తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికలు: ఆ హాట్‌ సీటే టార్గెట్‌

6 Mar, 2021 01:50 IST|Sakshi

సిట్టింగ్‌తోపాటు రెండో స్థానంలోనూ గెలుపే లక్ష్యంగా ప్రచారం

పీవీ కూతురు అభ్యర్థిత్వాన్ని అనుకూలంగా మలుచుకునేవ్యూహం

విపక్షాల విమర్శలు తిప్పికొట్టేందుకు ఇక్కడ గెలుపొందడమే కీలకం

టీఆర్‌ఎస్‌కు ప్రతిష్టాత్మకంగా ‘హైదరాబాద్‌– రంగారెడ్డి– మహబూబ్‌నగర్‌’ స్థానం

సాక్షి, హైదరాబాద్‌: శాసనమండలి పట్టభద్రుల కోటాలోని రెండు స్థానాలకు జరుగుతున్న ఎన్నికలకు సంబంధించి వారం రోజుల్లో ప్రచార పర్వం ముగియనుంది. సిట్టింగ్‌ స్థానమైన నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ను నిలబెట్టుకోవడంతో పాటు, హైదరాబాద్‌-రంగారెడ్డి-మహబూబ్‌నగర్‌ స్థానాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ కైవసం చేసుకోవాలని టీఆర్‌ఎస్‌ సర్వశక్తులూ ఒడ్డుతోంది. ‘హైదరాబాద్‌-రంగారెడ్డి-మహబూబ్‌నగర్‌’ స్థానా నికి ప్రస్తుతం నాలుగో పర్యాయం ఎన్నిక జరుగు తుండగా.. గతంలో ఒక్కసారి కూడా ఈ స్థానంలో విజయం సాధించకపోవడాన్ని టీఆర్‌ఎస్‌ సవా లుగా తీసుకుంది. ఈ స్థానంలో వరుస ఓటముల అపప్రథను తొలగించుకోవడంతోపాటు దుబ్బాక ఉపఎన్నిక, గ్రేటర్‌ ఎన్నికల ఫలితాలతో దూకుడు మీదున్న బీజేపీకి ఈ స్థానంలో గెలుపు ద్వారా పగ్గాలు వేయాలని టీఆర్‌ఎస్‌ భావిస్తోంది. ఈ స్థానంలో బీజేపీ అభ్యర్థిగా సిట్టింగ్‌ ఎమ్మెల్సీ రామచందర్‌రావు మరోమారు ఎన్నికల బరిలో నిలిచారు. సిట్టింగ్‌ స్థానంలో బీజేపీని ఓడించడం ద్వారా ఆ పార్టీకి షాక్‌ ఇవ్వాలని టీఆర్‌ఎస్‌ ఆశిస్తోంది. అందుకే వాణీదేవి గెలుపును అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది.

మహిళా ఓటర్లపై ఆశలు
హైదరాబాద్‌- రంగారెడ్డి-మహబూబ్‌నగర్‌ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి పార్టీ అభ్యర్థిగా దివంగత మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు కూతురు సురభి వాణీదేవి పేరును టీఆర్‌ఎస్‌ పార్టీ చివరి నిముషంలో ఖరారు చేసింది. పీవీ శత జయంతి ఉత్సవాల సందర్భంగా వాణీదేవిని ఎమ్మెల్సీగా గెలిపించడమే అసలైన నివాళి అని టీఆర్‌ఎస్‌ చెబుతోంది. పట్టభద్రుల కోటా ఎన్నికలో ఒక ప్రధాన రాజకీయ పక్షం మహిళా అభ్యర్థిని బరిలోకి దించడం ఇదే ప్రథమం కావడంతో వాణీదేవి అభ్యర్థిత్వంపై ఆసక్తి నెలకొంది. ఈ నియోజకవర్గంలో 5.31 లక్షల మంది ఓటర్లుగా నమోదు కాగా, ఇందులో 1.94 లక్షలు... అంటే సుమారు 36 శాతం మంది మహిళా ఓటర్లు ఉన్నారు. విద్యావేత్తగా వాణీదేవికి ఉన్న గుర్తింపు, ఎలాంటి వివాదాలు లేకపోవపోడం, పీవీ కూతురు కావడం... కలిసి వస్తుందని టీఆర్‌ఎస్‌ అంచనా వేస్తోంది. వాణీదేవిని రాజ్యసభకు ఎందుకు పంపలేదని, శాసనమండలికి నేరుగా ఎందుకు నామినేట్‌ చేయలేదని కాంగ్రెస్, బీజేపీ ప్రశ్నిస్తుండగా టీఆర్‌ఎస్‌ మాత్రం పట్టభద్రుల ఆమోదంతో ఆమె మండలిలో అడుగుపెడతారని ధీమా వ్యక్తం చేస్తోంది. ప్రధాని హోదాలో పీవీ చేపట్టిన సంస్కరణలు, ఆయన వ్యక్తిత్వం, వాణీదేవి అభ్యర్థిత్వం తదితర అంశాలతో పాటు తమ సంస్థాగత బలం కలిసి వస్తుందని టీఆర్‌ఎస్‌ లెక్కలు వేస్తోంది.

మంత్రిమండలిలో పది మంది ఇక్కడే
శాసనమండలి పట్టభద్రుల ఓటరు నమోదు స్థాయిలో చురుగ్గా వ్యవహరించిన టీఆర్‌ఎస్‌ ‘హైదరాబాద్‌- రంగారెడ్డి- మహబూబ్‌నగర్‌’ నుంచి అభ్యర్థిని ప్రకటించే విషయంలో ఆఖరి దాకా సస్పెన్స్‌ కొనసాగించింది. చివరి నిముషంలో వాణీదేవి అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసిన టీఆర్‌ఎస్‌ ప్రచారానికి తక్కువ సమయం ఉండటంతో పెద్ద సంఖ్యలో పార్టీ యంత్రాంగాన్ని ఇక్కడ మొహరించింది. పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్, ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు, రాజ్యసభ సభ్యులు డాక్టర్‌ కే.కేశవరావుకు సమన్వయ బాధ్యతలు అప్పగించింది. క్షేత్రస్థాయి పార్టీ యంత్రాంగాన్ని కార్యరంగంలోకి దించుతూ.. ప్రచార బాధ్యతలను ఉమ్మడి హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌ జిల్లాలకు చెందిన ఆరుగురు మంత్రులకు అప్పజెప్పింది. వీరితో పాటు పట్టభద్రుల ఎన్నికలు లేని మెదక్, కరీంనగర్, నిజామాబాద్‌ జిల్లాకు చెందిన మంత్రులు హరీష్‌రావు, గంగుల కమలాకర్, వేముల ప్రశాంత్‌రెడ్డికి కూడా ఈ స్థానంలో ప్రచార బాధ్యతలు కట్టబెట్టింది. ఇలా మొత్తం పదిమంది మంత్రులు ‘హైదరాబాద్‌- రంగారెడ్డి- మహబూబ్‌నగర్‌’లో గెలుపే లక్ష్యంగా ప్రచారం కొనసాగించడం, పార్టీ యంత్రాంగాన్ని సమన్వయం చేయడం, పార్టీ వ్యూహం అమలు చేయడంపై దృష్టి కేంద్రీకరించారు. బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం నిధులు, పథకాల మంజూరులో రాష్ట్రానికి అన్యాయం చేస్తోందని మంత్రులు ప్రతిచోటా ఎత్తిచూపుతున్నారు. అలాగే కాంగ్రెస్, బీజేపీ రాష్ట్ర నేతలను లక్ష్యంగా చేసుకుని టీఆర్‌ఎస్‌ ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేస్తోంది.

మరిన్ని వార్తలు