అచ్చంపేటలో ఉద్రిక్తత: టీఆర్‌ఎస్, బీజేపీ బాహాబాహీ

25 Apr, 2021 04:56 IST|Sakshi

అచ్చంపేట: నాగర్‌కర్నూల్‌ జిల్లా అచ్చంపేటలో శనివారం టీఆర్‌ఎస్, బీజేపీ కార్యకర్తలు బాహాబాహీకి దిగారు. దీంతో పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టారు. మున్సిపల్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం సాయంత్రం బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ఇన్‌చార్జి తరుణ్‌చుగ్‌ ఆధ్వర్యంలో అచ్చంపేటలో రోడ్‌ షో నిర్వహించారు. అమరవీరుల స్తూపం వద్ద ప్రభుత్వ అవినీతి, అక్రమాలపై చార్జిషీట్, కరపత్రాలను విడుదల చేశారు. అదే సమయంలో క్యాంపు కార్యాలయం నుంచి టీఆర్‌ఎస్‌ ప్రచార వాహనం, దాని వెనుకే ఎమ్మెల్యే గువ్వల బాలరాజు వాహనం రాగా బీజేపీ కార్యకర్తలు నినాదాలు చేశారు. దీంతో ఎమ్మెల్యే తన వాహనాన్ని దారి మళ్లించి మరో మార్గంలో వెళ్లిపోయారు.

కానీ కొందరు టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు మాత్రం తమ వాహనాలకు దారివ్వాలని బీజేపీ కార్యకర్తలతో వాగ్వాదానికి దిగారు. దీంతో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. ఈ ఘటనలో పలువురు బీజేపీ కార్యకర్తలు గాయపడ్డారు. ఓ కార్యకర్త పోలీసులపై చెప్పు విసిరాడు. దీనిపై తరుణ్‌ చుగ్‌ స్పందిస్తూ టీఆర్‌ఎస్‌ నేతల గూండాయిజానికి భయపడే ప్రసక్తే లేదన్నారు. మరోవైపు టీఆర్‌ఎస్‌ దాడిని ఖండిస్తున్నట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయనడానికి అచ్చంపేట దాడే నిదర్శనమని విమర్శించారు.

చదవండి: మాజీ ఎమ్మెల్యే కుంజా భిక్షం కన్నుమూత

చదవండి: కీలక ఎన్నికలకు కేటీఆర్‌ దూరం: మంత్రులదే బాధ్యత

మరిన్ని వార్తలు