ప్రమాదకరంగా కిన్నెరసాని వాగు: కట్టెల సాయంతో..

13 Jul, 2021 17:42 IST|Sakshi

సాక్షి, ఇల్లందు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల, అళ్ళపల్లి మండలాల్లో గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకి వాగులు ఉధృతంగా ప్రవహించడంతో సుమారు 10 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఈ మండలాల్లో ఉన్న కిన్నెరసాని, మల్లన్న, కోడిపుంజుల వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ఆళ్లపల్లి మండలంలో మోదుగుల గూడెం, సజ్జల బోడు గ్రామాల మధ్య కిన్నెరసాని వాగుపై హైలెవెల్ బ్రిడ్జి నిర్మాణ పనులు పూర్తి కాకపోవడంతో ఆదివాసీలు కర్రల సహాయంతో వంతెన తయారు చేసుకుని రాకపోకలు సాగిస్తున్నారు. 

సోమవారం పొద్దుటే వ్యవసాయ పనులకు వెళ్లిన గిరిజనులు సాయంత్రం తిరిగి వచ్చే వేళకు కిన్నెరసాని నది పొంగింది. దాన్ని దాటితేనే ఇంటికి చేరుతారు. దీంతో చేసేదేం లేక కట్టెల సాయంతో నిచ్చెన మాదిరి ఏర్పాటు చేసుకుని వాగు ప్రవాహాన్ని అతికష్టం మీద దాటారు. చాలా ప్రమాదకరంగా ఇబ్బందులు పడుతూ వాగు దాటిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

అయితే గుండాల మండల కేంద్రంలో కూలి పనులు, వ్యవసాయ పనిముట్లు, విత్తనాల కొనుగోలుకు రైతులు కూలీలు నిత్యం గుండాల మండలానికి రాకపోకలు సాగిస్తుంటారు. వాగు దాటడం ప్రమాదమని తెలిసినా సాహసం చేయక తప్పట్లేదు అంటున్నారు. గతంలో వాగు దాటే క్రమంలో వరద ఉధృతికి కొట్టుకొని పోయి ఇద్దరు మృతిచెందిన సంఘటనలు ఉన్నాయని ఏళ్లు గడిచినా బ్రిడ్జి పనులు పనులు పూర్తిచేయడం లేదన్నారు. దీంతో ఏజెన్సీలో ఉన్న ఆదివాసీలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, వర్షాకాలం వచ్చిందంటే ప్రాణాలు అరచేతిలో పట్టుకొని వాగు దాటే పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా స్పందించి  బ్రిడ్జి పనులను పూర్తి చేసి ఏజెన్సీ వాసుల కష్టాలను తీర్చాలని ఆదివాసీలు వేడుకుంటున్నారు.

మరిన్ని వార్తలు