వెయిట్‌ అండ్‌ సీ... ఆచితూచి టీపీసీసీ

6 Jan, 2021 01:22 IST|Sakshi

రోజుకో మలుపు తిరుగుతున్న కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్ష వ్యవహారం

ప్రచార కమిటీ చైర్మన్‌ పదవి ఇచ్చినా ఓకే అన్న రేవంత్‌

తెరపైకి జీవన్‌రెడ్డి, జానా, శ్రీధర్‌బాబు, శశిధర్‌ పేర్లు

జీవన్‌కు ఖరారైందని ప్రచారం, అదేమీ లేదన్న అధిష్టానం 

నాగార్జునసాగర్‌ ఉపఎన్నిక వరకూ వేచి చూద్దామా? 

తర్జనభర్జనలో ఢిల్లీ పెద్దలు

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ (టీపీసీసీ)కి కొత్త అధ్యక్షుడి నియామకం ఇప్పట్లో తేలేలా కనిపించడం లేదు. ’పట్టు‘విడుపులు లేని నాయకుల పంతాలతో వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. పార్టీ ఎంపీలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రేవంత్‌రెడ్డిలలో ఎవరో ఒకరిని ఈ పదవి వరిస్తుందనే చర్చ నిన్నటి వరకు జరగ్గా, ఇప్పుడు అనూహ్యంగా మరికొందరి పేర్లు తెరపైకి వచ్చాయి. ఆ ఇద్దరూ కాకుండా మధ్యేమార్గంగా రాష్ట్ర పార్టీ సీనియర్‌ నాయకులు టి.జీవన్‌రెడ్డి, కె.జానారెడ్డి, డి.శ్రీధర్‌బాబు, మర్రి శశిధర్‌రెడ్డిల పేర్లు ముందు వరుసలోకి వచ్చాయి. ఒకదశలో ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి పేరు ఖరారైందన్న ప్రచారం కూడా జరి గింది.

ఈ నేపథ్యంలో ఏ క్షణమైనా ఏఐసీసీ నుంచి అధికారిక ప్రకటన వెలువడొచ్చంటూ మంగళవారమంతా హడావుడి జరిగింది. కానీ, సాయంత్రానికి అలాంటిదేమీ లేదని అధిష్టానం తేల్చడంతో కాంగ్రెస్‌ శ్రేణులు నిట్టూర్చాయి. సామాజిక సమీకరణలు, పంతాలు, పట్టింపులు, రాష్ట్రంలో పార్టీ పరిస్థితులు, త్వరలో జరగబోయే ఎన్నికలు లాంటి అంశాల నేపథ్యంలో అసలు టీపీసీసీకి ఎవరిని ఎంపిక చేయాలన్నది పార్టీ అధిష్టానానికి కూడా తలనొప్పిగా మారిందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సంక్రాంతి నాటికల్లా వ్యవహారాన్ని తేల్చాలా... నాగార్జునసాగర్‌ ఉపఎన్నిక వరకు వేచి ఉండాలా అనే ఆలోచనలో ఢిల్లీ పెద్దలు ఉన్నట్టు తెలుస్తోంది. 

రేవంత్‌ వ్యాఖ్యలతో...!
వాస్తవానికి సోమవారం వరకు టీపీసీసీ అధ్యక్ష వ్యవహారంపై రాష్ట్ర రాజకీయ వర్గాల్లో పెద్దగా చర్చ ఏమీ లేదు. కానీ, టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్, మల్కాజ్‌గిరి ఎంపీ రేవంత్‌రెడ్డి ఓ టీవీ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలతో ఒక్కసారిగా కలకలం రేగింది. తానే టీపీసీసీ అధ్యక్షుడిననే ధీమాతో ఉన్న రేవంత్‌ ఉన్నట్టుండి తనకు అధ్యక్ష పదవే ముఖ్యం కాదని, ప్రచార కమిటీ చైర్మన్‌ పదవి ఇచ్చినా ఎలాంటి ఇబ్బంది లేదంటూ చేసిన వ్యాఖ్యలతో అసలు పార్టీలో ఏం జరుగుతుందోననే చర్చ మొదలైంది. ఈ నేపథ్యంలోనే జీవన్‌రెడ్డి అధ్యక్షుడిగా, రేవంత్‌ ప్రచార కమిటీ చైర్మన్‌గా మంగళవారం అధికారిక ప్రకటన వెలువడుతుందనే ప్రచారం జరిగింది. 

అసలేం జరిగింది?
టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్‌ పదవి ఇచ్చినా ఫర్వాలేదంటూ రేవంత్‌ చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్‌ వర్గాలు పలురకాలుగా విశ్లేషించాయి. పీసీసీ అధ్యక్ష పదవే కచ్చితంగా ఇవ్వాల్సిన అవసరం లేదంటూ అధిష్టానానికి ఆయన వెసులుబాటు కల్పించారని, ఎవరికి ఇచ్చినా కలిసి పనిచేస్తాననే సంకేతాలు ఇచ్చారనే చర్చ జరిగింది. మరోవైపు అధిష్టానం నుంచి అలాంటి సంకేతాలు ఉన్నందునే రేవంత్‌ అలా మాట్లాడారని, ఆయనకు ప్రచార కమిటీ చైర్మన్‌ పదవి ఖరారైందనే ప్రచారం సాగింది. మహారాష్ట్ర పీసీసీ అధ్యక్షుని ఎంపికపై గురువారం నుంచి కాంగ్రెస్‌ అధిష్టానం దృష్టి సారించనున్న నేపథ్యంలో... ఈలోపే తెలంగాణ పీసీసీని తేల్చేస్తుందనే అంచనాతో ఈ ఊహాగానాలు సాగాయి. ఈ నేపథ్యంలో జీవన్‌రెడ్డి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మర్రి శశిధర్‌రెడ్డి, జానారెడ్డి, శ్రీధర్‌బాబు, మధుయాష్కీ గౌడ్‌లకు ఫలానా పదవులంటూ రాష్ట్రంలో చర్చ జరిగిందని ఏఐసీసీ వర్గాలు చెపుతున్నాయి. 

సామాజిక సమీకరణాల మాటేమిటి?
ఒకవేళ టీపీసీసీ అధ్యక్షునిగా జీవన్‌రెడ్డి, ప్రచార కమిటీ చైర్మన్‌గా రేవంత్‌రెడ్డిని అధిష్టానం ఖరారు చేసిన పక్షంలో రెండు కీలక పదవులూ ఒకే సామాజిక వర్గానికి దక్కుతాయని, అది చాలా నష్టానికి కారణమవుతుందనే అభిప్రాయం కాంగ్రెస్‌ వర్గాల్లో వ్యక్తమవుతోంది. తెలంగాణ రాజకీయ పరిస్థితుల ప్రకారం పీసీసీ అధ్యక్షుడు లేదా ప్రచార కమిటీ చైర్మన్‌ పదవుల్లో ఒకటి రెడ్డి సామాజిక వర్గానికి తప్పకుండా కేటాయించాలని, అయితే రెండో పదవిని మాత్రం బీసీ లేదా ఎస్సీలకు కేటాయించాల్సి ఉంటుందని ఆ పార్టీ నేతలే చెపుతున్నారు. నిన్నటి వరకు టీపీసీసీ రేసులో ఉన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డిని ఏం చేస్తారన్న దానిపై కూడా ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఆయనకు సీడబ్ల్యూసీలో ఆహ్వానితుడిగా అవకాశం ఇస్తారనే ప్రచారం ఉన్నా... ఉత్తమ్‌కుమార్‌ రెడ్డిని కాదని ఆయనకు కేటాయించే పరిస్థితి లేదని అంటున్నారు. ఒకవేళ కోమటిరెడ్డికి టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా అవకాశం ఇస్తే టీపీసీసీ అధ్యక్షుడు, ప్రచార కమిటీ చైర్మన్, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ పదవులన్నీ ఒకే సామాజిక వర్గానికి కేటాయించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో పార్టీలోని ఇతర సామాజిక వర్గ నేతలను ఎక్కడ సర్దుబాటు చేయాలన్నది అధిష్టానానికి రిస్క్‌ ఫ్యాక్టర్‌గా మారిందని టీపీసీసీలో కీలక నేత ఒకరు వ్యాఖ్యానించారు. ‘రాష్ట్రంలో బీజేపీ దూసుకువస్తోంది. ఆ పార్టీకి బీసీ అధ్యక్షుడు ఉన్నారు. టీఆర్‌ఎస్‌ కూడా బీసీలకు అనేక సమయాల్లో ప్రాధాన్యం ఇచ్చింది. మేం బీసీ, ఎస్సీలను విస్మరిస్తే నష్టమే జరుగుతుంది. తేడా వస్తే పునాదులే కదులుతాయి.. ఆచితూచి అడుగేయాలి’అని ఆయన వ్యాఖ్యానించడం గమనార్హం.

సాగర్‌ ‘గుబులు’
మరోవైపు టీపీసీసీ అధ్యక్ష ఎన్నిక వ్యవహారాన్ని తేల్చకపోవడానికి నాగార్జున సాగర్‌ అసెంబ్లీ ఉప ఎన్నిక కూడా కారణమని కాంగ్రెస్‌ వర్గాలంటున్నాయి. అసంతృప్తులు, అలకలతో పార్టీ నేతలు సహకరించకపోతే... పార్టీకి నష్టం జరుగుతుందనే ఆలోచన కూడా అధిష్టానం చేస్తున్నట్లు తెలిసింది. ముఖ్యంగా దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల తర్వాత జరుగనున్న సాగర్‌ ఉపఎన్నికలో కాంగ్రెస్‌ గెలవకపోతే రాష్ట్రంలో ఇక ఆ పార్టీ పరిస్థితి అంతేననే చర్చ రాజకీయ వర్గాల్లో ఉంది. ఈ నేపథ్యంలో సాగర్‌ ఎన్నిక పూర్తయ్యేవరకు టీపీసీసీపై ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దని సీనియర్‌ నేత జానారెడ్డి అధిష్టానాన్ని అడిగినట్టు గాంధీభవన్‌ వర్గాలు చెపుతున్నాయి. ముఖ్యంగా తన జిల్లాకు చెందిన ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి బ్రదర్స్‌ సహకారం ఈ ఎన్నికల్లో తనకు అవసరమని, ఈ నేపథ్యంలో ఎలాంటి నిర్ణయం తీసుకున్నా తనకు ఇబ్బందిగా మారే అవకాశం ఉందని జానా అధిష్టానం దృష్టికి తీసుకెళ్లినట్టు సమాచారం. ఈ పరిస్థితుల్లో ఫిబ్రవరి చివరి వారంలో ఈ ఉపఎన్నిక జరుగుతుందన్న అంచనా మేరకు అప్పటివరకు ఈ తలనొప్పి వ్యవహారాన్ని వాయిదా వేద్దామా..? లేక ముందుగా అనుకున్నట్టు సంక్రాంతి లోపు తేల్చేద్దామా? అనే తర్జనభర్జనలో ఢిల్లీ కాంగ్రెస్‌ పెద్దలు ఉన్నట్టు తెలుస్తోంది. 

జీవన్‌రెడ్డికి అభినందనల వెల్లువ
కాగా టీపీసీసీ అధ్యక్షుడిగా జీవన్‌రెడ్డి పేరు ఖరారైందన్న వార్తల నేపథ్యంలో ఆయనకు అభినందనలు వెల్లువెత్తాయి. మంగళవారం ఆయన పుట్టినరోజు కూడా కావడంతో జగిత్యాలలోని జీవన్‌రెడ్డి నివాసానికి అభిమానులు బారులు తీరారు. అయితే ఈ వ్యవహారంపై ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి ‘సాక్షి’తో మాట్లాడుతూ టీపీసీసీ అధ్యక్షుడి విషయంలో ఇంతవరకు తనకు ఎలాంటి సమాచారం లేదని అన్నారు. ఎవరికి టీపీసీసీ అధ్యక్ష పదవి ఇచ్చినా అందరూ కలిసి పనిచేయాల్సిందేనని నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. 

  • తెలంగాణ కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్ష వ్యవహారంలో ఇంకా ఏమీ తేలలేదని రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్యం ఠాగూర్‌ ‘సాక్షి’కి వెల్లడించారు
మరిన్ని వార్తలు