Amnesia Pub Case: బెంజ్‌, ఇన్నోవా కార్లు ఎవరివి..?: రేవంత్‌ కీలక వ్యాఖ్యలు

8 Jun, 2022 16:26 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: జూబ్లీహిల్స్‌ అమ్నేషియా పబ్‌ కేసు తెలంగాణలో పొలిటికల్‌ హీట్‌ను పెంచింది. దేశవ్యాప‍్తంగా సంచలనంగా మారిన ఈ కేసుపై వివిధ పార్టీల నేతలు కీలక వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ కేసులో భాగంగా టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.

రేవంత్‌ రెడ్డి బుధవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. ‘‘జూబ్లీహిల్స్‌ లైంగిక దాడి కేసులో నిష్పక్షపాత విచారణ జరగాలి. ఆరోపణలు ఎదర్కొంటున్న వారిని విచారించాలి. సీవీ ఆనంద్‌ కొన్ని విషయాలు బయటకు చెప్పకుండా దాచిపెట్టారు. బెంజ్‌ కారు యజమాని ఎవరో చెప్పలేదు. ఇన్నోవా కారు ఎవరిదో కూడా సీవీ ఆనంద్‌ చెప్పలేదు. ప్రభుత్వ వాహనం అని స్టిక‍్కర్లు తొలగించింది ఎవరు?. ఇప్పటి వరకు వాహనాల యజమానులకు నోటీసులు ఎందుకు ఇవ్వలేదు.

నిందితులు ఆధారాలు లేకుండా చేసిన ప్రయత్నాలను ఎందుకు చెప్పలేదు. పాత్రదారులు, సూత్రదారులు ఎవరన్నది సీవీ ఆనంద్‌ చెప్పడం లేదు. మైనర్‌ను లైంగిక దాడి చేసిన వాహనాల ఓనర్లను పిలిచి ఎందుకు విచారించలేదు. ఇన్నోవా కారులో బాలికను తీసుకెళ్లారు. ఆమెపై లైంగిక దాడి జరిగిందని చెబుతున్నారు. మైనర్లు వాహనం నడిపితే యజమానిదే బాధ్యత. కార్ల యజమానులపై ఎందుకు కేసు పెట్టలేదు. వాహన యజమానులను ఎందుకు దాస్తున్నారు’’ అని ప్రశ్నించారు. 

ఇది కూడా చదవండి: పబ్‌ కేసులో నా మనవడిపై తప్పుడు ప్రచారం చేశారు: హోం మంత్రి మహమూద్‌ అలీ

మరిన్ని వార్తలు