పేద కళాకారున్ని సర్కార్‌ ఆదుకోవాలి: గుస్సాడీ రాజు

26 Jan, 2021 12:07 IST|Sakshi

సాక్షి,  కొమురం భీమ్(ఆసిఫాబాద్): గుస్సాడీ కళలో పద్మశ్రీ అవార్డు రావడం ఎంతో గౌరవంగా భావిస్తున్నానని కుమురంభీం జిల్లా మర్లవాయి గ్రామానికి చెందిన 60 ఏళ్ల కనక రాజు ఆనందం వ్యక్తం చేశారు.  కేంద్ర ప్రభుత్వం సోమవారం ప్రకటించిన పద్మ పురస్కారాల జాబితాలో రాష్ట్రం నుంచి ఒక్కరికే పద్మశ్రీ వరించింది. ఆదివాసీల సంప్రదాయ గుస్సాడీ నృత్యంలో ప్రావీణ్యం పొందిన రాజును వరించడం విశేషం. ఆయన్ని స్థానికులు గుస్సాడీ రాజుగా పిలుస్తారు. చదవండి: మన గుస్సాడీ రాజుకు పద్మశ్రీ 

పద్మశ్రీ అవార్డు వరించిన కనక రాజు మంగళవారం మీడియాతో మాట్లాడుతూ..‘ పద్మశ్రీ అవార్డు లభించడం సంతోషంగా ఉంది. గుస్సాడీ కళలో తనకు పద్మశ్రీ అవార్డు రావడం ఎంతో గౌరవంగా భావిస్తున్నా. ఈ అవార్డు వస్తుందని ఎప్పుడు అనుకోలేదు. ఇది అదివాసీలకు లభించిన గౌరవంగా భావిస్తున్నా. గుస్సాడీ కళను వందల మందికి నేర్పించాను. ప్రముఖులు మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ, దివంగత రాష్ట్రపతి అబ్దుల్ కలాం ముందు ఢిల్లీలో ప్రదర్శనలు ఇచ్చాను. పేద కళాకారున్ని సర్కార్‌ అదుకోవాలి. సర్కార్ భూమి, అర్థిక సహాయం అందించాలని కోరుతున్నాను’ అని ఆయన తెలిపారు. గత 40 ఏళ్లుగా గుస్సాడీ నృత్య ప్రదర్శనలు ఇస్తున్న రాజు.. ఎంతోమంది యువతకు ఇప్పటికీ ఆ నృత్యాన్ని నేర్పిస్తున్న సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు