పబ్‌లతో తారల బంధం! 

4 Apr, 2022 05:03 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, హైదరాబాద్‌:  నగరంలోని పలు పబ్‌లతో టాలీవుడ్‌ తారలకు దశాబ్దంన్నర కిందటే బంధం ఏర్పడింది. ఓ టాలీవుడ్‌ అగ్రహీరో బంజారాహిల్స్‌లో టచ్‌ పబ్‌ని స్నేహితుడితో కలిసి ఏర్పాటు చేయగ అది సినీతారలతోపాటు ఇతర రంగాల సెలబ్రిటీల నైట్‌ లైఫ్‌కు చిరునామాగా వర్ధిల్లింది. అయితే ఇతరుల రాక వల్ల గోప్యతకు ఇబ్బందనే భావనతో దాని కవర్‌ చార్జీలు కూడా షాక్‌ కొట్టే రీతిలో నిర్ణయించారు. కానీ అర్ధరాత్రి దాటినా డ్యాన్సులంటూ ఆరోపణలు రావడం, పలుమార్లు పోలీసు దాడులు జరగడంతో ఆ స్టార్‌ హీరో పబ్‌ వ్యాపారం నుంచి తప్పుకున్నప్పటికీ.. అప్పటికే సెలబ్రిటీల కోసం ప్రత్యేకమైన పార్టీ ప్లేస్‌ ఒక అవసరంగా మారిపోయంది.

ఆ తర్వాత అదే యువ తారలకు ఆకర్షణీయ వ్యాపార మార్గమైంది. ‘టచ్‌’కన్నా ముందే బేగంపేట్‌లోని బాటిల్స్‌ అండ్‌ చిమ్నీస్‌ ఓ సినీనటి ఆధ్వర్యంలో నడిచేది. టాలీవుడ్‌లో మంచి సంబంధాలు నడుపుతాడని పేరున్న ఓ యువ నటుడు నగర శివార్లలో బీపీఎం పేరిట ఓ పార్టీ ప్లేస్‌ని నిర్వహించాడు. అది కూడా టాలీవుడ్‌ తారలకు, ఇతర రంగాల సెలబ్రిటీలకు మాత్రమే ప్రత్యేకించిందిగా పేరొందింది.

అక్కడి రహస్య కార్యకలాపాలపట్ల ఎక్సైజ్‌శాఖ పోలీసులు కన్నెర్ర చేయడంతో అది మూతపడింది. అదే తరహాలో మరో యువ నటుడు నగర శివార్లలో నెలకొల్పిన ఎఫ్‌ క్లబ్‌ కూడా కొంతకాలం సీక్రెట్‌ పార్టీలకు కేరాఫ్‌గా నడిచి మూతపడింది. గతంలో రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన డ్రగ్స్‌ ఉదంతం, కెల్విన్‌ అనే డ్రగ్‌ డీలర్‌ దందాకు ఈ క్లబ్‌ వేదికైంది. జూబ్లీహిల్స్‌లో ఓ యువ హీరోకి వాటాలున్న హైలైఫ్‌ పబ్‌ కూడా అంతే. దానిపైనా లెక్కలేనన్నిసార్లు దాడులు జరిగాయి. విలన్‌ పాత్రలకు పేరొందిన ఓ టాప్‌ టాలీవుడ్‌ నటుడికి కూడా జూబ్లీహిల్స్‌లో ఓ పబ్‌ ఉంది.

మరిన్ని వార్తలు