టమాటా పైపైకి

9 Sep, 2020 03:21 IST|Sakshi

రాష్ట్రంలో10 రోజుల్లోరూ.30 పెరిగిన ధర

ప్రస్తుతం బహిరంగ మార్కెట్‌లో కిలో రూ. 50–60

ఇటీవలి వర్షాలతో పంట దెబ్బతినడం వల్లే ధరల పెరుగుదల..

పొరుగు రాష్ట్రాల నుంచీ తగ్గిన దిగుమతులు

స్థానిక పంట చేతికొచ్చేదాకా ఇదే పరిస్థితి అంటున్న అధికారులు  

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో టమాటా ధర ఒక్కసారిగా పెరిగిపోయింది. కేవలం 10 రోజుల వ్యవధిలో కిలోకు రూ. 30 మేర ధర పెరిగింది. ప్రస్తుతం బహిరంగ మార్కెట్‌లో కిలో టమాటా రూ. 50–60 పలుకుతోంది. తెలంగాణలో టమాటా సాగు తక్కువగా ఉండటం, ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతులు తగ్గడం, భారీ వర్షాల కారణంగా పంట దెబ్బతినడంతో టమాటా ధరలు భారీగా పెరిగినట్లు వ్యాపారులు చెబుతున్నారు. కొత్త పంట చేతికొచ్చే వరకు.. అంటే అక్టోబర్‌ చివరి వరకు ఇదే పరిస్థితి ఉండవచ్చని మార్కెటింగ్‌ శాఖ వర్గాలు పేర్కొన్నాయి.

తగ్గిన సరఫరా.. పెరిగిన డిమాండ్‌
రాష్ట్రంలో టమాటా సాగు విస్తీర్ణం చాలా తక్కువ. తెలంగాణలో లక్ష ఎకరాల్లో టమాటా సాగు అవుతుంది. తెలంగాణలో వినియోగించే మొత్తం టమాటాలో రాష్ట్రంలో పండేది కేవలం 15 నుంచి 20 శాతం వరకే ఉంటుంది. వికారాబాద్, గజ్వేల్, చేవెళ్ల, మహబూబ్‌నగర్, నల్లగొండ తదితర ప్రాంతాల్లో టమాటా సాగవుతుంది. అయితే ఇటీవల కురిసిన భారీ వర్షాలతో రాష్ట్రవ్యాప్తంగా టమాటా పంట దెబ్బతింది. దీంతో డిమాండ్‌ మేర సరఫరా లేక ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం, మదనపల్లితోపాటు కర్ణాటకలోని చిక్‌మంగళూరు, కోలారు, చింతమణి ప్రాంతాలు, మహారాష్ట్రలోని బీదర్, షోలాపూర్, నాందేడ్‌ నుంచి కొంతమేర టమాటా రాష్ట్రానికి వస్తోంది. లాక్‌డౌన్‌ అనంతరం జూన్‌లో రెస్టారెంట్లు, హోటళ్లు తెరుచుకోవడంతో వినియోగం పెరగడం వల్ల టామాటా ధర రూ. 50 వరకు పెరిగింది. అనంతరం ఆగస్టు తొలి వారం నుంచి ధర తగ్గుతూ కిలో రూ. 20–30 మధ్య కొనసాగింది. ఆగస్టు చివరలో సైతం కిలో ధర రూ. 30 వరకు ఉండగా అది ఇప్పుడు దాదాపు రెట్టింపయ్యింది.

ఆగస్టులో కురిసిన వర్షాలతో పంట దెబ్బతినడం, ఆయా ప్రాంతాల్లో దిగుబడి పడిపోవడంతో రాష్ట్రానికి సరఫరా తగ్గిపోయింది. ఇక మహారాష్ట్ర, తమిళనాడుల్లో భారీ వర్షాల కారణంగా టమాటా పంట దెబ్బతిన్నది. దాంతో ఆయా రాష్ట్రాల వ్యాపారులు మదనపల్లి నుంచి టమాటాను దిగుమతి చేసుకుంటుండటం వల్ల డిమాండ్‌ పెరిగి తెలంగాణకు సరఫరా తగ్గిపోయింది. గత నెలలో గరిష్టంగా రోజుకు 3 వేల క్వింటాళ్ల వరకు టామటా మార్కెట్లకు రాగా గత 10 రోజులుగా 1,600–2,000 క్వింటాళ్ల మేర మాత్రమే వస్తోంది. దీంతో టమాటా ధరలు అమాంతం ఎగబాకాయి. ప్రస్తుతం మదనపల్లిలోనే కిలో టమాటా ధర రూ. 30–35 మేర ఉంది. రవాణా చార్జీలు కలుపుకొని ప్రస్తుతం హైదరాబాద్‌ హోల్‌సేల్‌ మార్కెట్‌లో కిలో రూ. 37–40 అమ్ముతున్నారు. రైతు బజార్‌లలో రూ. 45 వరకు అమ్ముతుండగా బహిరంగ మార్కెట్‌కు వచ్చే సరికి ధర రూ. 50–60 వరకు చేరుతోంది. గతేడాది ఇదే సమయానికి కిలో ధర కేవలం రూ. 20 మాత్రమే ఉండగా సరఫరా రోజుకు 3,500 క్వింటాళ్లకుపైగా ఉండేది. అక్టోబర్‌ చివర, నవంబర్‌లో స్థానికంగా పండించే పంట చేతికొస్తుందని, అప్పటివరకు టమాటా ధర తగ్గుదల ఉండదని మార్కెటింగ్‌ శాఖ అధికారులు చెబుతున్నారు. 

మరిన్ని వార్తలు