కోల్‌బెల్ట్‌లో టీఆర్‌ఎస్, బీజేపీ కోల్డ్‌వార్

17 Sep, 2020 10:35 IST|Sakshi
ఇటీవల ఆర్‌ఎఫ్‌సీఎల్‌ గేట్‌ వద్ద కేంద్ర మంత్రుల ఎదుట పోటాపోటీ నినాదాలు చేస్తున్న టీఆర్‌ఎస్, బీజేపీ కార్యకర్తలు

కోల్‌బెల్ట్‌ ఏరియాలో టీఆర్‌ఎస్, బీజేపీల నడుమ కోల్డ్‌వార్‌ తారాస్థాయికి చేరుకుంది. వైరి రాజకీయ పార్టీలుగా విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకోవడం సహజమే అయినా ఇందుకు వ్యక్తిగత గ్రూప్‌లు కూడా తోడవడంతో ఓ స్థాయిలో టీఆర్‌ఎస్, బీజేపీల మధ్య వార్‌ సాగుతోంది. అవతలి పార్టీని ఇరుకునపెట్టే ఏ అవకాశాన్నీ రెండు పార్టీలు వదలడం లేదు. ఇటీవల ఆర్‌ఎఫ్‌సీఎల్‌కు కేంద్రమంత్రులు వచ్చిన సందర్భంలో జరిగిన ఘటన కూడా ఈ కోవలోనిదేనంటూ ప్రచారం సాగుతోంది.

సాక్షి, పెద్దపల్లి: టీఆర్‌ఎస్‌ ప్రజాప్రతినిధులు అడ్డుకున్న ఘటనలో పోలీసుల తీరుపై కేంద్ర హోంశాఖ సహాయమంత్రి జి.కిషన్‌రెడ్డి మండిపడగా, ఒకరిద్దరు పోలీసు అధికారులపై వేటు పడుతోందనే ప్రచారం ప్రస్తుతం ఊపందుకుంది.వైరి పక్షాల్లో చిరకాల ప్రత్యర్థులు రామగుండం నియోజకవర్గంలో ఎమ్మెల్యే కోరుకంటి చందర్, మాజీ ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ మధ్య అంతర్గత పోరు దశాబ్దాలుగా సాగుతోంది. గత ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ నుంచి సోమారపు, రెబల్‌ అభ్యర్థిగా ఫార్వర్డ్‌ బ్లాక్‌ నుంచి కోరుకంటి పోటీపడడం తెలిసిందే. ఎమ్మెల్యేగా గెలుపొందిన తర్వాత చందర్‌ నేరుగా అధిష్టానం వద్దకు వెళ్లి మళ్లీ గులాబీ గూటికి చేరారు. అప్పటి నుంచి నియోజకవర్గంలో టీఆర్‌ఎస్‌ పూర్తిగా చందర్‌ చేతిలోకి వెళ్లిపోయింది.

ఎన్నికల తర్వాత కొద్దిరోజులు టీఆర్‌ఎస్‌లోనే ఉన్న సోమారపు తన వర్గంతో బీజేపీలో చేరారు. ఇక మాజీ ఎంపీ జి.వివేక్‌కు చివరి నిమిషంలో టీఆర్‌ఎస్‌ టికెట్‌ నిరాకరించగా, ఆ తర్వాత ఆయన కాషాయ తీర్థం పుచ్చుకున్నారు. టీఆర్‌ఎస్‌లోని తన బెర్త్‌ లాక్కున్న బొర్లకుంట వెంకటేశ్, వివేక్‌ల నడుమ ఆధిపత్యపోరు సహజమే. ఇలా పార్లమెంటు, అసెంబీల్లో నియోజకవర్గాల్లో బలమైన నేతలు ప్రత్యర్థి పార్టీల్లో చేరిపోవడంతో, కోల్‌బెల్ట్‌లో రాజకీయం ఏదో ఒక అంశంపై నిత్యం రాజుకుంటూనే ఉంటోంది.

ఆర్‌ఎఫ్‌సీఎల్‌ ఘటనతో మరోసారి..
మున్సిపల్‌ కార్పొరేషన్‌.. సింగరేణి బొగ్గు గనులు.. అంశం ఏదైనా రెండు పార్టీలు ఢీ అంటే ఢీ అంటుంటాయి. ఈ క్రమంలోనే తాజాగా ఆర్‌ఎఫ్‌సీఎల్‌ ఘటనతో మరోసారి టీఆర్‌ఎస్, బీజేపీల పోరు బహిర్గతమైంది. స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వాలనే డిమాండ్‌తో టీఆర్‌ఎస్‌ ఎంపీ బొర్లకుంట వెంకటేశ్, ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌లు కేంద్రమంత్రులు మాండవ్య, కిషన్‌రెడ్డిలను అడ్డుకోవడం, వాగ్వాదానికి దిగడం, కార్యకర్తలు పోటాపోటీ నినాదాలు.. ఉద్రిక్తతకు దారితీయడం తెలిసిందే. స్థానికులకు ఉద్యోగాలు రాకపోవడానికి కేంద్రమే కారణమని చెప్పేందుకు, తద్వారా బీజేపీని ఇరుకున పెట్టేందుకు టీఆర్‌ఎస్‌ వ్యూహాత్మకంగా కేంద్రమంత్రులు వచ్చిన ప్రతీసారి ఆందోళనలకు దిగుతోంది. అయితే తాము స్థానికులకే ఉద్యోగాలు ఇవ్వాలని చెబుతున్నామని, కాని ఉద్యోగాల పేరిట వసూళ్లను అరికట్టాలంటూ బీజేపీ ఎదురుదాడి చేస్తోంది. 

ముందుందా!.. ముగిసిందా..!
ఆర్‌ఎఫ్‌సీఎల్‌ ఘటనపై అక్కడే కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డి పోలీసుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఏ పార్టీ ఆందోళనకు పిలుపునిచ్చినా ముందస్తు అరెస్ట్‌లు చేసే పోలీసులు, తమ పర్యటనలో ఆ విధంగా ఎందుకు వ్యవహరించలేదంటూ మండిపడ్డారు. ఈ క్రమంలోనే డీజీపీ ఆదేశం మేరకు సీపీ సత్యనారాయణ ఘటనపై విచారణ పూర్తి చేసి నివేదిక అందించారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూస్తామని హామీ ఇవ్వడంతోనే ఈ వ్యవహారం ముగిసిపోయిందనే ప్రచారం ఉంది. కాని ఒకరిద్దరు పోలీసు అధికారులపై వేటుపడక తప్పదేమోననే అనుమానాన్ని పలువురు పోలీసు అధికారులు వ్యక్తం చేస్తున్నారు. ఇదిలాఉంటే పోలీసుల అంచనాలు తప్పడంతోనే ఈ పరిస్థితి ఉత్పన్నమైందనే వాదనలు వినిపిస్తున్నాయి. పోలీసుల పోస్టింగ్‌లు టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, నేతల చేతుల్లోకి వెళ్లిన పరిస్థితుల్లో సహజంగానే రాష్ట్ర అధికార పార్టీ ప్రభావం పోలీసులపై ఎక్కువగా ఉంటుంది.

దీంతో టీఆర్‌ఎస్‌ ఆందోళన పట్ల కాస్త ఉదాసీనత ప్రదర్శించారనే విమర్శ ఉంది. అంతేకాకుండా వినతిపత్రం మాత్రమే ఇస్తారని చెప్పడంతోనే కేంద్రమంత్రులు టీఆర్‌ఎస్‌ ఆందోళన వద్దకు వెళ్లినట్లు బీజేపీ నేతలు చెబుతున్నారు. కాని కేంద్రమంత్రులను చుట్టుముట్టి నినాదాలు చేయడాన్ని,తోసుకోవడాన్ని పోలీసులు ఊహించలేకపోయినట్లు ప్రచారం జరుగుతోంది. ఫలితంగా కిషన్‌రెడ్డి ఆగ్రహాన్ని చవిచూడాల్సి వచ్చింది. పరిస్థితిని పసిగడితే మరో ద్వారం గుండా ఆర్‌ఎఫ్‌సీఎల్‌లోకి తీసుకెళ్లే అవకాశం ఉండేదని పోలీసులు కూడా చర్చించుకుంటున్నారు. కేంద్రప్రభుత్వ సంస్థలు అధికంగా ఉన్న కోల్‌బెల్ట్‌లో టీఆర్‌ఎస్, బీజేపీల ఆధిపత్యపోరు సాగుతోంది. రానున్న సింగరేణి గుర్తింపు ఎన్నికల నేపథ్యంలో ఇది మరింత ఉధృతం కానుంది.

మరిన్ని వార్తలు