హామీల అమలుకు ఇదే ఆఖరి అవకాశం 

4 Feb, 2023 02:03 IST|Sakshi

బడ్జెట్‌ కేటాయింపులపై సీఎంకు రేవంత్‌ లేఖ  

సాక్షి, హైదరాబాద్‌: ‘మీ ప్రభుత్వానికి చివరి బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి ఇదే మీకు ఆఖరి అవకాశం. ఇప్పటికైనా బడ్జెట్‌లో తగిన నిధులు కేటాయించి, హామీలన్నింటినీ రానున్న పదినెలల కాలంలో నెరవేర్చాలి. లేదంటే వచ్చే ఎన్నికల్లో మీకు ఓట్లు అడిగే హక్కు లేదు’అని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

త్వరలో ప్రవేశపెట్టబోయే రాష్ట్ర బడ్జెట్‌లో నిధుల కేటాయింపుపై శుక్రవారం ఆయన సీఎం కేసీఆర్‌కు బహిరంగ లేఖ రాశారు. 2018 ఎన్నికల సందర్భంగా  ప్రజలకు అనేక హామీలిచ్చారని కానీ నాలుగు బడ్జెట్‌లు పూర్తయినా ఆ హామీలను నెరవేర్చలేదని వెల్లడించారు. రైతులు, నిరుద్యోగ యువత, బీసీ, దళిత, మైనార్టీ వర్గాలకు ఇచ్చిన హామీల్లో ఒక్కటీ నెరవేర్చలేదని విమర్శించారు. రైతు రుణమాఫీ, దళితబంధు, పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు, డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లు, సొంత స్థలం ఉంటే ఇల్లు కట్టుకునేందుకు రూ.3 లక్షల సాయం వంటి పలు అంశాలను రేవంత్‌ తన లేఖలో ప్రస్తావించారు. 

మరిన్ని వార్తలు