టీఆర్‌ఎస్‌ పొత్తుపై రేవంత్‌ రెడ్డి కీలక వ్యాఖ్యలు.. అదే కేసీఆర్‌ పాలిట శాపమైందంటూ..

8 Sep, 2022 17:02 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో అధికార టీఆర్‌ఎస్‌-ప్రతిపక్ష కాంగ్రెస్‌ల మధ్య పొత్తు ఉండనుందా? అనే ఆసక్తికరమైన చర్చ తెర మీదకు వచ్చింది. కాంగ్రెస్ సీనియర్ దిగ్విజయ్ సింగ్ ఈమధ్య ‘కేసీఆర్ తమతో కలవచ్చుగా..’ అంటూ చేసిన వ్యాఖ్యలే ఇందుకు కారణం. ఈ తరుణంలో తెలంగాణలో కాంగ్రెస్‌-టీఆర్‌ఎస్‌ పొత్తులపై టీపీసీసీ చీఫ్‌, ఎంపీ రేవంత్‌రెడ్డి తేల్చేశారు. కలలో కూడా టీఆర్‌ఎస్‌తో పొత్తు సాధ్యం కాదని తేల్చేశారు ఆయన. 

కాంగ్రెస్‌ పార్టీ నిర్వహిస్తున్న భారత్ జోడో యాత్రలో పాల్గొంటున్న పార్టీ కీలక నేత, ఎంపీ రాహుల్‌ గాంధీని.. గురువారం మధ్యాహ్నాం లంచ్‌ బ్రేక్‌లో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కలిశారు. ఈ సందర్భంగా.. రేవంత్‌ రెడ్డి మీడియాతో పొత్తు అంశంపై కీలక వ్యాఖ్యలే చేశారు. 

‘‘టీఆర్ఎస్‌తో పొత్తు ఉండదని వరంగల్ సభలో రాహుల్ గాంధీ తేల్చి చెప్పారు. తెలంగాణ రాజకీయాల్లో కాంగ్రెస్ జాడ లేకుండా చేసేందుకే కేసీఆర్.. బీజేపీని ప్రోత్సహించారు. ఇప్పుడు అదే బీజేపీ.. కేసీఆర్‌ పాలిట శాపంగా మారింది.. సమస్యలు సృష్టిస్తోంది. ఎనిమిదేళ్ల కేసీఆర్ పాలనపై యుద్ధం చేసి తీరతాం. అంతేగానీ.. టీఆర్ఎస్ పాపాలను మోసేందుకు మాత్రం కాంగ్రెస్ సిద్ధంగా లేదన్నారు రేవంత్‌ రెడ్డి. అలాగే.. బీజేపీపైనా విమర్శలు గుప్పించిన ఆయన.. తెలంగాణ బీజేపీలో గెలిచేంత మొనగాళ్లు ఎవరున్నారని? ప్రశ్నిస్తూ.. ఆయన కనీసం 10 మంది కూడా గెలవలేరని జోస్యం చెప్పారు. 

ఇక రాహుల్ గాంధీతో భేటీ అయితే రేవంత్ రెడ్డి.. తెలంగాణలో బారత్ జోడో యాత్ర పైన చర్చించినట్లుగా తెలుస్తోంది. రాహుల్ యాత్రను మునుగోడు మీదుగా జరిగేలా చూడడంతో పాటు అక్కడే ఓ బహిరంగ సభ ఏర్పాటు చేయాలన్నది కాంగ్రెస్‌ ముఖ్య ఉద్దేశంగా కనిపిస్తోంది.

ఇదీ చదవండి: మాతో టచ్‌లో 10 మంది ఎమ్మెల్యేలు.. బాంబు పేల్చిన ప్రతిపక్షం

మరిన్ని వార్తలు