బీజేపీవి వేషాలు.. టీఆర్‌ఎస్‌ది అతి తెలివి: రేవంత్‌ రెడ్డి

7 Sep, 2022 02:38 IST|Sakshi

టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ ధ్వజం

తెలంగాణకు స్వాతంత్య్రంపై రెండురకాలుగా మాట్లాడుతున్నాయ్‌

అప్పుడా పార్టీలు మనుగడలోనే లేవు

ఏడాది పొడవునా తెలంగాణ స్వాతంత్య్ర వజ్రోత్సవాలు

సాక్షి, హైదరాబాద్‌: నిజాం సంస్థానం భారత యూనియన్‌లో కలిసిన రోజును విలీనమని టీఆర్‌ఎస్, విమోచనమని బీజేపీలు మాట్లాడుతున్నాయని, ఈ రెండు పార్టీలు అసలు తెలంగాణకు స్వాతంత్య్రం వచ్చిన రోజున మనుగడలోనే లేవని టీపీసీసీ అధ్యక్షుడు, ఎంపీ ఎ.రేవంత్‌రెడ్డి విమర్శించారు. ముస్లింలపై హిందువులు గెలిచినట్టు బీజేపీ వేషాలు వేస్తుంటే.. హిందూ, ముస్లింలను మచ్చిక చేసుకోవాలనే ఆలోచనతో టీఆర్‌ఎస్‌ అతి తెలివి తేటలు ప్రదర్శిస్తోందని వ్యాఖ్యానించారు. తెలంగాణ సాయుధ పోరాటంలో కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీలకు మాత్రమే ఉన్న పేటెంట్‌ హక్కును దొంగిలించి రాజకీయ లబ్ధి పొందేందుకు ఆ రెండు పార్టీలు ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. మంగళవారం గాంధీభవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాజీ ఎంపీలు మల్లురవి, అంజన్‌కుమార్‌ యాదవ్, మాజీ మంత్రి చిన్నారెడ్డి, యూత్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు శివసేనారెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఈరవత్రి అనిల్‌లతో కలిసి ఆయన మాట్లాడారు. నిజాం సంస్థానం ఇండియన్‌ యూనియన్‌లో కలిసిన రోజున తెలంగాణకు స్వాతంత్య్రం వచ్చిందని, అది జరిగి 75 ఏళ్లవుతున్న సందర్భంగా కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో ఏడాది పాటు స్వాతంత్య్ర వజ్రోత్సవాలను నిర్వహిస్తామని చెప్పారు.  

ప్రగతిభవన్‌లో సోదాలు జరపాలి.. 
లిక్కర్‌ స్కాంలో సోదాలంటూ బీజేపీ చేస్తున్న డ్రామాలను నమ్మేందుకు రాష్ట్రంలో వెర్రి వెంగళప్పలు ఎవరూ లేరని రేవంత్‌ వ్యాఖ్యానించారు. బీజేపీ నేతలు చెప్పినట్టు ఢిల్లీ లిక్కర్‌ స్కాంలో సీఎం కుమార్తె కవిత లేదా ఇతరుల పాత్ర ఉంటే ప్రగతిభవన్‌లో సోదాలు జరిపి, సీఎం కేసీఆర్‌ను విచారిస్తే ఆధారాలు లభిస్తాయని చెప్పారు. 

సీబీఐ విచారణ జరిపించాలి.. 
వేరే పార్టీల నుంచి గెలిచి టీఆర్‌ఎస్‌లో చేరినందుకు వారికి ముట్టిన డబ్బులు, లభించిన కాంట్రాక్టులు, జరిగిన భూముల రెగ్యులరైజేషన్లపై సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు. వచ్చే ఎన్నికల్లో తాను గెలుస్తానన్న నమ్మకం సీఎం కేసీఆర్‌కు లేదని అన్నారు. ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ 25 సీట్లకు మాత్రమే పరిమితం అవుతుందని జోస్యం చెప్పారు. అసెంబ్లీ సమావేశాన్ని ఆరు నిమిషాల్లోనే వాయిదా వేయడంపై స్పందిస్తూ.. కేసీఆర్‌ అరాచక చక్రవర్తి అన్నారు.  అక్టోబర్‌ 24 నుంచి తెలంగాణలో జరగనున్న భారత్‌ జోడో యాత్రను విజయవంతం చేయాలన్నా రు. అంతకుముందు యూత్‌ కాంగ్రెస్, ఎన్‌ఎస్‌యూఐ రూపొందించిన భారత్‌ జోడో యాత్ర పోస్టర్‌ను ఆయన ఆవిష్కరించారు.

ఇదీ చదవండి: దేశ రాజకీయాల పేరిట కేసీఆర్‌ కొత్త డ్రామాలు: బండి సంజయ్‌

మరిన్ని వార్తలు