బూస్టర్‌ డోసులు ఇప్పుడే వద్దు

21 Aug, 2021 02:07 IST|Sakshi

వయోజనులందరికీ కరోనా టీకాలు వేయడంపై ప్రత్యేక దృష్టి పెట్టాలి 

వ్యాక్సిన్ల మిక్సింగ్‌పై తొందరొద్దు.. దీనిపై ఇంకా స్పష్టత రాలేదు 

స్థానిక పరిస్థితులను బట్టి మూడో, నాలుగో, ఐదో వేవ్‌లు వచ్చే అవకాశం 

‘సాక్షి’ ఇంటర్వూ్యలో ప్రముఖ క్లినికల్‌ సైంటిస్ట్, వైరాలజిస్ట్‌ గగన్‌దీప్‌ కాంగ్‌

సాక్షి, హైదరాబాద్‌:  కోవిడ్‌ నుంచి రక్షణ కోసమని రెండు డోసులకు అదనంగా ‘బూస్టర్‌ డోస్‌’ ఇప్పుడే వేసుకోవాల్సిన అవసరం లేదని ప్రముఖ క్లినికల్‌ సైంటిస్ట్, వైరాలజిస్ట్‌ డాక్టర్‌ గగన్‌దీప్‌ కాంగ్‌ స్పష్టం చేశారు. ముందుగా దేశంలో అత్యధికశాతం వయోజనులకు టీకాలు వేయడంపై ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని సూచించారు. వీలైనంత ఎక్కువ మందికి వ్యాక్సిన్లు వేసేందుకు కొంత సమయం పడుతుందని.. అప్పుటికి బూస్టర్లు అవసరమా, ఎప్పుడు వేసుకుంటే మంచిదనే డేటా అందుబాటులోకి వస్తుందని తెలిపారు.

ఇప్పటికిప్పుడు బూస్టర్‌ డోసులకోసం వెర్రిగా వెళితే.. ఆశించిన ప్రయోజనాలు చేకూరడం సందేహమేనని చెప్పారు. వేర్వేరు వ్యాక్సిన్లను కలపడంపై ఇంకా పరిశోధనలు జరుగుతున్నాయని, ఈ ఏడాది చివరికిగానీ స్పష్టత రాదని చెప్పారు. ప్రస్తుతం వెల్లూరు క్రిస్టియన్‌ మెడికల్‌ కాలేజీ (వీఎంసీ) గ్యాస్ట్రో ఇంటెస్టినల్‌ విభాగంలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న గగన్‌దీప్‌ కాంగ్‌.. కరోనా వ్యాప్తి, వ్యాక్సినేషన్‌లకు సంబంధించి ‘సాక్షి’ ప్రత్యేక ఇంటర్వూ్యలో పలు కీలక వివరాలు వెల్లడించారు. ఆ ఇంటర్వూ్య వివరాలివీ.. 

వ్యాక్సిన్ల ప్రభావంపై స్పష్టత వచ్చాకే.. 
ఒకసారి టీకా వేసుకుంటే ఏడాది నుంచి రెండేళ్ల వరకు రక్షణ ఉంటుందనేది నా అంచనా. కోవిడ్‌ వైరస్‌ బయటపడి ఏడాదిన్నర మాత్రమే అయింది. భారత్‌లో వ్యాక్సిన్లు వేయడం మొదలై ఏడెనిమిది నెలలే అయింది. అందువల్ల బూస్టర్‌పై ఇప్పుడే తొందరపాటు అవసరం లేదు. అందరూ రెండు డోసుల టీకా వేసుకున్నాక.. వ్యాక్సిన్ల ప్రభావంపై పూర్తిస్థాయి స్పష్టత వస్తుంది. 

మరో ఏడాది జాగ్రత్త.. 
జనం ఒక ఏడాదిపాటు భారీగా గుమిగూడటం, పండుగలు, పబ్బాలు చేసుకోవడానికి ఎక్కువమంది కలవడం వంటివి చేయకపోవడం మంచిది. వ్యక్తులుగా, కుటుంబాలుగా, చిన్నచిన్న బృందాలుగా వేడుకలు చేసుకుంటేచాలు. అప్పటికల్లా వ్యాక్సినేషన్‌ దాదాపు పూర్తయి, కరోనా నుంచి రక్షణ ఉంటుంది. 

దేశంలో ప్రస్తుత కరోనా పరిస్థితి ఏమిటి? 
గగన్‌దీప్‌ కాంగ్‌: దేశంలో కోవిడ్‌ తీవ్రత తగ్గిందనే చెప్పాలి. రెండో వేవ్‌ కనుమరుగవుతున్నట్టే. అన్ని కార్యకలాపాలు కొనసాగుతున్నా రోజువారీ కేసుల సంఖ్య 30–40వేలలోపే ఉండటం సానుకూల అంశమే. అయినా ప్రభుత్వం, ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. ఓవైపు టీకా కార్యక్రమాన్ని కొనసాగిస్తూనే.. పరీక్షల సంఖ్యను పెంచాలి. నిజానికి వ్యాక్సినేషన్‌ వేగం పుంజుకుని, స్వల్పలక్షణాలతో కరోనా కేసులు వచ్చినా పెద్ద సమస్య కాబోదు. కానీ సీరియస్‌ కేసులు, ఆస్పత్రుల్లో చేరికలు, మరణాలు పెరగడం వంటివి జరిగితే.. కోవిడ్‌ తీవ్రరూపం దాల్చినట్టు భావించాలి.

ఇప్పటికే థర్డ్‌వేవ్‌ మొదలైందని అంటున్నారు.. నిజమేనా? 
నేనలా అనుకోవడం లేదు. స్థానిక పరిస్థితులు, పరిణామాలను బట్టి కొన్నిచోట్ల కేసులు పెరుగుతాయి. ఆయా చోట్ల మూడో, నాలుగో, ఐదో వేవ్‌లు వస్తాయి. ఒకవేళ కొత్త వేరియెంట్‌ పుడితే పరిస్థితి వేరుగా ఉంటుంది. కానీ ఇప్పటిౖకైతే దేశంలో కొత్తగా ప్రమాదకర మ్యూటెంట్లు, వేరియెంట్లు వచ్చినట్టుగా ఎలాంటి ఆధారాల్లేవు. ఈ సానుకూల పరిస్థితిని ఉపయోగించుకుని దేశవ్యాప్తంగా వైరస్‌ వ్యాప్తిని పూర్తిగా కట్టడి చేయాలి. ‘మాలిక్యులర్‌ సర్వైలెన్స్‌’ ద్వారా కొత్త రోగకారక సూక్ష్మజీవులను గుర్తించి అరికట్టాలి. వైరస్‌ను సమర్థవంతంగా నియంత్రిస్తే.. కొత్త వేరియంట్లు, స్ట్రెయిన్లు రావు. 

ఒకవేళ మూడోవేవ్‌ మొదలైతే తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి? 
దేశవ్యాప్తంగా వైరస్‌ వ్యాప్తి ఎక్కడ, ఏ విధంగా ఉంది, తీవ్రత ఎలా ఉందన్న అంశాలను క్షుణ్నంగా పరిశీలించాలి. ఏయే ప్రాంతాల్లో కేసుల తీరు ఎలా ఉందన్నది చూసి.. తగిన చర్యలు చేపట్టాలి. ముఖ్యంగా ప్రజారోగ్య వ్యవస్థను మరింత బలోపేతం చేసి, కిందిస్థాయిలోనూ ప్రజలకు మెరుగైన వైద్య, ఆరోగ్యసేవలు అందేలా చూడాలి. 

వానాకాలం, చలికాలంలో కరోనా ప్రభావం ఎక్కువగా ఉంటుందా? 
ఈ రెండు కాలాల్లో వైరస్‌ వ్యాప్తికి, శ్వాసకోశ సంబంధిత సమస్యలు పెరగడానికి అవకాశాలు ఎక్కువ. కాబట్టి వ్యాక్సినేషన్‌ వేగం మరింతగా పెంచి.. వీలైనంత త్వరగా, ఎక్కువ మందికి టీకాలు వేయాలి. మాస్కులు, భౌతిక దూరం, గాలి, వెలుతురు ధారాళంగా ప్రసరించే ప్రాంతాల్లో ఉండడం, శానిటైజేషన్‌ వంటి జాగ్రత్తలు తీసుకోవాలి. 
 
వ్యాక్సినేషన్‌కు సమస్యలేంటి? 
ప్రధానంగా మనదేశ అవసరాలకు తగిన స్థాయిలో వ్యాక్సిన్లు ఉత్పత్తి కాకపోవడమే సమస్య. వ్యాక్సినేషన్‌ వరకు వేగంగానే జరుగుతోంది. ఇతర దేశాలతో పోల్చినా కాస్త మెరుగైన స్థితిలోనే ఉన్నాం. కానీ ఉత్పత్తి ఇంకా పెంచాలి. వ్యాక్సిన్‌ నిల్వలు ఎక్కడా వృ«థా కాకుండా పూర్తి స్థాయిలో ఉపయోగించుకోవాలి. 
 
పాఠశాలలు తెరవడం మంచిదేనా? 
ప్రస్తుత పరిస్థితుల్లో పాఠశాలలు తెరవడమే మంచిది. బడికి వెళ్లకపోవడంతో పిల్లలు ఎక్కువగా నష్టపోతారు. ఎలాంటి జాగ్రత్తలతో స్కూళ్లు తెరవాలనే దానిపై దృష్టి పెట్టాలి. స్కూళ్లలో టీచర్లు, సిబ్బందితోపాటు పిల్లలకు వ్యాక్సిన్లు వేయాలి. కరోనా జాగ్రత్తలు పాటించాలి. అవసరమైతే తర గతుల వారీగా వివిధ షిఫ్టుల్లో పాఠాలు చెప్పాలి.  

మరిన్ని వార్తలు