ఇన్‌చార్జ్‌ సీఎండీల పాలనలో ట్రాన్స్‌కో, జెన్‌కో

22 Oct, 2021 03:53 IST|Sakshi

దీర్ఘ కాలిక సెలవులో సీఎండీ ప్రభాకర్‌రావు 

మళ్లీ విధుల్లో చేరికపై అనుమానాలు  

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ ట్రాన్స్‌కో, జెన్‌కో ఇన్‌చార్జిల పాలనలోనే కొనసాగుతోంది. ట్రాన్స్‌కో సీఎండీగా ఆ సంస్థ జేఎండీ సి.శ్రీనివాస రావు, తెలంగాణ జెన్‌కో సీఎండీగా సింగరేణి సంస్థ సీఎండీ ఎన్‌.శ్రీధర్‌కు అదనపు బాధ్యతలను కొనసాగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తదుపరి ఆదేశాలు జారీ చేసే వరకు వీరు అదనపు బాధ్యతల్లో కొనసాగుతారని స్పష్టం చేసింది. ఈ మేరకు రాష్ట్ర ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సునీల్‌ శర్మ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. సీఎండీగా ప్రభాకర్‌రావు కొనసాగింపుపై అస్పష్టత...: ట్రాన్స్‌కో, జెన్‌కో సంస్థలకు 2014 అక్టోబర్‌ నుంచి డి.ప్రభాకర్‌రావు ఉమ్మడి సీఎండీగా వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వ అనుమతితో గత ఆగస్టు 19 నుంచి 31 వరకు సెలవుపై వెళ్లారు. అనంతరం సెప్టెంబర్‌ 22 వరకు ప్రభాకర్‌రావు సెలవు పొడిగించుకున్నారు.

అక్టోబర్‌ 1న విధుల్లో చేరి... ఆరు వరకు కొనసాగారు. ఆ తర్వాత నుంచి మళ్లీ ఆయన విధులకు హాజరు కాలేదు. సెలవు మంజూరు కోసం దరఖాస్తు కూడా చేసుకోలేదు. దీంతో ట్రాన్స్‌కో, జెన్‌కో సంస్థలకు సీఎండీలుగా జె.శ్రీనివాసరావు, ఎన్‌.శ్రీధర్‌లను అదనపు బాధ్యతల్లో కొనసాగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని రాష్ట్ర ఇంధన శాఖ వర్గాలు తెలిపాయి.

ఈ ఉత్తర్వుల్లో ప్రభాకర్‌రావు సెలవుల పొడిగింపు అంశం ప్రస్తావించకపోవడంతో ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీ పదవుల్లో ఆయన కొనసాగుతారా? లేదా? అన్నది విద్యుత్‌ సౌధలో చర్చనీయాంశంగా మారింది. ప్రభాకర్‌రావు సీఎండీ పదవికి రాజీనామా చేసి ఉండవచ్చని చర్చ జరుగుతుండగా, ఈ విషయాన్ని ముఖ్యమంత్రి కార్యాలయం వర్గాలు తోసిపుచ్చాయి. ఆయన కొనసాగుతారా? లేదా ? అన్న అంశంపై సీఎంఓ వర్గాలు కూడా ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. 

మరిన్ని వార్తలు