సమావేశమా.. అయితే సందర్శకులు బంద్‌! 

31 Jul, 2022 01:20 IST|Sakshi

సంక్షేమ భవన్‌లో సామాన్యులపై గిరిజన సంక్షేమ శాఖ ఆంక్షలు 

సాక్షి, హైదరాబాద్‌: ఉపకారవేతనాలు, ఫీజు రీయింబర్స్‌మెంట్, స్వయం ఉపాధికి రాయితీ రుణాలు, కల్యాణలక్ష్మి, దళితబంధు లాంటి ప్రతిష్టాత్మక పథకాలను అమలు చేస్తున్న వివిధ సంక్షేమ శాఖల కార్యాలయాలకు నిత్యం సందర్శకుల తాకిడి ఉంటుంది. పేదలకు నేరుగా లబ్ధి చేకూరే ఈ పథకాలు అమలు చేస్తున్న ప్రధాన కార్యాలయాలున్నది మాసాబ్‌ట్యాంక్‌లోని దామోదరం సంజీవయ్య సంక్షేమ భవన్‌లో.

వందల మంది లబ్ధిదారులు ఇక్కడ సంబంధిత శాఖల ఉన్నతాధికారులను నేరుగా కలసి తమ గోడు వినిపించుకుంటారు. అలాంటి వారి సమస్యలకు అప్పటికప్పుడు పరిష్కారం లభిస్తుంది. ఆ నమ్మకంతోనే ఇక్కడికి రాష్ట్రం నలు మూలలనుంచి వస్తుంటారు. కానీ ప్రస్తుతం సందర్శకులపై ఆంక్షలు విధించారు. గిరిజన సంక్షేమ శాఖ నిర్వహణలో ఉన్న ఈ భవన్‌లో సందర్శకులను అనుమతించడం లేదు.

ఈ శాఖ ఉన్నతాధికారుల సమావేశాల పేరిట ఇతర కార్యాలయాలకు వచ్చే వారిని సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకుంటున్నారు. రోజూ ఈ శాఖ అధికారులకు సంబంధించి ఏదో ఒక సమావేశం జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఆరు అంతస్తుల్లో వివిధ కార్యాలయాలున్న సంక్షేమ భవన్‌లో మొదటి అంతస్తు వద్దే సందర్శకులను నిలువరిస్తుండటంతో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారు సంబంధిత ఉన్నతాధికారులను కలవకుండా ఉసూరుమంటూ వెనుదిరుగుతున్నారు. 

గురుకుల ప్రవేశాలతో రద్దీ.. 
ప్రస్తుతం సంక్షేమ గురుకుల విద్యా సంస్థల్లో ప్రవేశాల ప్రక్రియ కొనసాగుతోంది. వాస్తవానికి సీట్ల కేటాయింపులన్నీ ఆన్‌లైన్‌ పద్ధతి ద్వారానే జరుగుతున్నా.. వివరాల్లో పొరపాట్లు, రిపోర్టింగ్‌ వివరాలు, ఇతర సమస్యలతో పెద్ద సంఖ్యలో పిల్లల తల్లిదండ్రులు ప్రతిరోజూ సంక్షేమ భవన్‌కు వస్తున్నారు. ముఖ్యంగా రెండో అంతస్తులోని బీసీ గురుకుల సొసైటీ కార్యాలయానికి విద్యార్థులు, తల్లిదండ్రుల తాకిడి అధికంగా ఉంటోంది.

ఈ క్రమంలో మొదటి అంతస్తు వరకే సందర్శకులను అనుమతించడం, పైఅంతస్తుల్లోకి పంపకపోవడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సెక్యూరిటీ సిబ్బందిని నిలదీస్తున్న కొందరిని లిఫ్ట్‌ ద్వారా అనుమతిస్తుండగా.. అధికశాతం సందర్శకులను నిలిపివేస్తుండటంతో వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన దళితబంధు పథకానికి సంబంధించిన లబ్ధిదారులకు సైతం సంక్షేమ భవన్‌లోని ఐదో అంతస్తులో ఉన్న ఎస్సీ కార్పొరేషన్‌ కార్యాలయ అధికారులను కలిసేందుకు అనుమతి దొరకడం లేదు.

కాగా, గిరిజన సంక్షేమ శాఖ అధికారుల సమావేశం మందిరం మెట్ల దారి పక్కనే ఉందని, సమీక్షలు, సమావేశాలు జరుగుతున్న సమయంలో ఎవరినీ అనుమతించవద్దని గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్, ఆ శాఖ ఉన్నతాధికారులు ఆదేశించినందునే సందర్శకులను నిలిపివేస్తున్నామని సెక్యూరిటీ సిబ్బంది చెబుతున్నారు.  

మరిన్ని వార్తలు