3 నెలలు.. హోరాహోరీ!

7 Nov, 2022 02:08 IST|Sakshi

రాజగోపాల్‌రెడ్డి రాజీనామా నాటి నుంచీ అందరి చూపు మునుగోడుపైనే.. 

గెలుపు కోసం సర్వశక్తులు ఒడ్డిన టీఆర్‌ఎస్, బీజేపీ.. తన వంతు ప్రయత్నించిన కాంగ్రెస్‌ 

అమిత్‌షా, సీఎం కేసీఆర్, రేవంత్, రాష్ట్ర, కేంద్ర మంత్రులు, ప్రజాప్రతినిధుల ప్రచారం 

ఆరోపణలు, ప్రత్యారోపణలు, వ్యక్తిగత విమర్శలతో హోరెత్తిన ఎన్నిక 

ఎన్నడూ లేనివిధంగా డబ్బు, మద్యం ప్రలోభాల ఆరోపణలు 

సాక్షి, హైదరాబాద్‌: పేరుకు ఒక ఉప ఎన్నిక.. కానీ 2023 ఎన్నికలకు సెమీఫైనల్‌గా ప్రచారం.. హోరాహోరీ తలపడిన ప్రధాన రాజకీయపక్షాలు.. అన్ని అస్త్రశస్త్రాల ప్రయోగం.. దాదాపు మూడు నెలలు సందడి.. ఫలితం తేలేదాకా ఎడతెగని ఉత్కంఠ.. ఒక్క మాటలో చెప్పాలంటే మునుగోడు ఉప ఎన్నిక రాష్ట్రంలో విపరీతమైన సెగ పుట్టించింది. హోరాహోరీగా సాగిన ఈ సమరంలో ఆరోపణలు, ప్రత్యారోపణలు, పార్టీ జంపింగ్‌లు, వ్యక్తిగత, రాజకీయ విమర్శలు, వెల్లువెత్తిన డబ్బు, మద్యం ప్రలోభాలు.. రాజకీయ పార్టీల నుంచి సామాన్య ప్రజల దాకా ఎక్కడ చూసినా అదే చర్చ. 

రాజగోపాల్‌రెడ్డి వీడినరోజు నుంచే.. 
మునుగోడులో కాంగ్రెస్‌ నుంచి గెలిచినా బీజేపీకి అనుకూలంగా ప్రకటనలు చేసిన రాజగోపాల్‌రెడ్డి ఢిల్లీలో బీజేపీ నేతలను కలవడంతోనే ఉప ఎన్నిక ఎపిసోడ్‌ మొదలైనట్టు చెప్పుకోవచ్చు. ఆ ఘటనతో కాంగ్రెస్‌ పార్టీ రాజగోపాల్‌రెడ్డికి షోకాజ్‌ నోటీస్‌ జారీ చేయడం, ఆయన నియోజకవర్గంలో కార్యకర్తలను పూర్తిస్థాయిలో కలవకుండానే పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో రాజకీయంగా వేడి పెరిగింది. రాజగోపాల్‌రెడ్డి రాజీనామా ఆమోదం పొందిన క్షణం నుంచే ప్రధాన రాజకీయ పార్టీలు మునుగోడుపై దృష్టి సారించాయి. బహిరంగ సభలతో ప్రచారం మొదలుపెట్టాయి. ఉప ఎన్నిక షెడ్యూల్‌ వచ్చాక పోరు రసవత్తరంగా మారింది. 

తార స్థాయికి ప్రచారం 
ఉప ఎన్నికను టీఆర్‌ఎస్, బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. అందరికంటే ముందు కాంగ్రెస్‌ ఇక్కడ బహిరంగసభ నిర్వహించగా.. ఆ తర్వాత సీఎం కేసీఆర్‌ నేతృత్వంలో టీఆర్‌ఎస్‌ భారీ సభ చేపట్టింది. వెంటనే రాజగోపాల్‌రెడ్డి చేరిక సందర్భంగా బీజేపీ ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభకు కేంద్ర హోంమంత్రి అమిత్‌షా హాజరయ్యారు.

తర్వాత మరోమారు సీఎం కేసీఆర్‌ బహిరంగ సభ నిర్వహించారు. కాంగ్రెస్, బీజేపీలు తమ పార్టీల అగ్రనేతలతో ప్రచారం చేశాయి. టీఆర్‌ఎస్‌ అయితే రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, ప్రజాప్రతినిధులు, ముఖ్య నేతలందరినీ రంగంలోకి దింపింది. బీజేపీ తరఫున పలువురు కేంద్ర మంత్రులు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఈటల రాజేందర్, వివేక్‌ వెంకటస్వామి, కె.లక్ష్మణ్‌ వంటి సీనియర్లు ప్రచారం చేశారు. మరోవైపు ఉప ఎన్నిక ప్రచారం ఉధృతంగా జరుగుతున్న సమయంలోనే కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ చేపట్టిన భారత్‌జోడో యాత్ర రాష్ట్రంలోకి ప్రవేశించింది.

ఆ పార్టీ తరఫున టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, జానారెడ్డి, ఇతర సీనియర్లు విస్తృతంగా ప్రచారంలో పాల్గొన్నారు. కాంగ్రెస్‌ ప్రచారానికి చివరి రోజున మహిళా గర్జన సభ నిర్వహించింది. అన్ని పార్టీల నుంచి నేతలు పోలింగ్‌ బూత్‌స్థాయి నుంచీ గ్రామాలు, మండలాల వారీగా బాధ్యతలు తీసుకుని పనిచేశారు. సీఎం కేసీఆర్‌ కూడా టీఆర్‌ఎస్‌ తరఫున ఒక గ్రామానికి ఇన్‌చార్జిగా వ్యవహరించడం గమనార్హం. 

దుమ్ము రేపుతూ.. దుమ్మెత్తి పోసుకుంటూ.. 
మునుగోడు ప్రచారంలో ప్రధాన రాజకీయ పక్షాలు తమ బలాన్ని చాటేందుకు భారీగా కార్యక్రమాలు నిర్వహించాయి. ఇదే సమయంలో పరస్పరం దుమ్మెత్తిపోసుకున్నాయి. పార్టీల వారీగా ఆరోపణలు, ప్రత్యారోపణలకు తోడు నేతల వ్యక్తిగత విమర్శలూ పరిధి దాటాయి. రాజగోపాల్‌రెడ్డి ఎన్నికల ప్రచారం సమయంలో పలుచోట్ల అడ్డగింతలతో ఉద్రిక్త వాతావరణం కనిపించింది.

ఒకచోట టీఆర్‌ఎస్, బీజేపీ వర్గాలు బాహాబాహీ తలపడ్డాయి కూడా. మరోవైపు నలుగురు టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలకు ఎర అంశం, అందులో బీజేపీ పాత్ర ఉందనే ఆరోపణలు, ఆడియోలు లీకవడం కలకలం రేపింది. ఈ వ్యవహారంతో తమకు సంబంధం లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ యాదగిరిగుట్టలో ప్రమాణం చేయడం.. మరోవైపు టీఆర్‌ఎస్‌ బహిరంగసభకు కేసీఆర్‌ ఆ నలుగురు ఎమ్మెల్యేలను తీసుకుని రావడం మరింత వేడి పుట్టించాయి. 

ఆకర్ష్‌లు.. ప్రలోభాలు.. 
ఈ ఉప ఎన్నిక సమయంలో స్థానిక నేతల నుంచి సీనియర్ల దాకా పార్టీలు మారడం చర్చనీయాంశంగా మారింది. ప్రధాన పార్టీలు పోటాపోటీగా ‘ఆకర్‌‡్ష’కు తెరతీయడంతో పలువురు నేతలు అటూ ఇటూ మారడం, వెళ్లినవారు వెనక్కి రావడం, కొందరైతే మూడు పార్టీలు మారడం వంటివి జరిగాయి. మరోవైపు పెద్ద ఎత్తున నగదు, మద్యం పంపిణీ జరిగిందనే ఆరోపణలు వెల్లువెత్తాయి. హైదరాబాద్‌ కేంద్రంగా పలుమార్లు నగదు దొరకడంతోపాటు నియోజకవర్గంలో పెద్ద ఎత్తున నగదు, మద్యాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇక ఈ ఎన్నికల్లో గెలుపోటములపై వందల కోట్లలో బెట్టింగ్‌లు జరిగాయనే వార్తలు రావడమూ గమనార్హం.  

మరిన్ని వార్తలు