రెచ్చిపోతున్న హిజ్రాలు.. పెళ్లిలో డబ్బులు ఇవ్వలేదని అసభ్యకర ప్రదర్శనలు.. ఇదేంటని ప్రశ్నించారో ఆగమాగం 

15 Mar, 2023 11:50 IST|Sakshi

రెండు రోజుల కిందట కరీంనగర్‌ జిల్లా కేంద్రంలోని ఓ ఫంక్షన్‌ హాల్‌లో నగరానికి చెందిన ఓ పెద్ద వ్యాపారి కొడుకు వివాహం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న కొందరు హిజ్రాలు అక్కడికి చేరుకున్నారు. ఫంక్షన్‌హాల్‌ లోపలికి వెళ్లి వేదికపైకి వచ్చారు. ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించారు. డబ్బులివ్వాలంటూ అసభ్య పదజాలం వాడారు. దీంతో పెళ్లి కుమారుడి తండ్రి రూ.5 వేలు ఇచ్చాడు. ‘మాకు అవి సరిపోవు. రూ.50 వేలు కావాలి. అవి ఇస్తేనే ఇక్కడ నుంచి వెళ్లి పోతాం’ అని వీరంగం స్పష్టించారు.

ఎంత చెప్పినా వినకుండా పెళ్లి మండపంపైనే కూర్చున్నారు. చేసేది ఏమీ లేక వధువు వరుడు తరఫున రూ.50 వేలు ఇచ్చి అక్కడి నుంచి పంపించారు. ఇలా ఒక్క కరీంనగర్‌లోనే కాదు.. ఉమ్మడి జిల్లాలోని అన్ని ఫంక్షన్‌ హాళ్లలో హిజ్రాలు ఇలానే హల్‌చల్‌ చేస్తున్నారు. ఒక్కో పెళ్లికి రూ.5 వేల నుంచి రూ.50 వేల వరకు వసూలు చేస్తున్నారు.

తాజాగా కరీంనగర్‌ సమీప మండలంలోని ఓ గ్రామంలో సర్పంచ్‌ బంధువు వివాహం జరిగింది. రాత్రి బరాత్‌ జరుగుతున్న సమయంలో కొందరు హిజ్రాలు వచ్చి వీరంగం సృష్టించారు. పెళ్లి కుమారుడిని డబ్బులు డిమాండ్‌ చేశారు. అతను నిరాకరించడంతో రెచ్చిపోయి నగ్నంగా డ్యాన్స్‌ చేశారు. దీంతో అక్కడున్న వారు పారిపోయారు. దీంతో వధూవరుల తల్లిదండ్రులు తమ బంధువులు, స్నేహితుల ముందు హేళన కావొద్దని అడిగినంత ముట్టజెప్పారు.

తిమ్మాపూర్‌(మానకొండూర్‌): పెళ్లంటే జీవితంలో ఒక్కసారి వచ్చే వేడుక. దీన్ని పేదవారు సైతం తమకు ఉన్నంతలో గొప్పగా జరుపుకోవాలని అనుకుంటారు. కానీ.. ఈ మధ్య హిజ్రాల కారణంగా భయపడే పరిస్థితులు నెలకొన్నాయి. మామూళ్లు ఇవ్వకుంటే అసభ్యకరంగా ప్రవర్తిస్తూ శుభకార్యాల్లో అలజడి సృష్టిస్తున్నారు. సామాన్య కుటుంబాలకు చెందినవారు డబ్బు ఇచ్చేందుకు నిరాకరిస్తే అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారు. ఫలితంగా శుభకార్యానికి వచ్చిన బంధువులు, కుటుంబ సభ్యులు, స్నేహితులు భయపడుతున్నారు. ఎవరైనా హిజ్రాలకు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తే వారితో ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తున్నారు. దీంతో అందరూ జంకుతున్నారు.

దౌర్జన్యాలకు పాల్పడితే కఠిన చర్యలు
కొంతమంది ట్రాన్స్‌జెండర్లు ఎక్కడ శుభకార్యం జరిగినా వారి ఇంటి ముందు వాలిపోయి ఇంటి యజమానికి చుక్కలు చూపిస్తూ, దౌర్జన్యంగా వేలకు వేలు డబ్బులు గుంజుతున్న సంఘటనలు దృష్టికి వస్తున్నాయి. ఎవరైనా చనిపోయిన సందర్భంలో కుటుంబ సభ్యులు పుట్టెడు దుఃఖంలో ఉండగా శ్మశాన వాటిక వద్దకు కూడా చేరిపోయి.. వదిలిపెట్టడం లేదు. వేలకు వేలు డబ్బులు గుంజుతున్నట్టుగా ఫిర్యాదులు వస్తున్నాయి. ఇప్పటికైనా వారు తమ వైఖరి మార్చుకోవాలి. లేని ఎడల వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం.

ఎవరైనా ఇటువంటి వేధింపులకు గురైతే బాధితులు వెంటనే డయల్‌ 100 టోల్‌ ఫ్రీ నెంబర్‌కు కాల్‌ చేసి వివరాలు తెలియజేయాలి. ఐదు నిమిషాల్లో దగ్గరలో ఉన్న బ్లూ కోల్ట్స్‌ సిబ్బంది, పెట్రో కార్‌ సిబ్బంది చేరుకునేలా చర్యలు తీసుకుంటాం. జీవనోపాధి కోసం గౌరవంగా ఉండే ఏదైనా వృత్తిని.. లేక చిన్నచిన్న పనులు చేసుకొని జీవించాలి . ఇటీవల వారికి బ్యాంక్‌ రుణాలు కూడా మంజూరయాయి. వాహనాలు నడుపుకునేందుకు డ్రైవింగ్‌ లైసెన్స్‌లు కూడా ఇచ్చారు.
– ఎల్‌.సుబ్బారాయుడు, పోలీస్‌ కమిషనర్‌ 

మరిన్ని వార్తలు