‘ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ పెడితే ఇలా చేస్తారా.. నేను కూడా అదే పోస్ట్‌ చేస్తా’

14 Dec, 2022 10:44 IST|Sakshi
మాణిక్యం ఠాగూర్‌(ఫైల్‌ఫోటో)

హైదరాబాద్‌: కాంగ్రెస్‌ పార్టీ వ్యవహారాలు జరిగే వార్‌రూమ్‌లో పోలీసులు సోదాలు చేయడాన్ని నిరసిస్తూ తెలంగాణ వ్యాప్తంగా ఆందోళన చేపట్టింది టీపీసీసీ. కాంగ్రెస్ వార్ రూమ్‌పైన దాడికి నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా బుధవారం అన్ని మండల కేంద్రాల్లో నిరసనలు చేపట్టాల్సిందిగా పార్టీ నేతలు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి. ఈ క్రమంలోనే అన్ని మండల కేంద్రాల్లో ఆందోళన చేపట్టింది.  కాంగ్రెస్ పార్టీ వ్యూహకర్త సునీల్ కనుగోలు కార్యాలయంలో పోలీసులు సోదాలు చేసి సీజ్ చేయడాన్ని ప్రధానంగా తప్పు పట్టింది తెలంగాణ కాంగ్రెస్‌. ఈ దాడులకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ కారణమని రేవంత్‌రెడ్డి విమర్శించిన సంగతి తెలిసిందే.     

మరొకవైపు ఈ ఘటనపై టీ కాంగ్రెస్‌ ఇంఛార్జి మాణిక్యం ఠాగూర్‌ సైతం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ పెట్టినందుకు తెలంగాణ కాంగ్రెస్‌ వార్‌రూమ్‌పై దాడి చేశారని, 50 కంప్యూటర్లు స్వాధీనం చేసుకున్నారని విమర్శించారు. ప్రొసీజర్‌ లేకుండా తమ సిబ్బందిని పోలీసులు అరెస్ట్‌ చేశారని మండిపడ్డారు.అరెస్ట్‌ వారెంట్‌  ఇవ్వలేదని, 41A CrPC నోటీసులు ఇవ్వకుండా పూర్తిగా నిబంధనలు ఉల్లంఘించారన్నారు. ఈ అక్రమాలకు మంత్రి కేటీఆర్‌, సీపీ సీవీ ఆనంద్‌ బాధ్యత వహించాలన్నారు. ఇప్పుడు తాను కూడా అదే పోస్ట్‌ చేస్తానంటూ మాణిక్యం ఠాగూర్‌ ట్వీట్‌ చేశారు.

మరిన్ని వార్తలు