రిజిస్ట్రేషన్లకు లైన్‌క్లియర్‌

7 Jun, 2021 03:59 IST|Sakshi

నేటి నుంచి యథాతథంగా  కార్యకలాపాలు 

ప్రధాన సర్వర్‌లో తొలగిన సాంకేతిక సమస్య  

పెండింగ్‌తోపాటు తాజాగా స్లాట్‌ బుక్‌ చేసుకున్న డాక్యుమెంట్లకూ రిజిస్ట్రేషన్‌ 

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో రిజిస్ట్రేషన్‌ కార్యకలాపాలు సోమవారం నుంచి యథాతథంగా జరగనున్నాయి. హైదరాబాద్‌ గచ్చిబౌలిలోని స్టేట్‌ డాటా సెంటర్‌ (ఎస్‌డీసీ)లో ఉన్న ప్రధాన సర్వర్‌లో ఏర్పడిన సాంకేతిక సమస్యను గుర్తించి పరిష్కరించడంతో రిజిస్ట్రేషన్‌ లావాదేవీలకు ఇబ్బంది తొలగిపోయింది. రెండు రోజులుగా ఈ సమస్య పరిష్కారానికి స్టాంపులు, రిజిస్ట్రేషన్లశాఖ ఉన్నతాధికారులతోపాటు ప్రముఖ సాఫ్ట్‌వేర్‌ సంస్థల బృందం చేసిన ప్రయత్నాలు ఆదివారం మధ్యాహ్నానికిగానీ ఫలించలేదు. దీంతో ఐదు రోజులుగా నెమ్మదించిన రిజిస్ట్రేషన్ల కార్యకలాపాలు మళ్లీ సోమ వా రం నుంచి ఊపందుకోనున్నాయి.

ఆదివారం మధ్యాహ్నమే సమస్యను పరిష్కరించి రాష్ట్రం లోని అన్ని సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాల నెట్‌వర్క్‌ను పరిశీలించారు. అంతా సజావుగా పనిచేస్తుండడంతో సోమవారం నుంచి రాష్ట్రంలోని 141 సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో లావాదేవీలు మునుపటిలాగానే కొనసాగుతాయని ఉన్నతాధికారులు వెల్లడించారు. సర్వర్‌ మొరాయించడంతో ఐదు రోజులుగా పెండింగ్‌లో పడిన లావాదేవీలతోపాటు సోమవారం బుక్‌ చేసుకునే స్లాట్‌లకు సంబంధించిన లావాదేవీలను కూడా చేపడతామని వెల్లడించారు.  


వామ్మో.. సాఫ్ట్‌వేర్‌ 
రాష్ట్రంలోని 141 సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాలను ఐదు రోజులపాటు ఇబ్బంది పెట్టిన సమస్య చాలా చిన్నదని, అయితే దాన్ని గుర్తించడానికే సమయం పట్టిందని తెలుస్తోంది. ఎస్‌డీసీలో ఉన్న ప్రధాన సర్వర్‌ రాష్ట్రంలోని అన్ని సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాలను సమన్వయం చేస్తుంది. ఈ సర్వర్‌ ద్వారానే డాటా ట్రాన్స్‌ఫర్‌ అవుతుంది. ఈ డాటా ట్రాన్స్‌ఫర్‌ చేసేందుకు రూపొందించిన సాఫ్ట్‌వేర్‌లోని ఒక ఫైలు కరప్ట్‌ అయిందని సమాచారం. దీంతో రాష్ట్రవ్యాప్తంగా కార్డ్‌ అప్లికేషన్‌ ఓపెన్‌ కాలేదు. రెండు రోజులుగా ఎంత కుస్తీ పడుతున్నా ఈ ఫైల్‌ను గుర్తించలేకపోయారు. ఐటీ శాఖ ఆధ్వర్యంలో సాఫ్ట్‌వేర్‌ నిపుణుల టీం ప్రతి ఫైలును చెక్‌ చేయడంతో ఈ కరప్ట్‌ ఫైల్‌ దొరికింది. దీన్ని సరిచేయడంతో సమస్య పరిష్కారమైంది.  

మరిన్ని వార్తలు