పట్టణాల్లో గెలుపు.. పట్టు నిలుపు!

25 Apr, 2021 04:26 IST|Sakshi

మున్సిపల్‌ ఎన్నికల్లో సత్తా చాటేందుకు బీజేపీ ప్రణాళిక

పట్టణ ప్రాంతాల్లో ఉన్న బలాన్ని ఓట్లుగా మార్చుకునేందుకు చర్యలు

ఇప్పటికే పలుచోట్ల ఇన్‌చార్జీల నియామకం..

పార్టీ గెలుపు బాధ్యతలను తీసుకున్న ముఖ్యనేతలు

సాక్షి, హైదరాబాద్‌: మినీ పురపోరును బీజేపీ సవాల్‌గా తీసుకుంది. ఎన్నికల రణానికి అన్ని అస్త్రాలతో సిద్ధమైంది. మున్సి‘పోల్స్‌’లో విజయం ద్వారా పట్టణాల్లో పట్టు నిలుపుకోవాలని భావిస్తోంది. వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లు, సిద్దిపేట్‌; నకిరేకల్, అచ్చంపేట, జడ్చర్ల, కొత్తూర్‌ మున్సిపాలిటీలకు జరిగే ఎన్నికల్లో సత్తా చాటేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంది. పట్టణ ప్రాంతాల్లో తమకు ఉన్న బలాన్ని ఓట్లుగా మార్చుకునేందుకు పక్కావ్యూహంతో ముందుకువెళుతోంది. పార్టీకి బలమున్న డివిజన్లు, వార్డులపై ప్రత్యేక దృష్టి సారించడంతోపాటు మిగతాచోట్లా తమ అభ్యర్థులను గెలి పించుకునేలా కసరత్తు చేసింది. క్షేత్రస్థాయిలో ప్రతిఓటరు నూ కలిసేలా పార్టీ శ్రేణులను రంగంలోకి దింపింది. వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లకు ఇన్‌చార్జీలను నియమించింది.

ముందు నుంచే సిద్ధంగా ఉన్న పార్టీ.. 
ఎన్నికల నోటిఫికేషన్‌ రాకముందే పార్టీ శ్రేణులను బీజేపీ రాష్ట్ర నాయకత్వం అప్రమత్తం చేసింది. నోటిఫికేషన్‌ రాగానే ప్రచార, గెలుపు వ్యూహాలను రూపొందించుకుంది. ఇందులో భాగంగా ఇటీవల వరంగల్‌లోనూ భారీ సభను నిర్వహించింది. ఇన్‌చార్జీల నేతృత్వంలో స్థానిక నేతల ప్రచారం కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. త్వరలోనే రాష్ట్రస్థాయి నేతలను ప్రచార రంగంలోకి దించాలని భావిస్తోంది. ఇప్పుడు కరోనా వ్యాప్తి ఉధృతంగా ఉన్నందున సభలు, సమావేశాలు పెద్ద ఎత్తున నిర్వహించే పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలో కోవిడ్‌ నిబంధనలు, భౌతికదూరం పాటిస్తూ ఇంటింటి ప్రచారానికి రూపకల్పన చేస్తోంది.

బాధ్యతలు తీసుకున్న ముఖ్య నేతలు.. 
మున్సిపల్‌ ఎన్నికల్లో పార్టీ కార్పొరేటర్‌ అభ్యర్థులు, వార్డు కౌన్సిలర్లను గెలిపించుకునే బాధ్యతలను ముఖ్యనేతలు స్వీకరించారు. వరంగల్‌ కార్పొరేషన్‌లో గెలుపు బాధ్యతలను పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్, ఖమ్మం కార్పొరేషన్‌లో బాధ్యతలను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి.కిషన్‌రెడ్డి, మహబూబ్‌నగర్‌లో పార్టీ గెలుపు బాధ్యతలను పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, సిద్దిపేట్‌ మున్సిపాలిటీలో ఎమ్మెల్యే రఘునందన్‌రావు తీసుకున్నట్లు తెలిసింది. వరంగల్‌ కార్పొరేషన్‌లో పార్టీ ఎన్నికల ఇన్‌చార్జీ మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డిని, ఖమ్మం కార్పొరేషన్‌లో పార్టీ ఎన్నికల ఇన్‌చార్జిగా మాజీ ఎమ్మెల్యే చింతల రాంచంద్రారెడ్డికి అప్పగించింది. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో దెబ్బతిన్న బీజేపీ మున్సిపల్‌ ఎన్నికల్లో కచ్చితంగా తమ సత్తా చాటాలన్న భావనలో ఉంది. తద్వారా టీఆర్‌ఎస్‌ తామే ప్రత్యామ్నాయమన్న విషయాన్ని చాటిచెప్పాలని యోచిస్తోంది. దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో కొనసాగించిన ఊపును మున్సిపల్‌ ఎన్నికల్లో కొనసాగించేలా బీజేపీ వ్యూహరచన చేస్తోంది.

మరిన్ని వార్తలు