ట్రయల్‌ రన్‌ సక్సెస్‌ !

23 Jul, 2021 02:22 IST|Sakshi
ట్రయల్‌ రన్‌లో భాగంగా నడిపిస్తున్న గూడ్స్‌ రైలు

భద్రాచలం రోడ్‌ టు సత్తుపల్లి మార్గంలో పయనించిన గూడ్స్‌

సుజాతనగర్‌: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని భద్రాచలం రోడ్డు (కొత్తగూడెం) నుంచి ఏపీలోని కొవ్వూరు వరకు రైలు మార్గం నిర్మాణం వేగంగా సాగుతోంది. తొలి దశలో కొత్తగూడెం నుంచి సత్తుపల్లి వరకు 55.2 కిలోమీటర్ల మేర రైల్వే లైన్‌ నిర్మాణానికి సింగరేణి, రైల్వే శాఖల ద్వారా రూ.875 కోట్లు కేటాయించారు. ఈ మేరకు లైన్‌ పనులు పూర్తికాగా, కొత్తగూడెం నుంచి సుజాతనగర్‌ మండలంలోని లక్ష్మీదేవిపల్లి వరకు పూర్తిస్థాయిలో లైన్‌ సిద్ధమైంది. దీంతో రైల్వే అధికారులు గురువారం ట్రయల్‌ రన్‌ నిర్వహించారు. భద్రాచలం రోడ్డు నుంచి లక్ష్మీదేవిపల్లి వరకు గూడ్స్‌ బోగీలు, ఇంజన్‌ నడిపించగా ప్రజలు ఆసక్తిగా చూశారు.

కాగా, కొవ్వూరు రైల్వే లైన్‌ సాధన కమిటీ ఆధ్వర్యాన 1980 నుంచి రైల్వే లైన్‌ కోసం అనేక పోరాటాలు చేపట్టగా, ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. భద్రాచలం రోడ్‌ నుంచి కొవ్వూరు వరకు 150 కిలోమీటర్ల మేర లైన్‌ నిర్మించాల్సి ఉండగా... ప్రస్తుతం సత్తుపల్లి వరకు అంటే 55.2 కిలోమీటర్ల మేర పనులు పూర్తయ్యాయి. ఇందులో సుజాతనగర్‌ మండలంలోని లక్ష్మీదేవిపల్లి గ్రామం వరకు రైలు పట్టాలు కూడా సిద్ధం కావడంతో ట్రయల్‌ రన్‌ చేపట్టారు. కాగా, ఈ ప్రాంతంలో వెలికితీసే బొగ్గును ప్రస్తుతం లారీల ద్వారా తరలిస్తున్నారు. రైల్వేమార్గం అందుబాటులోకి వస్తే బొగ్గు రవాణా సులభతరం అవుతుంది. అలాగే, తెలంగాణ నుంచి ఏపీకి ఈ మార్గంలో వెళ్లే 150 కిలోమీటర్ల మేర దూరం తగ్గనుంది.

మరిన్ని వార్తలు