మాట నిలబెట్టుకోలేదనే కవితను ఓడించారు

30 Aug, 2021 01:48 IST|Sakshi

టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి 

బోధన్‌/కుత్బుల్లాపూర్‌: ప్రజలను మాటలతో మభ్యపెడితే ఓటుతో ఓడిస్తారని, మూతబడిన నిజాంషుగర్‌ ఫ్యాక్టరీని తెరిపిస్తానని ఇచ్చిన హామీ నిలబెట్టుకోకపోవడం వల్లే రైతులు సీఎం కేసీఆర్‌ కూమార్తె కవితను ఓడగొట్టారని టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. మేడ్చల్‌ జిల్లా కొంపల్లిలోని పీఆర్‌ కన్వెన్షన్‌ సెంటర్‌లో జరిగిన కాంగ్రెస్‌ పార్టీ బోధన్‌ నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో రేవంత్‌ మాట్లాడారు. కోటి ఎకరాలకు నీళ్లిస్తామని కేసీఆర్‌ చెబుతున్నారని, కానీ జలయజ్ఞం ద్వారా అప్పట్లోనే 60–70 లక్షల ఎకరాలకు నీరందించిన ఘనత కాంగ్రెస్‌ పార్టీదని తెలిపారు.

హుజూరాబాద్‌లో దళితబంధు అమలు తీరుపై కాంగ్రెస్‌ ప్రశ్నిస్తుంటే, ఓడిపోతామనే భయంతో తెలంగాణ–ఆంధ్ర ప్రజలను రెచ్చగొట్టి ప్రయోజనం పొందాలనుకుంటున్నారని విమర్శించారు. ఎంపీ అర్వింద్‌.. సోనియాగాంధీ గురించి విమర్శించడం మానుకోవాలని సూచించారు. కుమారుడిని అదుపులో పెట్టుకోకపోవడం డి.శ్రీనివాస్‌ తప్పేనన్నారు. తాను త్వరలో గజ్వేల్, నిజామాబాద్‌లో భారీసభలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. సమావేశంలో మాజీ మంత్రులు సుదర్శన్‌రెడ్డి, షబ్బీర్‌ అలీ, మాజీ ప్రభుత్వ విప్‌ అనిల్, నిజామాబాద్‌ డీసీసీ అధ్యక్షుడు మోహన్‌రెడ్డి పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు