భగ్గుమన్న టమాటా….. సెంచరీ కొట్టిన ధర

18 May, 2022 16:00 IST|Sakshi

టమాట ధర ఠారెత్తిస్తోంది. కొద్దిరోజులుగా క్రమంగా పెరుగుతూ బహిరంగ మార్కెట్‌లో వినియోగదారుడిని భయపెడుతోంది. వారం రోజుల వ్యవధిలోనే ధరలు అమాంతం పెరగడంతో సామాన్యులు వాటివైపు చూసేందుకే ఆలోచించాల్సిన పరిస్థితి తయారైంది. 

నిజామాబాద్ (డిచ్‌పల్లి) : సమయానికి ఏ కూరగాయలు అందుబాటులో లేకపోతే కనీసం నాలుగు టమాటలైనా వండొచ్చుగా.. సాధారణంగా ప్రతీ మధ్య తరగతి కుటుంబాల్లో విన్పించే మాట ఇది. కానీ ఇప్పుడు అదే మాట వంటింట్లో మంట రేపుతోంది. నెల కిత్రం కిలో రూ.10 పలికిన టమాట ప్రస్తుతం కిలో రూ.80కి చేరింది. రోజురోజుకూ టమాట ధర సామాన్యులకు భారంగా మారింది. టమాట వండుకోవడం మాట అటుంచితే కనీసం వాటి గురించి కూడా ఆలోచించే పరిస్థితి లేకుండా పోయింది. ఒక్కోసారి రూ.1కి కిలో చొప్పున అమ్మినా కొనేవారు లేక రోడ్లపై పారబోసే పరిస్థితి వచ్చింది. ఇప్పుడేమో ధరలు భగ్గుమంటున్నాయి. గత మూడురోజుల్లో నే ఏకంగా రోజుకు రూ.10 చొప్పున పెరుగుతూ వినియోగదారులను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. 

యాసంగిలో..
జిల్లాలో ఈ సారి యాసంగి టమాట ఉత్పత్తి తగ్గింది. సాధారణం కంటే ఎండలు అధికంగా ఉండటంతో పూత రాక పంట తగ్గింది. దీనికి తోడు పంట చేతికొచ్చే సమయంలో అకాల వర్షాలు, ఈదురు గాలులకు టమాట పంటకు నష్టం వాటిల్లింది. దీంతో హోల్‌సేల్‌ వ్యాపారులు చిత్తూరు జిల్లా మదనపల్లి, కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాల నుంచి టమాటను తెప్పించి విక్రయిస్తున్నారు. ఆయా ప్రాంతాల్లో రైతులు షేడ్‌ నెట్లలో టమాటను సాగు చేస్తుంటారని, దీంతో ఎండ వేడమి నుంచి రక్షణ లభించి పంట దిగుబడి అధికంగా వస్తుందని వ్యాపారులు తెలిపారు. స్థానికంగా సరైన పంట ఉత్పత్తి లేకపోవడంతో టమాట ధరకు రెక్కలొచ్చాయి. ఏప్రిల్‌ 15వ తేదీ వరకు కిలో రూ. 10కి లభించిన టమాట ప్రస్తుతం కిలో రూ.80కి చేరింది. ధర పెరగడంతో సామాన్య, మద్య తరగతి  ప్రజలు టమాట కొనుగోలు చేయాలంటే జంకుతున్నారు. ఈ ధరలు జూన్, జూలై వరకు ఇలాగే కొనసాగే అవకాశాలు ఉన్నట్లు ఉద్యాన శాఖాధికారులు, వ్యాపారులు పేర్కొంటున్నారు. 

మరిన్ని వార్తలు