గణపతి ఎక్కడ?

3 Sep, 2020 02:03 IST|Sakshi

లొంగిపోతాడన్న వార్తల్లో వాస్తవమెంత?

ఇంతవరకూ ఖండించని మావోయిస్టు పార్టీ

13 రాష్ట్రాల్లో ముప్పాళ్లపై కేసులు

ఎన్‌ఐఏ, రా వంటి జాతీయ దర్యాప్తు సంస్థల అన్వేషణ

ఆయన లొంగుబాటు ఆషామాషీ వ్యవహారం కాదంటున్న పరిశీలకులు

సాక్షి, హైదరాబాద్‌: మావోయిస్టు అగ్రనేత గణపతి అలియాస్‌ ముప్పాళ్ల లక్ష్మణరావు ఆచూకీపై దేశవ్యాప్తంగా చర్చ నడుస్తోంది. ఆయన ఆరోగ్యం క్షీణించిందని, త్వరలో లొంగిపోతాడని వస్తున్న వార్తలపై ఏపీ– తెలంగాణతోపాటు జాతీయ మీడియాలోనూ వరుస కథనాలు వస్తున్నాయి. తెలంగాణ పోలీసుల సహకారం మేరకు గణపతి లొంగుబాటుకు కేంద్రంతో చర్చలు జరుపుతున్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే, లొంగుబాటులోని సాధ్యాసాధ్యాలపై అనేక ప్రశ్నలు, సందేహాలు తలెత్తుతున్నాయి. కేవలం తెలంగాణ రాష్ట్ర పోలీసులు అంగీకరించినంత మాత్రాన ఈ వ్యవహారానికి తెరపడుతుందా అనేది సర్వత్రా ఆసక్తిని రేపుతోంది.

13 రాష్ట్రాలు, 2 జాతీయ దర్యాప్తు సంస్థలు
గణపతి నేతృత్వంలోనే దేశంలో మావోయిస్టు పార్టీ బాగా విస్తరించిందనే అభిప్రాయం ఉంది. దేశ విదేశాల నుంచి నిధులను సమీకరించడంలో, పార్టీ కేడర్‌కు ఆధునిక టెక్నాలజీ, నవీన ఆయుధాలు సమకూర్చడంలో, ప్రజల ఆలోచనలకు అనుగుణంగా పార్టీ విధానాలు మార్చుకోవడంలో ఆయన వ్యూహాలు చాలా ముందుచూపుతో ఉంటాయి. అనవసర హింసాచర్యలకు ఈయన వ్యతిరేకం. పీపుల్స్‌ వార్‌ గ్రూపు (పీడబ్ల్యూజీ), మావోయిస్టు కమ్యూనిస్టు సెంటర్‌ ఆఫ్‌ ఇండియా(ఎంసీసీఐ) విలీనంలో గణపతి కీలక పాత్ర పోషించారు. 13 రాష్ట్రాల్లో మావోయిస్టు పార్టీని నడిపించిన గణపతిపై వేలాది కేసులున్నాయి. పలు కేసుల్లో నిందితుడిగా ఉన్న ఆయన కోసం జాతీయ దర్యాప్త సంస్థ(ఎన్‌.ఐ.ఏ), రీసెర్చ్‌ అండ్‌ అనాలిసిస్‌(రా) వంటి జాతీయదర్యాప్తు సంస్థలు వెదుకుతున్నాయి. ప్రస్తుతం వస్తున్న వార్తల ప్రకారం.. గణపతి లొంగిపోవడానికి అంగీకరించాడునుకున్నా.. ఒక్క తెలంగాణ పోలీసులు పాత కేసులు మాఫీ చేసినా.. మిగిలిన 12 రాష్ట్రాల పోలీసులు కేసుల ఎత్తివేతకు సుముఖంగా ఉంటారా? ఎన్,ఐ.ఏ, రా వంటి సంస్థల విచారించకుండా ఉంటాయా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ కేసులన్నీ ఎత్తేయాలంటే కేంద్ర హోంమంత్రిత్వ శాఖ అంగీకారం తెలపాల్సి ఉంటుంది. అదేవిధంగా 43 ఏళ్లుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ముప్పతిప్పలు పెట్టి, దండకారణ్యంలో సమాంతర ప్రభుత్వాలు నడిపిన గణపతి తన లొంగుబాటుకు షరతులకు విధించకుండా ఉంటారా? వాటిని కేంద్రం ప్రభుత్వ పెద్దలు అంగీకరిస్తారా? అన్నది అనుమానమే.

ఖండించని మావోయిస్టు పార్టీ..
ఈ మొత్తం వ్యవహారంలో ఇటు పోలీసులు, అటు మావోయిస్టులు మౌనం వహించడం అనేక సందేహాలకు, అనుమానాలకు తావిస్తోంది. ఓవైపు గణపతి ఇప్పటికే లొంగిపోవడానికి అంగీకరించాడని, మరికొన్ని రోజుల్లో లొంగుబాటు చూపుతారంటూ సాగుతున్న ప్రచారంపై పోలీసులు పెదవి విప్పడంలేదు. ఆయన లొంగిపోతే మాత్రం స్వాగతిస్తామని, ఎలాంటి ఇబ్బంది పెట్టబోమని భరోసా ఇస్తున్నారు. మరోవైపు ఈ మొత్తం వ్యవహారం పోలీసులు వేసిన ఎత్తగడ అన్న ప్రచారమూ ఉంది. మావోయిస్టు కేడర్‌ను గందరగోళంలో నెట్టేయడానికి, అగ్రనేతల ఫోన్‌ సంభాషణలను విని, గణపతి ఉనికి కనుక్కునేందుకు బిగించిన ఉచ్చు అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు గణపతి లొంగిపోనున్నారనే ప్రచారాన్ని ఖండిస్తూ ఇంతవరకూ మావోయిస్టు పార్టీ నుంచి కూడా ఎలాంటి అధికారిక ప్రకటన రాకపోవడం గమనార్హం. 

లొంగిపోతాడని అనుకోవడం లేదు:  జంపన్న
సాక్షి, హైదరాబాద్‌: గణపతి లొంగుబాటుపై మాజీ మావోయిస్టు, కేంద్ర కమిటీ మాజీ సభ్యుడు జంపన్న స్పందించారు. గణపతి వంటి అగ్రనేత లొంగిపోతాడని తాను అనుకోవడం లేదని పేర్కొన్నారు. ఆయన ఆరోగ్యం క్షీణించిందంటూ వస్తున్న వార్తల విశ్వసనీయతపై కూడా అనుమానాలు వ్యక్తంచేశారు. గత 40 ఏళ్లుగా గణపతి తన కుటుంబ సభ్యులతో ఎలాంటి సంబంధాలూ కలిగి లేడని, ఈ నేపథ్యంలో ఆయన లొంగుబాటుకు మధ్యవర్తిత్వం వహించే అవకాశం ఎవరికి ఉంటుందని ప్రశ్నించారు.   

మరిన్ని వార్తలు