ సూచించారు. హన్మకొండలోని అలంకార్‌ జంక్షన్‌ సమీపాన ఉన్న టీఎన్జీఓఎస్‌ భవన్‌లో శుక్రవారం పట్టభద్రుల ఓటరు నమోదు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా రాజేందర్‌ మాట్లాడారు.

మరిన్ని వార్తలు