దయచేసి వినండి.. రైలు ప్రయాణికులకు గమనిక

7 May, 2021 02:44 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

రిజర్వేషన్‌ ఉంటేనే  రైలు ప్రయాణం..

వెయిటింగ్‌ లిస్టులో ఉంటే ప్రయాణానికి అనుమతి లేదు 

తాజాగా కోవిడ్‌ మార్గదర్శకాలను విడుదల చేసిన రైల్వే శాఖ   

సాక్షి, హైదరాబాద్‌: ప్రయాణికుల భద్రత దృష్ట్యా రైల్వే శాఖ తాజాగా మరిన్ని కోవిడ్‌ నిబంధనలను అమల్లోకి తెచ్చింది. ఇప్పటి వరకు వెయిటింగ్‌లిస్టులో ఉన్న ప్రయాణికులు రైలు ఎక్కిన తరువాత కొంత మొత్తం రుసుము చెల్లించి ప్రయాణం చేసేందుకు అవకాశం ఉండగా ఇక నుంచి వెయిటింగ్‌ లిస్టులో ఉన్న ప్రయాణికులను అనుమతించబో మని రైల్వే శాఖ స్పష్టం చేసింది. తాజా నిబంధనల ప్రకారం రిజర్వేషన్‌ టికెట్‌ ఉన్న వారిని మాత్రమే ప్రయాణానికి అనుమతిస్తారు. ఈ మేరకు దక్షిణమధ్య రైల్వే ఒక ప్రకటన విడుదల చేసింది.  

కొత్త మార్గదర్శకాలు ఇవీ.. 

  • అన్‌రిజర్వ్‌డ్‌ కోచ్‌లు ఉన్న రైళ్లలో మాత్రమే రిజర్వేషన్‌లేని ప్రయాణికులను అనుమతిస్తారు.  
     
  • కోవిడ్‌ దృష్ట్యా ప్రీపెయిడ్‌ కేటరింగ్‌ సౌకర్యాన్ని రద్దు చేశారు. తాజా నిబంధనల మేరకు ప్రయాణికులు తమ టికెట్‌ బుకింగ్‌తో పాటే గతంలో లాగా ఆహారపదార్థాలను బుక్‌ చేసుకొనేందుకు అవకాశం లేదు. 
     
  • ‘రెడీ టు ఈట్‌ భోజనం’, ప్యాక్‌ చేసిన ఐటమ్స్‌  మాత్రమే రైళ్లలో లభిస్తాయి.  
     
  • ఐఆర్‌సీటీసీ ద్వారా ఈ సదుపాయం లభిస్తుంది.  
     
  • రైళ్లలో ప్రయాణికులకు ఇకపై దుప్పట్లు ఇవ్వరు. 

    ఈ నిబంధనలు తప్పనిసరి.. 
     

  • రైల్వేస్టేషన్లు, రైళ్లలో కచ్చితంగా ఫేస్‌మాస్కులను ధరించాలి. భౌతిక దూరాన్ని పాటించాలి. శానిటైజర్‌ వెంట తెచ్చుకోవాలి.  
     
  • థర్మల్‌ స్క్రీనింగ్‌లో ఎలాంటి లక్షణాలు లేని వాళ్లను మాత్రమే ప్రయాణానికి అనుమతిస్తారు. 
     
  • గమ్యస్థానాల్లో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసే కోవిడ్‌ నిబంధనలను  పాటించాలి.  
     
  • ఆరోగ్య సేతు యాప్‌ను ఉపయోగించాలి.      

    మరో 28 రైళ్లు రద్దు
    సాక్షి, హైదరాబాద్‌: కోవిడ్‌ సెకండ్‌ వేవ్‌ విజృంభణ నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే వివిధ ప్రాంతాలకు వెళ్లే 28 రైళ్లను తాజాగా రద్దు చేసింది. ఈ నెలాఖరుకు కొన్ని..జూన్‌ మొదటి వారానికి మరికొన్ని రైళ్లు నిలిచిపోనున్నట్లు దక్షిణమధ్య రైల్వే సీపీఆర్వో సీహెచ్‌ రాకేశ్‌ గురువారం మీడియాకు వెల్లడించారు. తిరుపతి–విశాఖపట్నం, సికింద్రాబాద్‌–కర్నూలుసిటీ, కాకినాడ టౌన్‌–లింగంపల్లి, కాకినాడ టౌన్‌–రేణిగుంట, విజయవాడ–లింగంపల్లి, కరీంనగర్‌–తిరుపతి, గూడూరు–విజయవాడ, నాందేడ్‌–జమ్ముతావి, సికింద్రాబాద్‌–విశాఖపట్టణం, బిట్రగుంట–చెన్నై, సికింద్రాబాద్‌–సిర్పూర్‌కాగజ్‌నగర్, నర్సాపూర్‌–నాగర్‌సోల్, సికింద్రాబాద్‌– విజయవాడ, హైదరాబాద్‌–సిర్పూర్‌కాగజ్‌నగర్‌ తదితర రూట్లలో రాకపోకలు సాగించే ప్రత్యేక రైళ్లు రద్దైన వాటిలో ఉన్నాయి.   

మరిన్ని వార్తలు