అయోధ్యకు ఆహ్వానం అందింది

5 Sep, 2020 11:03 IST|Sakshi
రామయ్య దర్శనానికి విచ్చేస్తున్న చినజీయర్‌స్వామి

సాక్షి, భద్రాచలం‌: ఇటీవల అయోధ్యలో జరిగిన రామమందిర నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమానికి తనను ఆహ్వానించారని, అయితే తాను చాతుర్మాస దీక్షలో ఉన్నందున వెళ్లలేకపోయానని శ్రీశ్రీశ్రీ త్రిదండి రామానుజ చిన జీయర్‌స్వామి వెల్లడించారు. శుక్రవారం ఆయన అహోబిల రామానుజ స్వామివారితో కలిసి భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి వారిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు చేశారు. మొదట గాలిగోపురానికి అభిముఖంగా ఉన్న ఆంజనేయస్వామి వారి ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేశారు. తమ తాతగారు నిర్మించిన క్రతు స్తంభం, రామకోటి స్తంభం, దాశరథి శతక స్తంభాలను దర్శనం చేసుకున్నారు. అనంతరం గాలి గోపురం వద్ద ఆలయ ఈఓ ఎల్‌.రమాదేవి జీయర్‌స్వామి వారికి పూలమాల అందించి స్వాగతం పలికారు.

అర్చకులు రామయ్య తండ్రి శేషమాలికలను ధరింపజేసి, పట్టువస్త్రంతో పరివట్టం కట్టి లోపలికి తీసుకెళ్లారు. గాలిగోపురం వద్ద ఉన్న పల్లకిలో బంగారు శఠారికి నమస్కరించిన జీయర్‌ స్వామి.. ధ్వజస్తంభం వద్ద సాష్టాంగ నమస్కారం చేశారు. తర్వాత లక్ష్మీతాయారమ్మవారిని, భద్రుడి కోవెలలో ఉన్న రామయ్య పాదాలు, సుదర్శన చక్రం, ఆళ్వార్లు, ఆండాళమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం గర్భాలయంలో ఉన్న మూలమూర్తులకు ఫల, పుష్పాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ తర్వాత జీయర్‌స్వామి మాట్లాడుతూ.. 60 రోజుల పాటు చాతుర్మాస వ్రతం పూర్తి చేసుకున్న సందర్భంగా సీతారామచంద్రస్వామి వారిని దర్శించుకునేందుకు వచ్చినట్లు తెలిపారు.

వచ్చే ఆశ్వయుజ మాసం నుంచి నెల రోజుల పాటు ప్రత్యేక రామ క్రతువు కార్యక్రమం చేపడుతున్నామని, ఇది నిర్విఘ్నంగా జరగాలని భద్రాద్రి రామయ్యను వేడుకున్నానని చెప్పారు. ఈ ఏడాది చివరి వరకూ కరోనా ఉంటుందన్నారు. ఆయన వెంట ఆలయ స్థానాచార్యులు కేఈ స్థలశాయి, మురళీకృష్ణమాచార్యులు, ప్రధానార్చకులు పొడిచేటి సీతారామానుజాచార్యులు, అమరవాది విజయరాఘవన్, జీయర్‌ మఠం నిర్వాహకులు వెంకటాచార్య, చక్రవర్తి, వికాస తరంగిణి జిల్లా అధ్యక్షురాలు రోజారమణి, ఉప ప్రధానార్చకులు అమరవాది మురళి, ఏఈఓ శ్రావణ్‌కుమార్, డీఈ రవీందర్‌రాజు, సీసీటూ ఈఓ అనీల్‌ తదితరులు ఉన్నారు.

మరిన్ని వార్తలు