TSRTC: ఆర్టీసీ ఉద్యోగులకు మంచి రోజులు.. మళ్లీ రుణాలు

8 Oct, 2021 03:58 IST|Sakshi

సీసీఎస్‌కు రూ.100 కోట్లు విడుదల చేసిన రవాణా సంస్థ 

చాలాకాలం తర్వాత కళకళలాడుతున్న సహకార పరపతి సంఘం

సాక్షి, హైదరాబాద్‌: ఒకప్పుడు ఆసియాలోనే గొప్ప సహకార పరపతి సంఘాల్లో ఒకటిగా గుర్తింపు పొంది, ఆ తర్వాత ఆర్టీసీ నిర్వాకంతో దివాలా తీసిన ఆ సంస్థ సహకార పరపతి సంఘం (సీసీఎస్‌) మళ్లీ ప్రాణం పోసుకుంటోంది. చాలాకాలం తర్వాత మళ్లీ దాని ద్వారా ఉద్యోగులకు రుణాల పంపిణీ మొదలైంది. ఎన్నో ఏళ్లుగా నిధులు వాడేసుకోవటమే కాని, తిరిగి చెల్లించని ఆర్టీసీ.. కొత్త ఎండీ సజ్జనార్‌ చొరవతో బకాయిల చెల్లింపు ప్రారంభించింది.

తాజాగా రూ.100 కోట్లను సహకార పరపతి సంఘానికి విడుదల చేసింది. దీంతో దాదాపు 2 వేల మంది ఆర్టీసీ ఉద్యోగులకు రుణాలు, విశ్రాంత ఉద్యోగుల డిపాజిట్లపై వడ్డీ బకాయిల చెల్లింపునకు మార్గం సుగమమైంది. 2019 జూన్‌ నుంచి పెండింగులో ఉన్న లోన్‌ దరఖాస్తులను క్లియర్‌ చేసే పని మొదలైంది. తాజా నిధులతో ఆరునెలల కాలానికి సంబంధించిన పెండింగు దరఖాస్తులకు రుణాల చెల్లింపు జరగనుంది. అంటే 2020 జనవరి వరకు ఉన్న వాటికి రుణాలు అందుతున్నాయి.  

ఇంకా రూ.950 కోట్ల బకాయిలు 
సీసీఎస్‌కు ఆర్టీసీ రూ.1,050 (సెప్టెంబరు నెలతో) కోట్ల బకాయి ఉంది. ఇందులో తాజాగా రూ.100 కోట్లు చెల్లించటంతో మరో రూ.950 కోట్లు చెల్లించాల్సి ఉంటుంది. వాస్తవానికి సీసీఎస్‌కు రూ.500 కోట్లను ప్రభుత్వ పూచీకత్తు రుణం తెచ్చి చెల్లించేందుకు ఇప్పటికే ఆర్టీసీ నిర్ణయించింది. దీనికి సంబంధించి నేషనల్‌ కో–ఆపరేటివ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌తో అధికారులు చర్చించారు. కానీ ఇది ప్రభుత్వ పూచీ కత్తు రుణం అయినందున ముఖ్యమంత్రి నుంచి అనుమతి పొందాల్సి ఉంది.

దానికి సంబంధించిన ఫైలు సీఎం కార్యాలయంలో ఉంది. అక్కడి నుంచి రావటంలో జాప్యం జరుగుతుండటంతో పరిస్థితి తీవ్రత దృష్ట్యా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాల్సి వచ్చింది. దీంతో ఇటీవలే బ్యాంకు నుంచి తీసుకున్న రుణం నుంచి రూ.100 కోట్లు విడుదలయ్యేలా ఎండీ సజ్జనార్‌ చర్యలు తీసుకున్నారు.  

మళ్లీ సీసీఎస్‌వైపు ఉద్యోగుల చూపు 
సీసీఎస్‌లో సభ్యత్వం కలిగిన ఉద్యోగుల జీతం నుంచి ప్రతినెలా 7 శాతం చొప్పున కోత పెట్టి దాన్ని సొసైటీకి ఆర్టీసీ బదలాయించాల్సి ఉంటుంది. ఆ మొత్తం నుంచి ఉద్యోగుల సొంత అవసరాలకు రుణాలు సీసీఎస్‌ అందజేస్తుంది. అయితే కొన్నేళ్లుగా ఆ నిధులను ఆర్టీసీ వాడేసుకుని, ప్రతినెలా డిపాజిట్‌ చేయాల్సిన మొత్తాన్ని ఎగవేస్తోంది. దీంతో సీసీఎస్‌ దివాలా తీసింది. దీంతో చాలామంది ఉద్యోగులు సభ్యత్వాన్ని రద్దు చేసుకునేందుకు పోటీ పడ్డారు.

అలా 12 వేల మంది దరఖాస్తు చేసుకోవడంతో వారందరికీ సెటిల్‌మెంట్లు చేయాల్సి ఉంది. అయితే ఇప్పుడు మళ్లీ సీసీఎస్‌ నుంచి రుణాల పంపిణీ మొదలు కావటంతో కొత్తగా సభ్యత్వ రద్దుకు దరఖాస్తు చేసుకునేవారు తగ్గిపోయారు. ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న వారిలో చాలామంది తిరిగి సభ్యత్వాన్ని పునరుద్ధరించుకునేందుకు సిద్ధమవుతున్నారు.    

మరిన్ని వార్తలు