‘టోల్‌’కు టోకరా!

6 Jan, 2021 01:35 IST|Sakshi

‘ఫాస్టాగ్‌’ మాటున చీటింగ్‌ కంటెయినర్లకు మినీగూడ్స్‌ ట్యాగ్‌లు..

టోల్‌ ఆదాయానికి గండికొడుతున్న వైనం

రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్నట్లు అనుమానాలు  

సాక్షి, కామారెడ్డి:జాతీయ రహదారులపై టోల్‌ప్లాజాల వద్ద వాహనదారులు నిరీక్షించే బాధ నుంచి విముక్తికి ఏర్పాటు చేసిన ఫాస్టాగ్‌ను కొందరు తమకు అనుకూలంగా మలుచుకుంటున్నారు. కంటెయినర్లు, భారీ వాహనాలకు టోల్‌ ట్యాక్స్‌ భారీగా వసూలు చేస్తుండటంతో ఫాస్టాగ్‌ తీసుకునేటప్పుడు తమ వాహనాన్ని మినీ వెహికల్‌గా నమోదు చేసుకుని తక్కువ పన్ను చెల్లించి దర్జాగా దౌడు తీస్తున్నారు.

ఇటీవల 44వ నంబర్‌ జాతీయ రహదారిపై ఓ టోల్‌ప్లాజా వద్ద ఓ ట్రాన్స్‌పోర్టు కంటెయినర్‌ ఫాస్టాగ్‌ స్కానింగ్‌ సందర్భంలో మాన్యువల్‌ స్కానింగ్‌ చేస్తున్న అక్కడి సిబ్బంది అనుమానించారు. కంటెయినర్‌కు రూ.255 ట్యాక్స్‌ చెల్లించాల్సి ఉండగా, వ్యాన్‌ పేరు మీద ఉన్న ట్యాగ్‌ ద్వారా రూ.75 చెల్లించినట్టు గుర్తించి కంటెయినర్‌ను నిలిపేశారు. దీంతో వాహన యజమానులు టోల్‌ ప్లాజా సిబ్బందితో మాట్లాడి వాహనాన్ని తీసుకెళ్లారు. 

రాష్ట్రవ్యాప్తంగా నడుస్తోందా..?
టోల్‌ప్లాజాల వద్ద నగదు చెల్లింపులకు ఎక్కువ సమయం పడుతున్న నేపథ్యంలోనే ఆలస్యం లేకుండా క్షణాల్లో వాహనాలు వెళ్లేందుకు నేషనల్‌ హైవే అథారిటీ ఆఫ్‌ ఇండియా ఆధ్వర్యంలో ఆయా టోల్‌ప్లాజాల దగ్గర ‘ఫాస్టాగ్‌’సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. దేశవ్యాప్తంగా జనవరి 1 నుంచి పూర్తి స్థాయిలో ఫాస్టాగ్‌ అమలు చేయడానికి చర్యలు తీసుకున్నారు. రాష్ట్రంలోని వివిధ జాతీయ రహదారులపై 21 టోల్‌ ప్లాజాలున్నాయి. అయితే కొన్నిచోట్ల పూర్తి స్థాయి పనులు పూర్తి కాకపోవడంతో ఫిబ్రవరి 15 వరకు సడలించారు. ఈ నేపథ్యంలోనే కొన్నిచోట్ల మాన్యువల్‌గా స్కానర్లను వాడుతున్నారు. వాహనం రాగానే అక్కడ పనిచేసే సిబ్బంది స్కానింగ్‌ యంత్రాన్ని చేతిలో పట్టుకుని వెళ్లి ట్యాగ్‌ను స్కాన్‌ చేస్తారు. అప్పుడు వాహనం ముందుకు కదులుతుంది.

అయితే ట్యాగ్‌ తీసుకునే సమయంలో భారీ వాహనాలకు సంబంధించి మినీ వాహనాల పేరుతో ట్యాగ్‌ అమర్చుకుని అక్రమాలకు పాల్పడుతున్నట్టు తెలుస్తోంది. నిత్యం వివిధ రూట్లలో తిరిగే భారీ లారీలు, కంటెయినర్లు, ఇతర వాహనాలు భారీ పన్నుల నుంచి తప్పించుకునేందుకు తప్పుడు పద్ధతులకు ఎగబడుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా భారీ ఎత్తున ఈ అక్రమ దందా నడుస్తున్నట్టు తెలుస్తోంది. ప్రధానంగా జాతీయ రహదారిపై రాజధాని నుంచి ఇతర ప్రాంతాలకు నిత్యం వెళ్లే భారీ వాహనాల యజమానులు చాలా మంది ఈ ట్రిక్కును వాడుతూ టోల్‌కు టోకరా వేస్తున్నారు.

టోల్‌ ఆదాయానికి గండి..
ఫాస్టాగ్‌ పద్ధతిని కూడా కొందరు తమకు అనుకూలంగా మలచుకోవడం ద్వారా టోల్‌ నిర్వహణ సంస్థ ఆదాయానికి గండి పడుతోంది. వివిధ ట్రాన్స్‌పోర్టు సంస్థలకు సంబంధించిన వాహనాలు చాలా వరకు ఇదే పద్ధతిని అవలంభిస్తూ టోల్‌ ట్యాక్స్‌ తక్కువ చెల్లిస్తున్నట్టు తెలుస్తోంది. దీనిపై నేషనల్‌ హైవే అథారిటీ ఆఫ్‌ ఇండియా అధికారులు దృష్టి సారించాల్సిన అవసరముంది. సాధారణంగా వాహనదారులకు నిర్దేశించిన ప్రకారం ట్యాక్స్‌ వసూలు చేసే నిర్వహణ సంస్థలు ఇలాంటి వాటిపై దృష్టి సారించాలి. వచ్చే ఫిబ్రవరి 15 నుంచి పూర్తి స్థాయిలో ఫాస్టాగ్‌ అమలు కానున్న నేపథ్యంలో వాహనాలు, ట్యాగ్‌లకు ఉన్న తేడాలను నిశితంగా పరిశీలించాలి. అప్పుడే ఇలాంటివి బయటపడతాయని సూచిస్తున్నారు.

మరిన్ని వార్తలు