Hanuman Shobha Yatra: ఈ మార్గాల్లో ట్రాఫిక్‌ మళ్లింపు

16 Apr, 2022 11:48 IST|Sakshi

ప్రారంభమైన  హనుమాన్‌ జయంతి ఊరేగింపు

గౌలిగూడ నుంచి సికింద్రాబాద్‌ వరకు 8 వేల మంది సిబ్బందితో బందోబస్తు

 ఆయా మార్గాల్లో ట్రాఫిక్‌ మళ్లింపులు 

సాక్షి, హైదరాబాద్‌: హనుమాన్‌ జయంతి నేపథ్యంలో జరిగే విజయ్‌ యాత్రకు పోలీసు విభాగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ప్రధాన ఊరేగింపు గౌలిగూడ రామ్‌ మందిర్‌లో ఉదయం 11.30 గంటలకు మొదలై సికింద్రాబాద్‌లోని తాడ్‌బండ్‌ హనుమాన్‌ మందిర్‌ వద్ద రాత్రి 8 గంటలకు ముగియనుంది. ఈ మార్గంలోని వివిధ ప్రాంతాల మీదుగా 12 కి.మీ సాగుతుంది. మరో ఊరేగింపు రాచకొండ పరిధిలోని కర్మన్‌ఘాట్‌ హనుమాన్‌ టెంపుల్‌ వద్ద మొదలై వివిధ మార్గాల్లో 10.8 కి.మీ ప్రయాణిస్తూ కోఠి ఉమెన్స్‌ కాలేజ్‌ జంక్షన్‌ వద్ద ప్రధాన ఊరేగింపులో కలవనుంది.

ఈ మ్యాప్‌ను పోలీసు కమిషనర్‌ సీవీ ఆనంద్‌ శుక్రవారం విడుదల చేశారు. ఈ రెండు మినహా కొత్త ఊరేగింపులకు ప్రధాన ఊరేగింపులో కలవడానికి అనుమతించరు. నగర పోలీసులతో పాటు ఇతర విభాగాలతో కలిపి మొత్తం 8 వేల మందితో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే జీహెచ్‌ఎంసీ, ఆర్టీసీ సహా వివిధ విభాగాలతో భేటీ అయిన నగర పోలీసులు సమన్వయంతో ముందుకు వెళ్లడానికి ప్రణాళికలు సిద్ధం చేశారు.  


రూట్‌మ్యాప్‌

► బషీర్‌బాగ్‌లోని కమిషనరేట్‌లో అన్ని శాఖలకు కలిపి ఉమ్మడి కమాండ్‌ అండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ ఏర్పాటు చేస్తున్నారు. అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా సున్నిత ప్రాంతాల్లో అదనపు బందోబస్తు చర్యలు తీసుకుంటున్నారు. సైబర్‌ స్పేస్‌ పోలీసింగ్‌లో భాగంగా సోషల్‌మీడియాపై కన్నేసి ఉంచడానికి ప్రత్యేక బృందాలు ఏర్పాటయ్యాయి.  

► ఊరేగింపుపై షీ– టీమ్స్, మఫ్టీ పోలీసులు కన్నేసి ఉంచనున్నారు. విజయ్‌ యాత్ర జరిగే మార్గాలతో పాటు చుట్టుపక్కల రూట్లలోనూ ముమ్మర తనిఖీలు, సోదాలు చేయనున్నారు. ఊరేగింపు నేపథ్యంలో శనివారం మద్యం విక్రయాలను నిషేధించారు. యాత్ర జరిగే మార్గాల్లో శుక్రవారం పర్యటించిన నగర పోలీసు కమిషనర్‌ సీవీ ఆనంద్‌ ఇతర ఉన్నతాధికారులతో పూర్తి స్థాయిలో సమీక్షించారు.

► బందోబస్తుతో పాటు ఇతర అంశాల్లో తీసుకోవాల్సిన చర్యలను సూచించారు. ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ.. ‘శనివారం పనిదినం కావడంతో సాధారణ వాహనచోదకులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ట్రాఫిక్‌ మళ్లింపులు అమలు చేస్తున్నాం. ఊరేగింపు జరిగే మార్గాల్లోని ఎత్తైన భవనాలపై ఉండే ప్రత్యేక సిబ్బంది రూఫ్‌ టాప్‌ వాచ్‌ నిర్వహిస్తారు. అవసరమైన స్థాయిలో సీసీ కెమెరాలతో పాటు డ్రోన్లును వాడుతున్నాం’ అని పేర్కొన్నారు.  
చదవండి: E Challan: అంచనాలకు మించి వసూలు.. వారిపై చర్యలకు రంగం సిద్ధం

ట్రాఫిక్‌ మళ్లింపు, ఆంక్షలు ఈ ప్రాంతాల్లోనే.. 
శనివారం ఉదయం 11.30– 12 గంటల మధ్య గౌలిగూడ నుంచి విజయ్‌ యాత్ర మొదలవుతుంది. మరో కర్మన్‌ఘాట్‌లో ప్రారంభమవుతుంది. ఈ ఊరేగింపులు ఏయే ప్రాంతాలకు చేరుకుంటే అక్కడ, ఆయా సమయాల్లో మళ్లింపులు, ఆంక్షలు అమలవుతాయి. నిర్దేశిత సమయాల్లో ఈ మార్గాల్లో ప్రయాణించాల్సిన వారు ప్రత్యామ్నాయాలు ఎంచుకోవాలని పోలీసులు కోరుతున్నారు. ఎలాంటి సహాయ సహకారాలు అవసరమైనా 040– 27852482, 90102 03626, లేదా హైదరాబాద్‌ పోలీసు సోషల్‌మీడియా యాప్స్‌ను సంప్రదింవచ్చు.   

మరిన్ని వార్తలు