విష వాయువు.. ఉక్కిరిబిక్కిరి

28 Aug, 2020 10:53 IST|Sakshi
మిర్జాపల్లిలోని ఫార్మా పరిశ్రమలో రసాయన లీకేజీని పరిశీలిస్తున్న అదనపు కలెక్టర్‌ నగేశ్‌

సాక్షి, మెదక్‌: అర్ధరాత్రి ఫార్మా కంపెనీ వదిలిన విషవాయువుతో ఉక్కిరి బిక్కిరి అయినట్లు చిన్నశంకరంపేట మండలం మిర్జాపల్లి గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు. బుధవారం రాత్రి చిన్నశంకరంపేట మండలం మిర్జాపల్లి గ్రామ శివారులోని కార్తికేయ ఫార్మా కంపెనీలో రసాయన లీకేజీతో ఒక్కసారిగా ఊరంతా పొగ కమ్మకుందని గ్రామస్తులు తెలిపారు. గ్రామంలో దుర్వాసనతో పొగ కమ్ముకోవడంతో ఊపిరి ఆడని పరిస్థితి నెలకొందన్నారు. కంట్లో మంటలతో పాటు ఊపిరిరాడని పరిస్థితి నెలకొందని గ్రామస్తులు తెలిపారు. దీంతో విషయం గమనించిన గ్రామ యువకులు కొందరు పరిశ్రమ వద్దకు పరుగుతీసి విషయంపై నిలదీయడంతో అప్రమత్తమైన పరిశ్రమ సిబ్బంది ఉత్పత్తిని నిలిపివేశారు. ఉదయం పరిశ్రమ వద్దకు చేరుకున్న గ్రామ సర్పంచ్‌ శ్రీనివాస్‌రెడ్డి, మాజీ జెట్పీటీసీ రమణ విషయం ఉన్నత అధికారుల దృష్టికి తీసుకుపోయి ఫిర్యాదు అందించారు. గతంలో ఇలాంటి సంఘటనలు జరిగాయని రాత్రి మరోసారి జరగడంతో ఇబ్బందులకు గురైనట్లు తెలిపారు. ప్రజల ఫ్రాణాలతో ఆటలాడుతున్న పరిశ్రమను మూసివేయాలని కోరారు. ఈ విషయంపై పరిశ్రమ ఎండీ కార్తీకేయ మాట్లాడుతూ తమ పరిశ్రమలో ఉత్పత్తులు ప్రాణాంతకమైనవి కావని తెలిపారు. అమ్మోనియం సల్పేట్‌ ఉత్పత్తి చేస్తామని తెలిపారు. స్టీమ్‌ పైప్‌ లీకేజీ అవడంతో సమస్య వచ్చిందని తెలిపారు. 

ఫార్మా కంపెనీ సీజ్‌కు అదనపు కలెక్టర్‌ అదేశాలు 
చిన్నశంకరంపేట మండలం మిర్జాపల్లి గ్రామశివారులోని కార్తీకేయ ఫార్మా కంపెనీని సీజ్‌ చేస్తున్నట్లు జిల్లా అదనపు కలెక్టర్‌ నగేశ్‌ తెలిపారు. గురువారం మధ్యాహ్నం ఆయన ఫార్మా పరిశ్రమను పరిశీలించి కనీస జాగ్రత్తలు కూడ తీసుకోవడంలేదని మేనేజర్‌ను ప్రశ్నించారు. పరిశ్రమ మేనేజర్‌ నుంచి సరైన సమా«ధానం రాకపోవడంతో వెంటనే పరిశ్రమను సీజ్‌చేస్తున్నట్లు తెలిపారు. పీసీబీ అధికారులు వచ్చి పరిశీలించి నివేదిక ఇచ్చేవరకు పరిశ్రమలో ఉత్పత్తులు నిర్వహించవద్దని హెచ్చరించారు. పరిశ్రమ రసాయన లీకేజీ విషయం అధికారులకు సమాచారం అందించడంలో విఫలమైన వీఆర్‌ఓకు మెమో జారీ చేయాలని తహసీల్దార్‌ను ఆదేశించారు. మెదక్‌ ఆర్‌డీఓ సాయిరామ్, తహసీల్దార్‌ రాజేశ్వర్‌రావు, ఎంపీడీఓ లక్ష్మణమూర్తి గ్రామప్రజలతో మాట్లాడి వివరాలు సేకరించారు.  

పీసీబీ అధికారుల పరిశీలన... 
విషవాయువు లీకైన  కార్తీకేయ ఫార్మా పరిశ్రమలో కాలుష్య నియంత్రణ మండలి ఈఈ రవి కుమార్, ఏఈ శిరీష, పరిశ్రమల కేంద్రం జిల్లా అధికారి కృష్ణమూర్తి,  కర్మాగారాల మేనేజర్‌ లక్ష్మి విచారణ నిర్వహించారు. పరిశ్రమలో ప్రమాదానికి కారణంతో పాటు కాలుష్యంపై పరిశీలనలు జరిపారు. ఈ సందర్భంగా పరిశ్రమలోని రసాయానాలను సేకరించి ల్యాబ్‌కు తరలిచనున్నట్లు తెలిపారు. 

మరిన్ని వార్తలు