57,151 ఎకరాల్లో యాసంగి సాగు

28 Oct, 2022 02:01 IST|Sakshi

అందులో 41,772 ఎకరాల్లో వేరుశనగ

గత సీజన్‌ కంటే మందకొడిగా పంటల సాగు

ఈసారి వరి ఎక్కువ సాగవుతుందని అంచనా  

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో యాసంగి పంటల సాగు మందకొడిగా సాగుతోంది. గత సీజన్‌లో ఈ సమయానికి 1.37 లక్షల ఎకరాల్లో పంటలు సాగవగా ప్రస్తుత యాసంగిలో కేవలం 57,151 ఎకరాల్లోనే పంటలు సాగయ్యాయని వ్యవసాయ శాఖ వెల్లడించింది. ఈ సీజన్‌లో అన్ని పంటలు కలిపి 46.49 లక్షల ఎకరాల్లో పంటలు సాగు చేయాలని లక్ష్యం నిర్దేశించుకోగా ప్రస్తుతం అందులో 0.01 శాతమే పంటలు సాగయ్యాయి.

అత్యధికంగా వేరుశనగ 41,772 ఎకరాల్లో సాగైంది. ఆ తర్వాత శనగ 5,585 ఎకరాలు, మినుము పంట 5,891 ఎకరాల్లో సాగైనట్లు వ్యవసాయశాఖ వెల్లడించింది. ఆదిలాబాద్, మంచిర్యాల, ములుగు, జయశంకర్‌ భూపాలపల్లి, నల్లగొండ జిల్లాల్లో యాసంగి సాగు ఒక్క ఎకరాలో కూడా సాగు కాలేదు. వనపర్తి జిల్లాలో అత్యధికంగా 18,365 ఎకరాలు, నాగర్‌కర్నూలు జిల్లాలో 11,757 ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. వికారాబాద్‌ జిల్లాలో 6,204, మహబూబ్‌నగర్‌ జిల్లాలో 5,144 ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. కాగా, ఈసారి వరి అత్యధికంగా సాగవుతుందని అంచనా వేశారు. సాధారణ సాగు విస్తీర్ణ లక్ష్యం 31 లక్షల ఎకరాలు కాగా, నీళ్లు పుష్కలంగా ఉండటంతో భారీగా నమోదు అవుతుందని చెబుతున్నారు. 

మరిన్ని వార్తలు