ఈ సమాధుల వయసు మూడున్నర వేల ఏళ్లు

3 Jan, 2021 09:01 IST|Sakshi

రాష్ట్రంలోనే ఎన్నోఅద్భుతమైన పర్యాటక ప్రాంతాలు

పెద్దగా వెలుగులోకి రాని వైనం 

చార్మినార్, గోల్కొండ, వేయి స్తంభాల దేవాలయం, రామప్పగుడి, లక్నవరం సరస్సు.. ఠక్కున చెప్పమంటే.. అత్యధికులు చెప్పే పేర్లు ఇవే.. రాష్ట్రానికి ఏటా 3 లక్షల మంది విదేశీ పర్యాటకులొస్తే, అందులో మూడొంతుల మంది హైదరాబాద్‌లోని సాఫ్ట్‌వేర్‌ పరిశ్రమ, అంతర్జాతీయ సదస్సులు, ఇతర అధికారిక కార్యక్రమాలకు వచ్చేవారే. మిగతా ఒకవంతు పర్యాటకుల్లో 90 శాతం హైదరాబాద్‌ను మాత్రమే చూసి వెళ్తారు. మిగిలిన 10 శాతం మంది వరంగల్‌లోని కొన్ని ప్రాంతాలకే పరిమితమవుతారు. మన దేశ పర్యాటకులూ దీనికి అతీతంకాదు. అయితే.. తెలంగాణ పల్లెల్లోనే విదేశీయులను సైతం ఆకర్షించే అద్భుతమైన పర్యాటక ప్రాంతాలు ఎన్నో ఉన్నాయి.. కొంచెం ఖర్చు పెడితే చాలు.. ఈ కొత్త ఏడాదిలో తెలంగాణ పర్యాటకానికి సరికొత్త కళను తెచ్చే శక్తి వాటికుంది.. కావాల్సిందల్లా.. వాటికి కాస్త ప్రచారం.. అక్కడికి చేరుకునేందుకు సరైన రహదారి.. కనీస వసతులు.. పెద్దగా  వెలుగులోకి రాని అలాంటి విలువైన ప్రాంతాలపై  ‘సాక్షి’ ఫోకస్‌.


మన అంకోర్‌వాట్‌.. దేవునిగుట్ట 

మన దేశంలో మరెక్కడా లేనట్లుగా కంబోడియా నిర్మాణ శైలిలో రూపుదిద్దుకున్న దేవాలయం ఇది. శిల్పంలోని వివిధ భాగాలను రాతి ఇటుకలపై చెక్కి, వాటిని పొందికగా పేర్చడం ద్వారా శిల్పం పూర్తి ఆకృతిని తీసుకొచ్చారు. ఇలా రాళ్లను పేరుస్తూ 35 అడుగుల ఎత్తుతో అద్భుతంగా తీర్చిదిద్దిన మందిరమిది. ములుగు జిల్లా కేంద్రానికి 20 కి.మీ. దూరంలో కొత్తూరు గ్రామానికి ఈశాన్యాన అడవిలో గుట్టపై ఉంది. నిర్మాణం మొత్తం బుద్ధుడి జాతక కథలలోని చిత్రాలను ప్రతిబింబిస్తున్నందున ఇది బౌద్ధ నిర్మాణమని తెలుస్తోంది. ఇసుక రాతి ఇటుకలపై అద్భుత చిత్రాలను చెక్కి పొందికగా నిర్మించిన తీరు అబ్బురపరుస్తుంది. ఒక గర్భాలయంగా మాత్రమే దీన్ని నిర్మించారు. ముందు వైపు సున్నపురాతితో చెక్కిన ఆలయ స్తంభం తరహా నిలువురాయి ఉంది. సమీపంలో చెరువు కూడా ఉంది. దీనికి ప్రధాన రోడ్డు నుంచి దాదాపు 8 కి.మీ. మేర రోడ్డును నిర్మించి, సమీపంలో పర్యాటకులకు వసతి గృహం నిర్మిస్తే చాలు. దీని ప్రత్యేకత విని పలువురు విదేశీ నిపుణులు వచ్చి అధ్యయనం చేసి వెళ్లారు. 
ఎక్కడ: కొత్తూరు, ములుగు జిల్లా


3 వేల ఏళ్లనాటి ఖగోళ పరిశోధనశాల

స్టోన్‌ హేంజ్‌.. బ్రిటన్‌లో ఆదిమానవులు వృత్తాకారంలో ఏర్పాటు చేసిన రాతి నిర్మాణం. యునెస్కో ప్రపంచ వారసత్వ కట్టడంగా దాన్ని గుర్తించారు. ముడ్‌మల్‌.. స్టోన్‌ హేంజ్‌కు తీసిపోని ప్రత్యేకత. కానీ, దీన్ని మన హెరిటేజ్‌ తెలంగాణ రక్షిత కట్టడంగా గుర్తించలేదు. నారాయణపేట జిల్లా కృష్ణా తీరం వెంట ఉన్న ఇది 3 వేల ఏళ్లనాటి ఖగోళ పరిశోధనశాల అని హైదరాబాద్‌ సెంట్రల్‌ వర్సిటీ ప్రొఫెసర్‌ పుల్లారావు తేల్చి ప్రపంచ వేదికలపై పత్రాలు సమర్పించారు. రుతుపవనాలు, సూర్య–చంద్రుల గమనం, గ్రహణాల ఆవిర్భావం... ఇలా అన్నింటినీ గుర్తించేందుకు దీన్ని అప్పట్లో వినియోగించేవారట. ఇక్కడ 10 నుంచి 17 అడుగుల ఎత్తున్న గండ శిలల నీడలే వారికి ప్రధాన ప్రమాణం. ఈ ప్రాంతానికి ముడుమాల్‌ నుంచి రోడ్డును నిర్మించి, విడిది ఏర్పాటు చేయాలి. 
ఎక్కడ: ముడ్‌మల్, నారాయణపేట జిల్లా


మహా బౌద్ధారామం.. ఫణిగిరి

బుద్ధుని జీవితం ఆ శిల్పాల్లో నిక్షిప్తమై ఉంది. ఒక్కో శిల్పం అత్యద్భుతం. సున్నపు రాతిపై రూపాలకు ప్రాణం పోసిన తీరు అబ్బురపరుస్తుంది. దేశంలోనే అతిపెద్ద బోధిసత్వుడి సున్నపురాతి విగ్రహం లభించిందిక్కడే. అదే ఫణిగిరి. ఈ ప్రాంతంలో బౌద్ధం వెలసిల్లిన కాలంలో ఇది గొప్ప ఆరామం. ఇక్కడ బౌద్ధ మహాస్తూపం, చైత్య గృహాలు, ఉద్దేశిక స్తూపాలున్నాయి. సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండలం ఫణిగిరిలో ఎత్తయిన గుట్టపై దీన్ని నిర్మించారు. శాతవాహనుల కాలంలో క్రీ.పూ. ఒకటో శతాబ్దిలోనే ఇది రూపుదిద్దుకుంది. ఇక్కడ పలు సందర్భాల్లో జరిపిన తవ్వకాల్లో అత్యద్భుత శిల్పసంపద వెలుగుచూసింది. ఇది రక్షిత కట్టడంగా ఉన్నా.. ఆ శిల్పాలకు ఇక్కడ ఒక ప్రదర్శనాలయం నిర్మించలేకపోయారు. కొన్ని హైదరాబాద్‌ సహా వివిధ ప్రాంతాల్లో మ్యూజియంలలో ఉండగా, సింహభాగం శిల్పాలు ఆ ఊరిలోని ఓ పాత ఇంట్లో బందీగా ఉండిపోయాయి. బౌద్ధులను అమితంగా ఆకట్టుకొనే గొప్ప బౌద్ధారామం అయినా.. గుర్తింపే రాలేదు. గుట్టపైకి నడక దారి ఏర్పాటు చేసి, గుట్ట వరకు రోడ్డును నిర్మించి అక్కడ పర్యాటకులకు కనీస వసతులతో ఓ భవనం నిర్మిస్తే చాలు.  
ఎక్కడ: ఫణిగిరి, సూర్యాపేట జిల్లా


వేల సంఖ్యలో డోల్మెన్‌ సమాధులు..
దాదాపు 15 టన్నుల వరకు బరువుండే భారీ రాతి సల్ప.. దాని దిగువన రాళ్లను పేర్చిన గూడు.. దానికి ఓ ద్వారం.. లోపల రాతి తొట్టి, దానికి కప్పు.. ఇది ఓ పక్కా నిర్మాణం. ఇంత చేస్తే ఇది ఓ సమాధి. అది మహిళదో, పురుషుడిదో తెలిపేలా దాని ముందు మానవాకృతి రాతి శిల. ఇలాంటివి కొన్ని వేలు. ఓ ప్రాంతంలో ఇన్ని సమాధులుండటం ప్రపంచంలో మరెక్కడా లేదు. అమెరికాలోని శాండి యోగో విశ్వవిద్యాలయం సహా పలు వర్సిటీలు సాంకేతిక అధ్యయనానికి ఆసక్తి చూపుతుండటం వీటి ప్రత్యేకత. ఈ సమాధుల వయసు దాదాపు మూడున్నర వేల ఏళ్లు. ఇవి ములుగు జిల్లా దామరవాయి, ఖమ్మం జిల్లా జానంపేట, భూపాలపల్లి జిల్లా తాడ్వాయి అడవుల్లోని గుట్టలపై ఉన్నాయి. యునెస్కో ప్రపంచ వారసత్వ హోదాకు అర్హమైన ఈ గొప్ప చారిత్రక పర్యాటక ప్రాంతాలపై మనకు అవగాహన తక్కువ. వీటికి ప్రచారం కల్పిస్తే విదేశీ పర్యాటకులు కూడా వస్తారు.
ఎక్కడ: ములుగు జిల్లా దామరవాయి, ఖమ్మం జిల్లా జానంపేట, భూపాలపల్లి జిల్లా తాడ్వాయి అడవులు

దేశంలోనే అతి పురాతన ఇటుక గుడి 
65 అడుగుల ఎత్తులో ఇటుకలతో నిర్మించిన ఈ జైన దేవాలయం వయసు1,650 ఏళ్లు. ఇంత ఎత్తయిన పురాతన ఇటుక నిర్మా ణం దేశంలో ఇదొక్కటే. ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌కు సమీపంలో ఉన్న భీతర్‌గావ్‌లో 58 అడుగుల ఎత్తుతో ఇలాంటి నిర్మాణమే ఉంది. అది శిథిలమై పడిపోయే స్థితిలో కేంద్ర పురావస్తు శాఖ తన అధీనంలోకి తీసుకుని పున రుద్ధరించింది. ఇప్పుడది దేశంలో గొప్ప పర్యాటక కేంద్రం. అంతకంటే ఘనంగా ఉన్నా.. దీన్ని పట్టించుకోకపోవడంతో పర్యాటకులకు దీని గురించే తెలియకుండా పోయింది. దీన్ని స్వాధీనం చేసుకుని పునరుద్ధరించేందుకు కేం ద్ర పురావస్తుశాఖ రెడీగా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం అప్పగిస్తే మంచిరోజులు వచ్చినట్లే అన్నది చరిత్రకారుల మాట. మహబూబ్‌నగర్‌ జిల్లా జడ్చర్ల మండలం అల్వాన్‌పల్లిలో ఉన్న ఈ మందిరాన్ని గొల్లత్తగుడిగా పిలుస్తారు. ఇందులోని మహావీర, పార్శ్వనాధ విగ్రహాలను హైదరాబాద్‌ మ్యూజియంలో భద్రపరిచారు. గతంలో దీని దుస్థితిని వివరిస్తూ ‘సాక్షి’కథనాన్ని ప్రచురించగా పురావస్తుశాఖ స్పందించి ప్రహరీ నిర్మించారు. దీనికి కొంత ప్రచారం కల్పిస్తే పర్యాటకులు పెద్ద సంఖ్యలో వచ్చే అవకాశం ఉంది. తద్వారా జైన మత సంఘాలు స్పందించి ఆలయ పునర్నిర్మాణానికి ముందుకొచ్చే అవకాశం ఉంది. 
ఎక్కడ: అల్వాన్‌పల్లి, మహబూబ్‌నగర్‌ జిల్లా 

మైలారం  సున్నపురాతి గుహలు
మేఘాలయాలోని జయంతియా, ఖాసీ హిల్స్‌లో ఉన్న గుహలు ప్రపంచంలోనే పొడవైనవిగా రికార్డుకెక్కాయి. అదే తరహా గుహలు మన రాష్ట్రంలోనూ ఉన్నాయి. దాదాపు 12 నుంచి 15 కి.మీ. మేర విస్తరించినట్టుగా భావిస్తున్న సున్నపురాతి గుహలు భూపాలపల్లి జిల్లాలోని మైలారంలో కనువిందు చేస్తున్నాయి. సాహస యాత్రలను ఇష్టపడే వారికి ఈ గుహలోకి వెళ్లిరావడం గొప్ప అనుభూతిని కలిగిస్తుంది. బొర్రా, బెలూం గుహల కంటే ఇవి ఎంతో విశాలమైనవి. కానీ బయటి ప్రపంచంలో కొంత మందికే వీటి గురించి తెలుసు. వీటిని పర్యాటక ప్రాంతంగా మారిస్తే దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి పర్యాటకులు వచ్చేంతగా ఆకట్టుకుంటాయి. భూ గర్భం, సమాంతరం, ఎగువ.. ఇలా మూడంతస్తులుగా ఈ గుహలున్నాయి. లోపల సహజ సిద్ధంగా ఏర్పడ్డ సున్నపు రాతి ఆకృతులు ఆకట్టుకుంటాయి. పైనుంచి నీటి ధార జాలువారుతుండగా గడ్డకట్టుకుపోయినట్టుగా వివిధ ఆకృతుల్లో సున్నపురాతి శిలలుంటాయి. ఒకదానికొకటి చొప్పున 50 వరకు గుహలున్నాయి. ఆసాంతం కూడితే దాదాపు 15 కి.మీ. మేర విస్తరించి ఉంటాయని సమాచారం. ఇప్పటివరకు వాటిపై అధ్యయనం జరగలేదు. ములుగు గణపురానికి చేరువగా ఉన్న ఈ ప్రాంతంలో దాదాపు 5 కి.మీ. మేర రోడ్డు నిర్మిస్తే పర్యాటకులు సులభంగా అక్కడికి చేరుకోగలుగుతారు. లోపల లైటింగ్‌ ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం అందులో వేల సంఖ్యలో గబ్బిలాలు ఉండటంతో దుర్గంధభరితంగా ఉన్నాయి. వాటిని శుభ్రం చేస్తే సాహస పర్యాటకులకు స్వర్గధామమే.
 ఎక్కడ: మైలారం,భూపాలపల్లి జిల్లా

మరిన్ని వార్తలు