పులి ‘గిరి’ గీసిన పల్లెలు

20 Nov, 2022 03:11 IST|Sakshi
మిరపతోటలో ముగ్గురు కలసి గుంపుగా ఉన్న మహిళలు

పెద్దపులుల సంచారంతో జనం బెంబేలు 

రైతుపై దాడి చేసి చంపడంతో మళ్లీ భయాందోళనలు 

కుమురంభీం జిల్లాలో రెండేళ్లలో ముగ్గురు బలి 

పత్తి పంట చేతికొచ్చే వేళ రైతులు, కూలీల్లో జంకు  

వలస పులుల రాకను పసిగట్టలేకపోతున్న అధికారులు  

సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: పెద్దపులి అడుగులు కంటపడటంతో ఇంటి నుంచి అడుగు బయటపెట్టాలంటే గిరిజనులు జంకుతున్నారు. వారిని పులి సంచారం వణికిస్తోంది. ఈ నెల 17న కుమురంభీం జిల్లా వాంకిడి మండలం ఖానాపూర్‌కు చెందిన రైతు తన చేనులో పత్తి తీస్తుండగా పులి దాడి చేసి చంపిన విషయం తెలిసిందే. అది చిరుతపులి అయి ఉంటుందని మొదటగా భావించినా, పాదముద్రలు, దాడి చేసిన తీరును బట్టి పులిగా నిర్ధారణ అయింది.

చేలల్లో పత్తి తీసే సీజన్‌లో పులుల సంచారం కారణంగా కూలీలు పనులకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. దీంతో పత్తి ఏరే పనులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. కుమురంభీం జిల్లాలో వాంకిడి, ఆసిఫాబాద్, కాగజ్‌నగర్‌ డివిజన్‌లో ఈ పరిస్థితి నెలకొంది. ఆధిపత్యపోరు, ఆవాసం, తోడు వెతుక్కునే క్రమంలోనే పులుల సంచారం ఎక్కువైందని అధికారులు భావిస్తున్నారు.

తాజాగా దాడి చేసిన పులి సైతం మహారాష్ట్రలోని చంద్రాపూర్‌ నుంచి వచ్చిందేనని అంటున్నారు. మూడు రోజుల వ్యవధిలోనే పులి ఆసిఫాబాద్, కాగజ్‌నగర్‌ డివిజన్లలో వాంకిడి, ఆసిఫాబాద్, కాగజ్‌నగర్, సిర్పూర్‌ టీ, కాగజ్‌నగర్‌ మండలాల్లోని 13 గ్రామాల పరిధిలో 37 కిలోమీటర్ల మేర ప్రయాణించినట్లుగా ఆనవాళ్లు లభించాయి. రోజుకు సగటున పది కిలోమీటర్లకుపైగా సంచరించింది. రెండేళ్ల క్రితం ఏ2 అనే వలస పులి ఇలాగే తిరుగుతూ ఇద్దరిని చంపేసిన విషయం తెలిసిందే. 

లోపమెక్కడ? 
అటవీ అధికారుల అప్రమత్తత కొరవడటంతో రెండేళ్లలో కుమురంభీం జిల్లాలో ముగ్గురు పులి బారిన పడి ప్రాణాలు పోగొట్టుకున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 17న ఓ లేగ దూడపై, మధ్యాహ్నం ఓ మనిషిపై పులి దాడి చేసింది. ఈ క్రమంలో వెంటనే అప్రమత్తం కావాల్సిన అధికారులు జాప్యం చేశారు. నిత్యం అడవుల్లో సంచరిస్తూ, ట్రాకర్స్, కెమెరాలతో పులులను ట్రాప్‌ చేస్తున్నామని అధికారులు చెబుతున్నప్పటికీ వాస్తవ పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది.

మహారాష్ట్రతో తెలంగాణ సరిహద్దు ఆదిలాబాద్, కుమురంభీం, మంచిర్యాల వరకు యావత్మాల్, చంద్రాపూర్‌ జిల్లాల్లో తిప్పేశ్వర్, తడోబా, చంద్రాపూర్‌ అడవులు దాదాపు 150 కి.మీ.పైగా విస్తరించాయి. పెన్‌గంగా నుంచి ప్రాణహిత తీరం వరకు టైగర్‌ కారిడార్‌గా ఉంది. ఈ కొత్త పులులను ట్రాక్‌ చేసి, రిజర్వు ఫారెస్టులోకి పంపించడం అధికారుల ప్రధాన బాధ్యత. గోప్యత పేరుతో పులుల సంచారంపై వాస్తవ పరిస్థితిని ప్రజలకు తెలియనివ్వడం లేదనే వాదనలు ఉన్నాయి.  

పులి దాడుల్లో మరణాలు
2020 నవంబర్‌ 11న దహెగాం మండలం దిగిడకు చెందిన విఘ్నేశ్‌(19)పై దాడి చేసి చంపేసింది. 
2020 నవంబర్‌ 19న పెంచికల్‌పేట మండలం కొండపల్లికి చెందిన పసుల నిర్మల(16)పై దాడి చేసి చంపింది.  
ఈ నెల 17న వాంకిడి మండలం చౌపన్‌గూడ పరిధి ఖానాపూర్‌కు చెందిన సిడాం భీము(69)పై దాడి చేసి చంపింది. 

పులి ఉందంటే నమ్మలేదు.. 
ఈ ప్రాంతంలో పులి సంచారం ఉందని మేం చెబితే అటవీ అధికారులు నమ్మలేదు. తీరా ఇప్పుడు ఓ ప్రాణం పోయింది. అయినా ఇక్కడ పులి లేదనే అంటున్నారు. పులి భవిష్యత్తులో మనుషులపై దాడులు చేయకుండా చేయాలి. బాధిత కుటుంబానికి పరిహారం, ఉద్యోగం కల్పించాలి. 
–సిడాం అన్నిగా సర్పంచ్, చౌపన్‌గూడ, వాంకిడి మండలం, కుమురంభీం జిల్లా

అప్రమత్తం చేస్తున్నాం 
కొత్త పులుల రాకపై అంచనా వేస్తూ స్థానిక ప్రజలను అప్రమత్తం చేస్తున్నాం. ఇటీవల వచ్చిన పులి దాడి జరిగే వరకు స్థానికుల నుంచి సమాచారం అందలేదు. ప్రస్తుతం ఆ పులి రిజర్వు ఫారెస్టులోకి వెళ్లిపోయింది. ఇక భయం అవసరం లేదు. 12 టీంలతో 50 మంది వరకు సిబ్బంది పులిని పర్యవేక్షిస్తున్నారు. స్థానికులకు జాగ్రత్తలపై మరింత అవగాహన కల్పిస్తాం. 
–దినేశ్‌కుమార్, జిల్లా అటవీ అధికారి, కుమురంభీం  

పులిని చూసి భయపడ్డాను 
దాడి చేసిన రోజు పులి పశువుల మందపైకి వచ్చింది. మాకు దగ్గరగానే ఉండటంతో భయపడ్డాను. నాకు ఇప్పటికీ భయం పోలేదు. అడవుల్లోకి వెళ్లాలంటే వణుకుపుడుతోంది. 
–ఆత్రం అన్నిగా, చౌపన్‌గూడ 

>
మరిన్ని వార్తలు