Hyderabad: రోజుకో రోడ్డు క్లోజ్‌!.. వాహనదారులకు చుక్కలు

2 Dec, 2022 06:59 IST|Sakshi
జూబ్లీహిల్స్‌ రోడ్‌ నెం. 36 చట్నీస్‌ వద్ద వన్‌వే ఏర్పాటు చేసిన ట్రాఫిక్‌ పోలీసులు 

వాహనదారుల అయోమయం 

అసంతృప్తి వెళ్లగక్కుతున్న జూబ్లీహిల్స్‌ నివాసితులు 

రోడ్డు విస్తరించకుండా ప్రయోగాలేంటంటూ నిరసన

జూబ్లీహిల్స్‌ రోడ్‌ నెం. 45లో ట్రాఫిక్‌ రద్దీని నియంత్రించేందుకు వారం క్రితం ట్రాఫిక్‌ పోలీసులు ప్రయోగాత్మకంగా చేపట్టిన ట్రాఫిక్‌ డైవర్షన్‌ విమర్శలకు దారి తీస్తోంది. రోజుకొక కొత్త నిర్ణయాన్ని తీసుకొస్తున్న ట్రాఫిక్‌ పోలీసులు వాహనదారులకు చుక్కలు చూపిస్తున్నారు. ఈ రోజు వెళ్లిన మార్గం తెల్లారేసరికి మూసేస్తున్నారు. ఆ తెల్లవారి అటు నుంచి వెళ్దామనుకుంటే మళ్లీ ‘వన్‌వే’గా మారుస్తున్నారు.  

సాక్షి, బంజారాహిల్స్‌: ఇలా ఇష్టానుసారంగా రోడ్లను మూసేస్తుండటం, వన్‌వేలో ఏర్పాటు చేస్తుండటాన్ని కేవలం వాహనదారులే కాకుండా జూబ్లీహిల్స్‌ కాలనీవాసులు కూడా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. నిన్న మొన్నటి దాకా జూబ్లీహిల్స్‌ రోడ్‌ నెం. 36 నుంచి జూబ్లీహిల్స్‌ రోడ్‌ నెం. 54 చట్నీస్, ఫర్జీ మీదుగా వాహనాలు రాకపోకలు సాగించాయి. 
►గురువారం తెల్లవారుజామున చట్నీస్‌ ముందు నుంచి రోడ్‌ నెం. 54 వైపు వాహనాలు అనుమతించకుండా కేవలం రోడ్‌ నెం. 54 నుంచి రోడ్‌ నెం. 36 వైపు మాత్రమే వన్‌వేగా మార్చారు. దీంతో ఇటువైపు వెళ్లే వాహనదారులు చుట్టూ తిప్పుకొని రావాల్సిన పరిస్థితులు తలెత్తాయి. 
►ఇంకోవైపు సీవీఆర్‌ న్యూస్‌ చౌరస్తా నుంచి జర్నలిస్టు కాలనీ, బాలకృష్ణ నివాసం చౌరస్తా మీదుగా అటు రోడ్‌ నెం45 వెళ్లాలన్నా, ఇటు జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్టుకు వెళ్లాలన్నా గతంలో మాదిరిగానే ట్రాఫిక్‌ జామ్‌ అవుతున్నది. రోడ్‌ నెం. 45 ఫ్లై ఓవర్‌ కింద యధాప్రకారం ట్రాఫిక్‌ స్తంభించిపోతూ వాహనదారులను ప్రత్యక్ష నరకానికి గురి చేస్తున్నది. 
►రోడ్‌ నెం. 45 నుంచి ఫినిక్స్‌ పక్కన ఉన్న రోడ్డు నుంచి, అల్లు అర్జున్‌ ఇంటి వైపు రోడ్డు నుంచి వాహనాలను అనుమతించకుండా రోడ్‌ క్లోజ్‌ చేశారు. దీంతో ఇక్కడ వాహనాలన్నీ బాలకృష్ణ చౌరస్తా నుంచి జూబ్లీహిల్స్‌ చౌరస్తాకు వెళ్లాల్సి రావడంతో ఇక్కడ రోడ్డు ఎత్తుగా ఉండటం, ఇరుకుగా ఉండటం, పుట్‌పాత్‌ లేకపోవడంతో అటు పెట్రోల్‌ బంక్‌ మరో అడ్డంకిగా మారి ఉదయం నుంచి అర్ధరాత్రి దాకా వాహనాలు స్తంభించిపోతున్నాయి. 

జూబ్లీహిల్స్‌ రోడ్‌ నెం. 36లో స్తంభించిన ట్రాఫిక్‌

►ట్రాఫిక్‌ ఉన్నతాధికారులు మాత్రం రోజుకొకరు చొప్పున ఈ రోడ్డును పరిశీలించడం, స్థానిక పోలీసులకు సూచనలు జారీ చేయడంతోనే సరిపెట్టుకుంటున్నారు. 
►ఇప్పటిదాకా ట్రాఫిక్‌ డైవర్షన్‌ చేపట్టిన రోడ్లలో జీహెచ్‌ఎంసీ ఇంజనీర్లు గుంతలను పూడ్చలేదు. రోడ్డు మరమ్మతులు చేపట్టలేదు. దెబ్బతిన్న ఫుట్‌పాత్‌లను బాగు చేయలేదు. 
►విద్యుత్‌ అధికారులు రోడ్డుకు అడ్డుగా ఉన్న కరెంటు స్తంభాలను, హైటెన్షన్‌ వైర్‌ స్తంభాలను తొలగించిన పాపాన పోలేదు. రోడ్లపక్కనే కేబుల్‌ వైర్లు జారిపడుతూ వాహనదారులకు నరకాన్ని చూపిస్తున్నాయి. గతంలో సీవీఆర్‌ న్యూస్‌ చౌరస్తా నుంచి జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్టు వెళ్లడానికి పది నిమిషాల సమయం పడితే ప్రస్తుతం డైవర్షన్‌ చేపట్టిన తర్వాత 15 నిమిషాలు పడుతున్నదని వాహనదారులే స్వయంగా ట్రాఫిక్‌ పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నారు. ఇక సోషల్‌ మీడియాలో ఈ ట్రాఫిక్‌ డైవర్షన్‌పై వాహనదారులు తమ అసంతృప్తిని వెళ్లగక్కుతున్నారు. ప్రయోగాత్మకం పేరుతో తమను జూబ్లీహిల్స్‌ వీధులన్నీ తిప్పిస్తున్నారంటూ ట్రాఫిక్‌ పోలీసుల తీరును ఎండగడుతున్నారు. 

►ట్విట్టర్‌లో ఇప్పటికే వందలాది మంది వాహనదారులు ట్రాఫిక్‌ డైవర్షన్‌ పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తూ నగర పోలీస్‌ కమిషనర్‌కు, నగర ట్రాఫిక్‌ అదనపు కమిషనర్‌కు తమ బహిరంగ అసంతృప్తిని వ్యక్తం చేస్తూ ఈ ప్రయోగం విఫలమైందంటూ ఘాటుగా చెబుతున్నారు. రోడ్లను విస్తరించకుండా... దెబ్బతిన్న రోడ్లకు మరమ్మతులు చేపట్టకుండా... ఫుట్‌పాత్‌లను అందుబాటులోకి తీసుకురాకుండా ట్రాఫిక్‌ డైవర్షన్‌ నిర్ణయాలు తీసుకొని వాహనదారుల నెత్తిన రుద్దారని ఆరోపణలు గుప్పుమంటున్నాయి. 
►ఇదిలా ఉండగా జూబ్లీహిల్స్‌ రోడ్‌ నెం. 45లో చేపట్టిన ట్రాఫిక్‌ డైవర్షన్లు జూబ్లీహిల్స్‌లోని మిగతా రహదారులపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. రెసిడెన్షియల్‌ ఏరియాల్లో వాహనాలు స్తంభించిపోతూ అటు శబ్ధ కాలుష్యం, ఇటు వాయు కాలుష్యంతో పాటు తమకు నరకాన్ని చూపిస్తున్నాయంటూ కాలనీవాసులు గగ్గోలు పెడుతున్నారు.  

మరిన్ని వార్తలు