అగ్రనేతలే టార్గెట్‌!

13 May, 2022 01:10 IST|Sakshi

గేరు మార్చిన ‘కారు’ 

బీజేపీ, కాంగ్రెస్‌ జాతీయ నాయకత్వాలు లక్ష్యంగా ఎదురుదాడికి టీఆర్‌ఎస్‌ నిర్ణయం 

భారీ బహిరంగ సభలతో విమర్శలు తిప్పికొట్టేలా కేసీఆర్‌ వ్యూహం 

త్వరలో చెన్నూరు, హైదరాబాద్‌లో బహిరంగ సభలకు యోచన 

సాక్షి, హైదరాబాద్‌: ఇన్నాళ్లూ జాతీయ పార్టీల రాష్ట్ర నాయకులు లక్ష్యంగా విమర్శనాస్త్రాలు సంధించిన టీఆర్‌ఎస్‌.. ప్రత్యర్థులపై దాడి విషయంలో రూటు మార్చాలని నిర్ణయించింది. జాతీయ పార్టీల నాయకత్వ వైఫల్యాలను, వారినే నేరుగా లక్ష్యంగా చేసుకుని చీల్చి చెండాడాలని భావిస్తోంది. ఇందుకు అనుసరించాల్సిన వ్యూహంపై పార్టీ అధినేత, సీఎం కేసీఆర్‌ ముఖ్యనేతలకు దిశా నిర్దేశం చేశారు. జాతీయ పార్టీల ప్రాంతీయ నాయకులు వాడుతున్న పదజాలాన్ని ఆక్షేపిస్తున్న టీఆర్‌ఎస్‌.. ఇకపై ప్రధాని మోదీ సహా బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీల జాతీయ నాయకత్వంపై విమర్శల పదును పెంచాలని నిర్ణయించింది.

పాదయాత్రలు, బహిరంగ సభల పేరిట వివిధ పార్టీల నాయకులు ప్రభుత్వం, పార్టీపై చేస్తున్న విమర్శలను తిప్పికొట్టేందుకు భారీ బహిరంగ సభలు నిర్వహించాలని భావిస్తోంది. ఏప్రిల్‌ 27న నిర్వహించిన పార్టీ ప్లీనరీ సమావేశాలకు వేసవి తీవ్రతను దృష్టిలో పెట్టుకుని పరిమిత సంఖ్యలోనే పార్టీ నేతలను ఆహ్వానించారు. అయితే ప్రభుత్వ కార్యక్రమాలు, రాష్ట్ర, జాతీయ రాజకీయాలపై పార్టీ ఆలోచనను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు భారీ బహిరంగ సభలు నిర్వహించాలని కేసీఆర్‌ నిర్ణయించారు.  

ఈ నెలాఖరులో నిర్వహించే యోచన... 
బహిరంగ సభల నిర్వహణకు అనువైన వేదికలపై ఇప్పటికే కేసీఆర్‌ ఒక నిర్ణయానికి రాగా, నిర్వహణ తేదీలపై స్పష్టత రావాల్సి ఉందని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ప్రస్తుతం యాసంగి వరి కోతలు దాదాపు పూర్తవడం, ధాన్యం కొనుగోలు ప్రక్రియ చురుగ్గా సాగుతుండటంతో మే నెలాఖరులో బహిరంగ సభలు నిర్వహించాలని కేసీఆర్‌ భావిస్తున్నారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు అసెంబ్లీ నియోజకవర్గంలో రూ.1,600 కోట్లకు పైగా అంచనా వ్యయంతో చేపట్టే ఎత్తిపోతల పథకానికి గతంలో మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈనేపథ్యంలో ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన చేయడంతోపాటు అక్కడే బహిరంగ సభ కూడా నిర్వహించాలని ప్రాథమికంగా నిర్ణయించారు.

ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్‌ జిల్లాల నుంచి ఈ సభకు భారీగా జన సమీకరణ చేయాలని పార్టీ భావిస్తోంది. ఇదిలాఉంటే పార్టీ హైదరాబాద్‌ జిల్లా కమిటీ అధ్యక్షుడిగా ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌ త్వరలో బాధ్యతలు తీసుకోనున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌ నిజాంకాలేజీ మైదానంలో నిర్వహించే బహిరంగ సభలోనూ కేసీఆర్‌ పాల్గొంటారు. ఈ సభల ద్వారా జాతీయ పార్టీల నాయకత్వ వైఫల్యాలను ఎండగట్టడంతోపాటు ఆయా పార్టీల పాలిత రాష్ట్రాల్లోని వైఫల్యాలనూ ఎత్తిచూపడం ద్వారా ఎదురుదాడి చేసేలా టీఆర్‌ఎస్‌ నేతలు వ్యూహం సిద్ధం చేసుకుంటున్నారు.  
 
కేసీఆర్‌ చేతుల మీదుగా ‘తెలంగాణ భవన్‌’లు 
హైదరాబాద్, వరంగల్‌ మినహా మిగతా అన్ని జిల్లా కేంద్రాల్లోనూ ‘తెలంగాణ భవన్‌’పేరిట పార్టీ జిల్లా కార్యాలయాలను నిర్మించారు. జనగామ, సిద్దిపేట వంటి ఒకటి రెండు జిల్లాల్లో మాత్రమే కేసీఆర్‌ ప్రారంభించారు. మిగతా జిల్లాల్లోనూ తెలంగాణ భవన్‌లు ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్నా వివిధ కారణాలతో వాయిదా పడుతూ వస్తున్నాయి. ఈ కార్యాలయాలను కేసీఆర్‌ చేతులమీదుగా ప్రారంభించి ఆయా జిల్లాల్లో బహిరంగ సభలు నిర్వహించాలని భావిస్తున్నారు.

ఇదిలా ఉంటే బీజేపీ పాదయాత్ర, జాతీయ నేతలతో బహిరంగ సభలు, కాంగ్రెస్‌ పార్టీ వరంగల్‌ రైతు సంఘర్షణ సభతోపాటు ఇతర పార్టీలు కూడా పాదయాత్రలతో క్షేత్రస్థాయిలో చురుగ్గా ఉన్నాయి. ఈ నేపథ్యంలో పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్, మంత్రి హరీశ్‌రావుతోపాటు పార్టీలో చురుకైన నేతలు జిల్లాల్లో విస్తృతంగా పర్యటిస్తున్నారు.   

మరిన్ని వార్తలు