ఎంసెట్‌ కౌన్సెలింగ్‌కు దూరంగా టాపర్లు! కారణమిదే!

10 Jul, 2023 02:52 IST|Sakshi

ఇంతవరకూ రిజిస్ట్రేషన్‌ చేసుకోని మెరిట్‌ విద్యార్థులు

రిజిస్ట్రేషన్లలో 200లోపు ర్యాంకు వారు సున్నా.. 300లోపు వారు ఒక్కరే

టాప్‌ 1000ర్యాంకర్లలో 23 మందే..

ముందుకొచ్చినవారిలో 50వేలపైన ర్యాంకు వారే ఎక్కువ

సాక్షి, హైదరాబాద్‌: ఎంసెట్‌లో టాప్‌ ర్యాంకులు సాధించిన విద్యార్థుల్లో చాలా మంది కౌన్సెలింగ్‌కు దూరంగా ఉన్నారు. ఎలాంటి ఆప్షన్లు ఇవ్వకపో­వడమే కాదు, కనీసం రిజిస్ట్రేషన్‌ కూడా చేసుకో­లేదు. టాప్‌–200లోపు ర్యాంకర్లలో ఒక్కరు కూడా ఎంసెట్‌ కౌన్సెలింగ్‌ జోలికి వెళ్లలేదు. 300లోపు ర్యాంకర్లలో కేవలం ఒక్కరు, 1000లోపు ర్యాంకర్లలో 23 మంది మాత్రమే రిజిస్ట్రేషన్‌ చేసుకు­న్నారు. 50వేల నుంచి 2.5 లక్షల వరకు ర్యాం­కులు వచ్చిన­వారే ఎక్కు­వగా కౌన్సె­­లింగ్‌కు రిజిస్ట్రేషన్‌ చేసుకున్నారు.

రాష్ట్ర ఎంసెట్‌ విభాగం ఆదివారం విడుదల చేసిన ఓ ప్రకటనలో ఈ వివరాలను వెల్లడించింది. ఇప్పటివరకు మొత్తం 81,856 మంది కౌన్సెలింగ్‌కు రిజిస్టర్‌ చేసుకున్నారు. వారు ఈ నెల 12వ తేదీ వరకు ఆప్షన్లు ఇవ్వడానికి సమయం ఉంది. సాధారణంగా ఎంసెట్‌లో మంచి ర్యాంకు వచ్చిన విద్యార్థులు జేఈఈ మెయిన్స్‌­లోనూ మంచి ర్యాంకు సాధిస్తుంటారు.

జాతీయ ఇంజనీరింగ్‌ కాలేజీల్లో సీట్ల కోసం ప్రయత్నిస్తారు. అందుకే ఎంసెట్‌ కౌన్సెలింగ్‌కు దూరంగా ఉంటుంటారు. అయితే రిజిస్ట్రేషన్‌ చేసుకున్నా ఈ నెల 12లోపు ఆప్షన్లు ఇవ్వకపోతే సీట్లు కోల్పోయే అవకాశం ఉంటుంది.

42వేల కంప్యూటర్‌ ఇంజనీరింగ్‌ సీట్లు
రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 1,07,039 ఇంజనీరింగ్‌ సీట్లు ఉన్నాయి. ఇందులో తొలి విడత కౌన్సెలింగ్‌లో 76,359 సీట్లను చేర్చారు. మిగతావి యాజమాన్య కోటా కింద భర్తీ చేస్తారు. కన్వీనర్‌ కోటా కింద భర్తీ చేస్తున్న సీట్లలో ఏకంగా 42,087 వరకు కంప్యూటర్‌ ఇంజనీరింగ్‌ సీట్లే ఉన్నాయి. విద్యార్థుల నుంచి వస్తున్న డిమాండ్‌ మేరకు ఇటీవలే.. సీఎస్‌సీ, సైబర్‌ సెక్యూరిటీ, డేటా సైన్స్, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్, ఇతర కంప్యూటర్‌ కోర్సుల్లో సీట్లు పెంచారు.

మరిన్ని వార్తలు