రవాణాశాఖ వింత వ్యవహారం .. కామ్‌గా కట్టించేస్తున్నారు!

12 May, 2022 05:25 IST|Sakshi
ఇది ఫీజులు పెంచకముందు ఓ లారీకి చెల్లించిన మొత్తం రూ.400.

పన్నులు పెంచి గుట్టుచప్పుడు కాకుండా అమలు.. చార్జీలు చూసి బిత్తరపోతున్న జనం.. ఫిట్‌నెస్‌

పెనాల్టీల పేరుతో వేలకు వేలు మోత 

ఏప్రిల్‌ నుంచి అమల్లోకి వచ్చినా.. ఏళ్ల ముందు నుంచే వాత 

సాక్షి, హైదరాబాద్‌: బస్సు చార్జీలు పెంచినప్పుడు ఆర్టీసీ అధికారులు బహిరంగంగానే వెల్లడించారు.. కరెంటు చార్జీలు పెరిగితే అధికారులు ముందే చెప్పారు.. కానీ వాహనాలకు సంబంధించి జీవిత కాల పన్ను, హరిత పన్నులు పెంచిన రవాణా శాఖ ఒక్కమాట కూడా బహిరంగంగా చెప్పలేదు. ఏయే చార్జీలు ఏ మేరకు, ఎప్పటి నుంచి పెరుగుతున్నాయన్నది అధికారులెవరూ చెప్పలేదు. కానీ పన్ను చెల్లించే సమయంలో భారీ చార్జీలు చూసి జనం నోరెళ్లబెట్టాల్సి వస్తోంది. రూ.12 లక్షల విలువైన వాహ నాన్ని కొంటే.. వారం కిందటి వరకు రూ.1,68,000 (14 శాతం) జీవితకాల పన్ను (లైఫ్‌ ట్యాక్స్‌) చెల్లించాల్సి వచ్చేది. ఇప్పుడది రూ.2,04,000కు (17శాతానికి) పెరిగింది. ఇంత ప్రభావం చూపే మార్పు జరిగితే ఎక్కడా రవాణా శాఖ నుంచి జనానికి తెలియజేసే అధికారిక ప్రకటన వెలువడలేదు. గత ఆర్థిక సంవత్సరం జీవితకాల పన్ను రూపంలో రూ.2,900 కోట్ల ఆదాయాన్ని పొందింది. తాజా ఉత్తర్వులతో అదనంగా మరో రూ.1,400 కోట్లమేర ఆదాయం లభిస్తుందని అధికారవర్గాలు అంచనా వేస్తున్నాయి. 

ఫిట్‌నెస్‌ పంచాయితీ.. 
రవాణా వాహనాలు ఏడాదికోసారి తప్పనిసరిగా ఫిట్‌నెస్‌ పరీక్ష చేయించి సర్టిఫికెట్‌ పొందాలి. ఇలా ఫిట్‌నెస్‌ పరీక్షలు చేయించకుండా తిరిగే ట్రాన్స్‌పోర్టు వాహనాలకు రోజుకు రూ.50 చొప్పున పెనాల్టీ విధించాలి. కేంద్రం ఈ సంవత్సరం ఏప్రిల్‌ ఒకటి నుంచి దీన్ని అమల్లోకి తెచ్చింది. రాష్ట్ర రవాణా శాఖ మాత్రం ఎన్ని సంవత్సరాల నుంచి ఫిట్‌నెస్‌ చేయించటం ఆపేశారో.. అప్పటి నుంచీ లెక్కగట్టి పెనాల్టీలు వసూలు చేస్తోంది. 

► హైదరాబాద్‌కు చెందిన అష్రాఫ్‌ అనే ఆటోడ్రైవర్‌ ఏడేళ్లుగా ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్‌ లేకుండా ఆటో నడుపుతున్నాడు. కొత్త నిర్ణయం రావటంతో పెనాల్టీలు కట్టే బాధ ఉండొద్దని ఫిట్‌నెస్‌ పరీక్ష కోసం వెళ్లాడు. ఏడేళ్ల నుంచి రోజుకు రూ.50 చొప్పున పెనాల్టీ కలిపి మొత్తంగా రూ.1.13 లక్షలు కట్టాలని అధికారులు చెప్పారు. దీనితో బెంబేలెత్తిన అష్రాఫ్‌ ఆటోను తీసుకెళ్లి ఇంట్లో పెట్టేశాడు. ఆటో నడిపితేనే రోజు గడిచే ఆయన.. ఇప్పుడు దానిని బయటికి తీయట్లేదు. ఇలా 75వేల ఆటోలు పాత బకాయిల పేరిట భారీ పెనాల్టీ చెల్లించాల్సిన పరిస్థితి ఉందని.. దీనితో దాదాపు 40వేల మంది డ్రైవర్లు ఆటోలను బయటికి తీయడం మానేశారని యూనియన్‌ నేతలు చెప్తున్నారు. ఇదే తరహాలో దాదాపు 4 వేల టాటా ఏస్‌ మినీ ట్రక్‌లు, మరో 2 వేల వరకు డీసీఎం వాహనాలు, చిన్న లారీలు ఇలాగే మూలకు చేరాయని అంటున్నారు. ఆటో అమ్ముకోలేక, కొత్తది కొనలేక ఇబ్బందిపడుతున్నారు. 

ఫీజులు పెంచిన తర్వాత నాలుగు రోజుల క్రితం ఓ లారీకి వచ్చిన పన్ను మొత్తం రూ.13,920  

కాలుష్యం పేరిట... వాహనాలు పాతబడే కొద్దీ కాలుష్యం
పెరుగుతుందన్న ఉద్దేశంతో వాటి వాడకాన్ని తగ్గించడానికి హరితపన్ను (గ్రీన్‌ ట్యాక్స్‌) విధిస్తున్నారు. రవాణాశాఖ ఇటీవలే హరితపన్నును పెంచింది. దీనినీ మూడు శ్లాబులు చేసింది. ఈ విషయాన్నీ బయటికి వెల్లడించలేదు. ఏ శ్లాబుకు ఎంత పన్ను చెల్లించాలో వాహన యజమానులకు తెలియదు. రవాణాశాఖ కార్యాలయంలో వివరాలన్నీ నమోదుచేశాక వచ్చే పన్నుమొత్తం చూసి బెంబేలెత్తుతున్న పరిస్థితి ఉంది. 
► పాత రేట్ల ప్రకారం ఓ లారీకి గ్రీన్‌టాక్స్‌ రూ.238 మాత్రమే ఉండేది. అదనంగా ప్రభుత్వ ఫీజు చెల్లించాల్సి వచ్చేది. 
► గతంలో ద్విచక్ర వాహనానికి గ్రీన్‌ట్యాక్స్‌ రూ.285, ప్రభుత్వ ఫీజు రూ.735 ఉండగా.. ఫీజులు పెంచాక గ్రీన్‌ట్యాక్స్‌ రూ.2,035, ప్రభుత్వ ఫీజు రూ.1,400గా మారింది. 
► కార్లకు సంబంధించి గ్రీన్‌ట్యాక్స్‌ రూ.535, ప్రభుత్వ ఫీజు రూ.1,200 ఉండేది. ఇప్పుడు ట్యాక్స్‌ రూ.5035, ఫీజు రూ.1,500 అయింది. 

ఆదాయం కోసం దొడ్డిదారిన పన్ను పెంచారు 
గ్రీన్‌ట్యాక్స్‌ పెంచినంత మాత్రాన వాతావరణంలో కాలుష్యం తగ్గుతుందా..? ఇదేం విడ్డూరం. కాలుష్యం వెదజల్లుతున్న వాహనాలను సీజ్‌ చేయండి, లేదా మరమ్మతు చేయించుకునేలా చేయండి. అలాకాకుండా పన్ను చెల్లించి పొగవదిలితే ఉపయోగం ఉంటుందా? కేవలం ఆదాయం పెంచుకునేందుకు ఇలా దొడ్డిదారిన గ్రీన్‌ట్యాక్స్‌ పెంచారు. 
– మంచిరెడ్డి రాజేందర్‌రెడ్డి, తెలంగాణ లారీ యజమానుల సంఘం అధ్యక్షుడు 

40వేలకుపైగా రవాణా వాహనాలు నిలిచిపోయాయి 
ఏళ్లపాటు ఫిట్‌నెస్‌ పెనాల్టీ లెక్కగట్టి బెదిరిపోయేలా చేశారు. దాదాపు 40 వేలకుపైగా రవాణా వాహనాలు రోడ్డెక్కకుండా చేసిన ఈ పెనాల్టీ విధానాన్ని ఉపసంహరించుకోవాలి. ఆరు నెలల గడువిస్తే అన్ని వాహనాలకు ఫిట్‌నెస్‌ చేయించేసుకుంటారు. అలాగాకుండా ఆదాయం కోసం దీన్ని ఆయుధంగా వాడటం సరికాదు 
– ఎ.సత్తిరెడ్డి, తెలంగాణ ఆటో డ్రైవర్ల సమాఖ్య ప్రధాన కార్యదర్శి   

మరిన్ని వార్తలు