Revanth Reddy: ‘చారానా కోడికి బారానా మసాలా’.. అన్నట్లు

13 Jul, 2021 02:23 IST|Sakshi
నిర్మల్‌లో ఎడ్లబండిపై ధర్నాకు వెళ్తున్న రేవంత్‌ రెడ్డి, కాంగ్రెస​ నాయకులు

రాష్ట్రానికి ‘గులాబీ’ చీడ

నిర్మల్‌లో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి

పెట్రోల్, డీజిల్, నిత్యావసర వస్తువులధరల పెరుగుదలపై జిల్లా కేంద్రాల్లో కాంగ్రెస్‌ నిరసనలు

నిర్మల్‌ / నెట్‌వర్క్‌ / సాక్షి, హైదరాబాద్‌: కేసీఆర్‌ సీఎం అయిన తర్వాత రాష్ట్రానికి ‘గులాబీ’చీడ పట్టిందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి విమర్శించారు. ఈ చీడను వదిలించుకోవడానికి ఏ మందు కొట్టాలో ప్రజలకు తెలుసని అన్నారు. తెలంగాణ లో ఇప్పుడు ఏ వర్గమూ సంతోషంగా లేదని, టీఆర్‌ఎస్‌ సర్పంచులు కూడా ఆత్మహత్య చేసుకునే పరి స్థితి దాపురించిందని విమర్శించారు. పెట్రోల్, డీజిల్, నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలను నిరసిస్తూ ఏఐసీసీ పిలుపు మేరకు, సోమవారం రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లో కాంగ్రెస్‌ ఆందోళనలు నిర్వహించింది. పార్టీ ముఖ్య నేతలు, శ్రేణులు ఈ కార్యక్రమాల్లో భారీగా పాల్గొన్నారు. నిర్మల్‌ జిల్లా కేంద్రంలో నిర్వహించిన ర్యాలీలో రేవంత్‌రెడ్డి పాల్గొన్నారు. నిర్మల్‌ మాజీ ఎమ్మెల్యే, ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్‌ ఏలేటి మహేశ్వర్‌రెడ్డితో కలిసి ఎడ్లబండిపై ఎక్కి నిరసన వ్యక్తం చేశారు. అనంతరం నిర్వహించిన బహిరంగ సభ, విలేకరుల సమావేశంలో రేవంత్‌రెడ్డి మాట్లాడారు.

కేంద్రంలో మోదీ.. రాష్ట్రంలో కేడీ
‘నా లక్కీనంబర్‌ 9. నియోజకవర్గాల్లో నిర్మల్‌ నంబర్‌ కూడా తొమ్మిదే. అలాంటి చోటు నుంచి టీపీసీసీ అధ్యక్షుడిగా తొలి నిరసన కార్యక్రమాన్ని ప్రారంభించా. సీఎం కేసీఆర్‌ లక్కీ నంబర్‌ ఆరు. దాన్ని తిరిగేసి కొడితే తొమ్మిదే అవుతుంది. కేసీఆర్‌ సర్కారు దోపిడీ మీద నిర్మల్‌ నుంచే పోరాటం ప్రారంభమైంది. కేంద్రంలో మోదీ, రాష్ట్రంలో కేడీ కలిసి పెట్రోల్, డీజిల్‌పైన పన్నులు బాదుతూ పేదల కడుపులు కొడుతున్నారు. రూ.40కి లీటర్‌ పోయాల్సిన పెట్రోల్‌పై చారానా కోడికి బారానా మసాలా.. అన్నట్లు రాష్ట్రం రూ.32, కేంద్రం రూ.33 మొత్తం రూ.65 అదనంగా పన్నులు వేసి, వంద దాటించారు. ఏడేళ్లలో 24 సార్లు పెట్రోల్‌ ధరలు పెంచడం దారుణం..’అని రేవంత్‌ ధ్వజమెత్తారు. ‘శంషాబాద్‌లో ఎయిర్‌పోర్ట్‌ నడిపే జీఎంఆర్‌తో కేసీఆర్‌ కుమ్మక్కయ్యాడు. వాళ్ల ఇంధనానికి ఒక్క రూపాయి పన్ను వేస్తూ పేదలు ఉపయోగించే పెట్రోల్‌పై రూ.32 వసూలు చేస్తున్నాడు. ఏడేళ్లలో ఇంధన పన్నుల రూపంలో మోదీ సర్కారు రూ.36 లక్షల కోట్లు వసూలు చేస్తే, కేసీఆర్‌ ప్రభుత్వం రూ.12 లక్షల కోట్లు ప్రజల నుంచి దోచుకుంది’అని రేవంత్‌ ఆరోపించారు.

గోల్కొండ ఖిల్లా కింద ఘోరీ కడతాం..
‘డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇల్లు, దళితులకు 3 ఎకరాల భూమి, ఇంటికో ఉద్యోగం..ఇలా ఏ ఒక్క హామీనీ కేసీఆర్‌ నెరవేర్చలేదు. 2023లో గోల్కొండ ఖిల్లాపై కాంగ్రెస్‌ ప్రభుత్వం జెండా ఎగురవేస్తుంది. అదే ఖిల్లా కింద కేసీఆర్‌ ఘోరీ కడతాం’ అని రేవంత్‌ అన్నారు. కాంగ్రెస్‌ పార్టీలో ఇంటిదొంగలకు ఈ నెలాఖరు వరకు డెడ్‌లైన్‌ అని, ఆలోపు మారితే ఉంటారని, లేదంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. 
ఖమ్మంలో భట్టి నిరసన 
ఖమ్మంలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఎడ్ల బండెక్కి నిరసన తెలిపారు. మిర్యాలగూడలో టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జగ్గారెడ్డి , తదితరులు ఎద్దుల బండి లాగి నిరసన తెలిపారు. హైదరాబాద్‌ ధర్నా చౌక్‌ వద్ద నిరసనలో టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌లు జె.గీతారెడ్డి, ఎం.అంజన్‌కుమార్‌ యాదవ్, టీపీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య పాల్గొన్నారు. కరీంనగర్‌లో జరిగిన సైకిల్, ఎడ్ల బండి ర్యాలీలో మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌ పాల్గొని మాట్లాడారు. రంగారెడ్డి జిల్లా కందుకూరు క్రాస్‌ రోడ్డులో టీపీసీసీ రాష్ట్ర ప్రచార కమిటీ చైర్మన్‌ మధుయాష్కీ గౌడ్‌ ఎడ్లబండిపై వచ్చి ఆందోళన చేపట్టారు. సంగారెడ్డి, సూర్యాపేట, మేడ్చల్‌ మల్కాజిగిరి, ములుగు జిల్లాల్లో నిర్వహించిన ర్యాలీల్లో ఆయా జిల్లాల డీసీసీ అధ్యక్షులు, ఇతర ముఖ్య నేతలు పాల్గొన్నారు.

రాజనర్సింహకు స్వల్ప గాయం
మెదక్‌ పట్టణంలోని బాలుర జూనియర్‌ కళాశాల నుంచి ఎస్పీ కార్యాయం వరకు చేపట్టిన ర్యాలీ సందర్భంగా ఎడ్లబండిపై నుంచి కాంగ్రెస్‌ సీనియర్‌ నేత దామోదర రాజనర్సింహ మాట్లాడుతుండగా ఎడ్లు బెదిరాయి. దీంతో రాజనర్సింహ ఒక్కసారిగా కిందపడిపోయారు. ప్రమాదంలో ఆయన కుడికాలికి స్వల్ప గాయమైంది.

మరిన్ని వార్తలు