ఆ బాధ్య‌త ప్ర‌భుత్వంపై ఉంది: ఉత్తమ్‌

25 Jul, 2020 17:29 IST|Sakshi

సాక్షి, హైద‌రాబాద్: ప్ర‌జ‌ల ఆరోగ్యంపై మాట్లాడ‌కుండా కాంగ్రెస్‌పై లేనిపోని ఆరోప‌ణ‌లు చేస్తున్నార‌ని అధికార పార్టీ నాయకులపై టీపీసీసీ చీఫ్ ఉత్త‌మ్‌కుమార్ రెడ్డి మండిప‌డ్డారు. శ‌నివారం టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్, కాంగ్రెస్ నగర అధ్యక్షులు అంజన్ కుమార్ యాదవ్, ఫిరోజ్ ఖాన్ తదితరులు ఉస్మానియా ఆస్పత్రి సూపరిండెంట్ పాండు నాయక్‌తో స‌మావేశ‌మ‌య్యారు. ఈ సంద‌ర్భంగా విలేక‌రుల స‌మావేశంలో ఉత్త‌మ్ మాట్లాడుతూ.. ఉస్మానియా ఆస్పత్రి భ‌వ‌నం కూలిపోయే ద‌శ‌లో ఉంద‌ని, భ‌వ‌నాల ఫ్లోరింగ్ దారుణంగా ఉంద‌న్నారు. ఎన్నిక‌ల సమ‌యంలో మంత్రులు ఏం మాట్లాడారో గుర్తు చేసుకోవాల‌ని ప్ర‌శ్నించారు. ఆసుప‌త్రి ఆందోళ‌నక‌ర ప‌రిస్థితిలో ఉన్నా ప్ర‌భుత్వం ప‌ట్టించుకోవ‌డం లేద‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

గ‌త నాలుగు సంవ‌త్స‌రాలుగా 500 కోట్ల రూపాయ‌ల బ‌డ్జెట్‌తో ఉస్మానియా ఆసుప‌త్రికి కొత్త భ‌వ‌నాల ప్ర‌ణాళిక ఉంద‌ని హాస్పిట‌ల్ సూప‌రిండెంట్ చెప్పినా అది ఆచ‌ర‌ణ రూపం దాల్చ‌డం లేద‌ని దుయ్య‌బ‌ట్టారు. ప్ర‌భుత్వం దీనికి ఒక్క రూపాయి కూడా కేటాయించ‌లేదన్నారు. నిజాం క‌ట్టిన భ‌వ‌నాల‌ను కూల్చే ఆలోచ‌న‌ను ప్ర‌భుత్వం విర‌మించుకోవాల‌ని, అద్భుత‌మైన స‌చివాల‌యాన్ని మూడ‌న‌మ్మ‌కాల కోసం కూల‌గొట్ట‌డం దారుణ‌మ‌న్నారు. హెరిటేజ్ భ‌వ‌నాన్ని కూల్చొద్ద‌ని, ఉస్మానియా ఆవ‌ర‌ణ‌లోనే ఉన్న 6 ఎక‌రాల స్థ‌లంలో కొత్త భ‌వ‌నాల‌ను నిర్మించాల‌ని ఈ సంద‌ర్భంగా  ప్ర‌భుత్వానికి విఙ్ఞ‌ప్తి చేశారు. హెరిటేజ్ భ‌వ‌నాల‌ను కాపాడాల్సిన బాధ్య‌త ప్ర‌భుత్వంపై ఉంద‌ని ఉత్త‌మ్ పేర్కొన్నారు. (క‌రోనాను 'ఆరోగ్య శ్రీ' లో చేర్చాలి : ఉత్త‌మ్ )

మరిన్ని వార్తలు