ఎమ్మెల్యేలకు చెక్..‌ రాష్ట్ర కార్యవర్గానికి కొత్తరూపు..!

7 Feb, 2021 02:13 IST|Sakshi

ఏకపక్ష పోకడలను అడ్డుకోవాలనే యోచన 

నియోజకవర్గ స్థాయిలో అపరిమిత పెత్తనానికి కత్తెర  

కష్టించే కేడర్‌కు ప్రత్యామ్నాయ మార్గాల్లో గుర్తింపు! 

సంస్థాగతంగా బలోపేతం చేసేందుకు మళ్లీ జిల్లా కమిటీలు 

నేటి టీఆర్‌ఎస్‌ విస్తృతస్థాయి సమావేశంలో అధినేత కేసీఆర్‌ దిశానిర్దేశం

సాక్షి, హైదరాబాద్‌: అధికార పార్టీ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల ఏకపక్ష పోకడలకు చెక్‌ పెట్టాలని టీఆర్‌ఎస్‌ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు భావిస్తున్నారు. ఉద్యమకాలం నుంచి పనిచేస్తున్న వారిని, పార్టీకి అంకితమైన, నిరంతరం ప్రజల్లో ఉంటున్నవారిని గుర్తించి వారి సేవలకు తగిన ‘గుర్తింపు’నిచ్చేందుకు ప్రత్యేక వ్యవస్థ ఉండాలని కోరుకుంటున్నారు. ప్రతి దానికీ ఎమ్మెల్యే ‘ప్రాపకం’పై ఆధారపడే పరిస్థితి పార్టీకి వ్యవస్థాగతంగా మంచిది కాదని భావిస్తున్నారు. నియోజకవర్గ స్థాయిలో కేడర్‌ మీద ఎమ్మెల్యేలు చెలాయిస్తున్న అపరిమిత పెత్తనానికి కత్తెర వేస్తూ పార్టీ యంత్రాంగాన్ని సంస్థాగతంగా బలోపేతం చేసే దిశగా కేసీఆర్‌ ప్రణాళిక సిద్ధం చేశారు.

గతంలో రద్దు చేసిన జిల్లా కమిటీలను తిరిగి ఏర్పాటు చేయడంతో పాటు రాష్ట్ర కమిటీని కూడా పునర్వ్యవస్థీకరించాలని నిర్ణయించారు. ఆదివారం పార్టీ రాష్ట్ర కార్యాలయం తెలంగాణ భవన్‌ వేదికగా జరిగే పార్టీ రాష్ట్ర కార్యవర్గం, ఇతర ముఖ్య ప్రజా ప్రతినిధుల సమావేశంలో పార్టీ బలోపేతానికి సంబంధించి పలు కీలక నిర్ణయాలను టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు కేసీఆర్‌ ప్రకటించే అవకాశం ఉంది. బీజేపీ సంస్థాగతంగా బలోపేతమవుతూ దుబ్బాక ఉప ఎన్నిక, గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎన్నికల్లో గట్టి పోటీని ఇవ్వడంతో టీఆర్‌ఎస్‌ను అన్ని స్థాయిల్లోనూ పటిష్టం చేయా లనే నిర్ణయానికి పార్టీ అధినేత వచ్చినట్లు సమాచారం. పార్టీ సభ్యత్వ పునరుద్ధరణ, సంస్థాగత శిక్షణ, పార్టీ జిల్లా కార్యాలయాల ప్రారంభం వంటి సంస్థాగత విషయాలపై కేసీఆర్‌ దిశానిర్దేశం చేస్తారు.  చదవండి: (టీఆర్‌ఎస్‌ శ్రేణుల్లో తీవ్ర ఉత్కంఠ.. రేపే సమావేశం)

తెరమీదకు జిల్లా కమిటీల ఏర్పాటు 
పార్టీపరంగా గ్రామ, మండల స్థాయి కమిటీలతో పాటు రాష్ట్ర స్థాయి కార్యవర్గం మాత్రమే ఉంటుందని గతంలో పార్టీ అధినేత, సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. జిల్లా స్థాయిలో పార్టీ అధ్యక్షుడితో పాటు ఇతర కార్యవర్గం, అనుబంధ సంఘాలను రద్దు చేయడంతో పాటు నియోజకవర్గ స్థాయిలో టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జీలకు పూర్తి స్థాయిలో పార్టీ బాధ్యతలు అప్పగిస్తున్నట్లు ప్రకటించారు. 2019 జూలైలో పార్టీ సభ్యత్వ నమోదు అనంతరం గ్రామ, మండల స్థాయి కమిటీలు ఏర్పాటైనా కేసీఆర్‌ నిర్ణయం మేరకు జిల్లా కమిటీలు ఏర్పాటు చేయలేదు. దీంతో పార్టీ కార్యకలాపాల్లో ఎమ్మెల్యేలకు ఎదురులేకుండా పోయింది.

క్షేత్రస్థాయిలో నేతల నడుమ అంతర్గత విభేదాలు తీవ్రస్థాయికి చేరుకున్నాయి. వివిధ పార్టీల నుంచి చేరిన నేతలు, మొదటి నుంచి పార్టీలో ఉన్న వారి నడుమ ఆధిపత్య పోరు సాగుతుండగా ఎమ్మెల్యేలు తమకు అనుకూలంగా ఉండే వారికే వత్తాసు పలుకుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. చాలా చోట్ల కేడర్‌ గ్రూపులుగా విడిపోవడం... విభేదాల పరిష్కారం, పనిచేసే కేడర్‌కు గుర్తింపు వంటి అంశాలపై దృష్టి పెట్టే యంత్రాంగమంటూ ప్రత్యేకంగా ఏదీ లేకపోవడంతో నష్టం జరుగుతున్నట్లు పార్టీ అధినేత గుర్తించినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో జిల్లా స్థాయిలో పార్టీ అధ్యక్షుడి నియామకంతో పాటు పార్టీ జిల్లా కార్యవర్గం, అనుబంధ సంఘాలను కూడా ఏర్పాటు చేయాలని కేసీఆర్‌ నిర్ణయించినట్లు సమాచారం. 

భారీగా ప్లీనరీ... 
2019 జూన్, జూలై మాసాల్లో జరిగిన సభ్యత్వ నమోదు కార్యక్రమం ద్వారా 65 లక్షల మందికి పార్టీ సభ్యత్వం ఇచ్చారు. పార్టీ సభ్యత్వం కాల పరిమితి రెండేళ్లు కాగా, ఈ ఏడాది ఏప్రిల్‌లో పార్టీ ప్లీనరీ తర్వాత సభ్యత్వ పునరుద్దరణ చేపట్టాలని టీఆర్‌ఎస్‌ భావిస్తోంది. ఇదిలా ఉంటే హైదరాబాద్, వరంగల్‌ మినహా మిగతా 28 జిల్లా కేంద్రాల్లో పార్టీ కార్యాలయాల నిర్మాణం పూర్తయింది. సిద్దిపేట జిల్లా పార్టీ కార్యాలయాన్ని గత ఏడాది డిసెంబర్‌లో కేసీఆర్‌ ప్రారంభించగా, మిగతా చోట్ల కూడా ఏప్రిల్‌లోగా ప్రారంభించి సంస్థాగత శిక్షణ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాలని పార్టీ అధినేత నిర్ణయించినట్లు తెలిసింది. గత ఏడాది ఏప్రిల్‌ 27నాటికి టీఆర్‌ఎస్‌ 20వ వసంతంలోకి అడుగు పెట్టగా కరోనా నేపథ్యంలో సాదాసీదాగా కార్యక్రమం జరిగిపోయింది. కాబట్టి ఈ ఏడాది ప్లీనరీని ఆర్భాటంగా నిర్వహించాలనే యోచనలో పార్టీ అధినేత ఉన్నట్లు సమాచారం. దీంతో ఆదివారం జరిగే పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో సంస్థాగత నిర్మాణం, బలోపేతానికి సంబంధించి కేసీఆర్‌ కీలక ప్రకటన చేస్తారని పార్టీ నేతలు భావిస్తున్నారు. 

రాష్ట్ర కార్యవర్గానికి కొత్తరూపు.. 
సుమారు మూడున్నరేళ్ల క్రితం 2017 అక్టోబర్‌లో టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు కేసీఆర్‌ రాష్ట్రస్థాయిలో జంబో కార్యవర్గాన్ని ఏర్పాటు చేశారు. 20 మంది ప్రధాన కార్యదర్శులు, 33 మంది కార్యదర్శులు, 12 మంది డిప్యూటీ కార్యదర్శులతో ఏర్పాటైన రాష్ట్ర కార్యవర్గానికి ఎన్నికల సమయంలోనే క్రియాశీల బాధ్యతలు అప్పగిస్తున్నారు. రాష్ట్ర కార్యవర్గంలోని సత్య వతి రాథోడ్‌కు మంత్రి పదవి దక్కగా, పి.రాములు, బండా ప్రకాశ్‌ ముదిరాజ్, బడుగుల లింగయ్య యాదవ్, మాలోత్‌ కవిత ఎంపీగా ఎన్నికయ్యారు. పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, బస్వరాజు సారయ్యకు ఎమ్మెల్సీ పదవి దక్కగా, భూపతిరెడ్డి, సపాన్‌దేవ్‌ వంటి నేతలు పార్టీని వీడారు. ఈ నేపథ్యంలో పార్టీని బలో పేతం చేయాలని భావిస్తున్న కేసీఆర్‌ రాష్ట్ర కార్యవర్గాన్ని పూర్తి స్థాయిలో పునర్వ్యవస్థీకరించాలనే యోచనలో ఉన్నట్లు తెలిసింది. 2018 అసెంబ్లీ ఎన్నికల తర్వాత వివిధ పార్టీలకు చెందిన నేతలు అన్ని స్థాయిల్లో పార్టీలో చేరడంతో అధికారిక పదవులు దక్కని వారికి పార్టీ కమిటీల్లో చోటు కల్పించడంతోపాటు పార్టీ కార్యక్రమాల్లో భాగస్వాములను చేస్తారు.   

మరిన్ని వార్తలు