14 రోజుల యాత్రలో ఏం చేయాలన్న దానిపై ప్రతిపాదనలు రెడీ
ఏఐసీసీ అనుమతిస్తే చిలుకూరు బాలాజీ, షాద్‌నగర్ దర్గా, మెదక్ చర్చిల సందర్శన
పాలమూరు వర్సిటీ విద్యార్థులతో ముఖాముఖి... శంషాబాద్‌లో మునుగోడు సభ
ఇందిరాగాంధీ వర్ధంతి రోజున బీహెచ్‌ఈఎల్‌లో మహిళల సభ
ప్రతి 2.5 కి.మీ.కో అసెంబ్లీ నియోజకవర్గ నాయకులకు రాహుల్‌తో నడిచే చాన్స్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో జరగనున్న రాహుల్‌గాంధీ భారత్ జోడో పాదయాత్ర పూర్తిస్థాయిలో సద్వినియోగం కోసం ఏఐసీసీ పంపిన రూట్‌మ్యాప్‌కు టీపీసీసీ భారీ మార్పులు చేసింది. హైదరాబాద్ గుండా గాంధీభవన్ మీదుగా యాత్రను తీసుకెళ్లేందుకు ప్లాన్ చేస్తోంది. యాత్ర షెడ్యూల్‌పై చర్చించేందుకు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అధ్యక్షతన శుక్రవారం గాంధీభవన్‌లో జరిగిన సమావేశానికి ముఖ్య నేతలు భట్టి విక్రమార్క, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, మధుయాష్కీగౌడ్, బలరాంనాయక్, పొన్నాల లక్ష్మయ్య, దామోదర రాజనర్సింహ, మహేశ్‌కుమార్‌గౌడ్, అజారుద్దీన్, కోదండరెడ్డి, ఎమ్మెల్యే సీతక్క, మల్లు రవి, రేణుకాచౌదరి, చిన్నారెడ్డి తదితరులు హాజరై ఏఐసీసీ ఇచ్చిన షెడ్యూల్‌పై చర్చించారు.
ఏఐసీసీ ఇచ్చిన రూట్ ప్రకారం.. మక్తల్, నారాయణపేట, కొడంగల్, తాండూరు, వికారాబాద్, జహీరాబాద్, జుక్కల్ మీదుగా యాత్ర వెళ్తే ప్రయోజనం ఉండదని భావించిన టీపీసీసీ ప్రత్యామ్నాయ రూట్‌మ్యాప్ రూపొందించి ఏఐసీసీకి పంపింది. రాష్ట్ర పార్టీలోని ముఖ్యనేతలందరూ చర్చించి ఏకగ్రీవ ఆమోదంతో రూట్ మ్యాప్‌ను మళ్లీ పంపాలని ఏఐసీసీ స్పష్టం చేసింది. దీంతో టీపీసీసీ ముఖ్యనేతలు.. మక్తల్, మహబూబ్‌నగర్, జడ్చర్ల, షాద్‌నగర్ మీదుగా శంషాబాద్ తర్వాత పాతబస్తీ మీదుగా గాంధీభవన్, అమీర్‌పేట, కూకట్‌పల్లి, లింగంపల్లి, పటాన్‌చెరు మీదుగా ముత్తంగి వెళ్లాలనే ప్రతిపాదనకు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది.
ఈ యాత్ర నిర్వహణకు ప్రచార, మీడియా, ఆహార, రవాణా, వాలంటీర్ కమిటీలను ఏర్పాటు చేయాలని.. ఎన్‌ఎస్‌యూఐ, యూత్‌కాంగ్రెస్ నుంచి 200 మంది చొప్పున వాలంటీర్లతో యాత్ర జరపాలని నిర్ణయించింది. అలాగే నగరం గుండా రాహుల్ యాత్రకు అనుమతి కోరుతూ డీజీపీకి శనివారం వినతిపత్రం సమర్పించాలని నిర్ణయించింది.
టీపీసీసీ ప్రతిపాదనలివే..
ఎన్నికల యాత్ర కాదు: రేవంత్
టీపీసీసీ ముఖ్యుల భేటీ తర్వాత ఉత్తమ్, యాష్కీ, శివసేన, బల్మూరి వెంకట్‌తో కలిసి రేవంత్ గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడారు. రాహుల్ యాత్ర రూట్‌మ్యాప్‌ను సిద్ధం చేశామని, దీన్ని ఏఐసీసీ ఆమో దానికి పంపుతామన్నారు. రాహుల్ చేపట్టిన భారత్‌జోడో యాత్ర ఎన్నికల యాత్ర కాదని, దేశ ప్రయోజనాల కోసం చేస్తున్న బృహత్తర ప్రయత్నమని చెప్పా రు. ఈ దేశాన్ని బలమైన దేశంగా నిలబెట్టేందుకు రాహుల్‌తో తెలంగాణ సమాజం కలిసి రావాలని ఆయన పిలుపునిచ్చారు. తెలంగాణ సాధన ఉద్యమంలో ఎవరున్నారన్న దానిపై మంత్రి కేటీఆర్‌తో చర్చించేందుకు సిద్ధమని రేవంత్ వెల్లడించారు.