ఈటలను లైట్‌ తీస్కోవద్దు, 6సార్లు గెల్సిండు

5 Jul, 2021 01:11 IST|Sakshi

హుజూరాబాద్‌ నియోజకవర్గంపై టీఆర్‌ఎస్‌ మరింత దృష్టి

సర్వేలు, నిఘా సంస్థల నివేదికల నిశిత పరిశీలన.. ఈటల ఇమేజీని తేలిగ్గా తీసుకోకూడదని నిర్ణయం

పార్టీకి నష్టం వాటిల్లకుండా ప్రత్యేక వ్యూహం.. మూడోవారంలో సీఎం నియోజకవర్గ పర్యటన!  

హైదరాబాద్‌: హుజూరాబాద్‌ నియోజకవర్గంపై మరింతగా దృష్టి కేంద్రీకరించాలని టీఆర్‌ఎస్‌ భావిస్తోంది. అంతర్గత సర్వేలు, వివిధ నిఘా సంస్థల నుంచి అందుతున్న నివేదికలను నిశితంగా విశ్లేషిస్తున్న అధికార పార్టీ.. నియోజకవర్గంలో గట్టెక్కాలంటే గట్టి ప్రయత్నం చేయకతప్పదనే అంచనాకు వచ్చింది. మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ పార్టీలో తొలిసుంచీ పనిచేస్తూ కీలక నేతగా ఎదిగి, ఈ ప్రాంతం నుంచి వరుసగా ఆరు పర్యాయాలు ఎన్నికైన నేపథ్యంలో.. ఉప ఎన్నికను తేలికగా తీసుకోకూడదని నిర్ణయించింది. సుమారు 18 సంవత్సరాలుగా హుజూరాబాద్‌ ప్రాంతంతో అనుబంధం కలిగిన ఈటలకు ఊరూవాడా ఉన్న వ్యక్తిగత పరిచయాలను దృష్టిలో ఉంచుకుని టీఆర్‌ఎస్‌కు నష్టం జరగకుండా ప్రత్యేక వ్యూహం అమలు చేయాలని భావిస్తోంది. ఈటల ఏడేళ్లు మంత్రిగా పనిచేయడాన్ని కూడా పరిగణనలోకి తీసుకుంటోంది. వాస్తవానికి ఈ ఉద్దేశంతోనే,  పార్టీకి, ఎమ్మెల్యే పదవికి ఈటల రాజీనామా చేసిన వెంటనే.. స్థానికంగా పార్టీ ప్రజా ప్రతినిధులు, కేడర్‌ చేజారకుండా చర్యలు చేపట్టింది. తాజాగా ఈటలతో అనుబంధం కలిగిన వ్యక్తులు, సంఘాలు, సామాజికవర్గాల మద్దతు కూడగట్టడంతో పాటు అన్నిరకాల ప్రయత్నాలూ చేస్తోంది. 

పలుకుబడి కలిగిన కుటుంబాలకు చేరువ 
నియోజకవర్గంలో రాజకీయంగా పలుకుబడి ఉన్న మరిన్ని కుటుంబాలకు చేరువ కావడం ద్వారా, వారి మద్దతు కూడగట్టుకునేందుకు టీఆర్‌ఎస్‌ అత్యంత ప్రాధాన్యతనిస్తోంది. రాజ్యసభ ఎంపీ కెప్టెన్‌ లక్ష్మీకాంతరావు, ఆయన కుమారుడు హుస్నాబాద్‌ ఎమ్మెల్యే ఒడితెల సతీష్‌కుమార్‌ ఎప్పట్నుంచో టీఆర్‌ఎస్‌ తరఫున క్షేత్ర స్థాయిలో పనిచేస్తున్నారు. మరోవైపు గతంలో టీడీపీలో క్రియాశీలంగా పనిచేసిన మాజీ మంత్రి ముద్దసాని దామోదర్‌రెడ్డి కుమారుడు కశ్యప్‌రెడ్డి కూడా ఇటీవల కాంగ్రెస్‌ను వీడి టీఆర్‌ఎస్‌లో చేరారు. తాజాగా గతంలో ఈటలతో సన్నిహితంగా కలిసి పనిచేసిన పలువురు మాజీ ప్రజా ప్రతినిధులు, ఎలాంటి పదవులు లేకున్నా క్షేత్ర స్తాయిలో పలుకుబడి కలిగిన కుటుంబాల మద్దతు పొందడంపై టీఆర్‌ఎస్‌ దృష్టి పెట్టింది. మద్దతివ్వడంతో పాటు వారు పార్టీ ఎంపిక చేసే అభ్యర్థి కోసం పనిచేసేలా ప్రయత్నాలు సాగుతున్నాయి. గ్రామాలు, మున్సిపాలిటీల వారీగా కుల సంఘాలు, ప్రజా సంఘాలు, యువత, విద్యార్థులు తదితరులతో పార్టీ ఇన్‌చార్జిలుగా నియమితులైన మంత్రులు, ఎమ్మెల్యేలు ఇప్పటికే వరుస భేటీలు జరుపుతున్నారు. మరోవైపు ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల జాబితాను కూడా తయారు చేసి ప్రతి ఒక్క లబ్ధిదారుడిని కలిసేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు. 

కాంగ్రెస్‌ ఓటు బ్యాంకుపై కన్ను 
కాంగ్రెస్‌ ఓటు బ్యాంకుకు గండి కొట్టడం ద్వారా బలాన్ని మరింత పెంచుకోవాలని టీఆర్‌ఎస్‌ భావిస్తోంది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసిన కౌశిక్‌రెడ్డి.. పోలైన ఓట్లలో 34.6 శాతం అంటే సుమారు 61 వేలకు పైగా ఓట్లు సాధించారు. ఆయన టీఆర్‌ఎస్‌లో చేరి అభ్యర్థిగా పోటీ చేస్తారని తొలుత ప్రచారం జరిగింది. అయితే ఈటల రాజీనామా తర్వాత కూడా నియోజకవర్గంలో కాంగ్రెస్‌ శ్రేణులతో కలిసి కౌశిక్‌రెడ్డి ర్యాలీలు నిర్వహించడంతో సందిగ్ధత నెలకొంది. అయితే గ్రామాల వారీగా గత ఎన్నికల్లో కాంగ్రెస్‌ సాధించిన ఓట్ల సంఖ్యను విశ్లేషిస్తూ ఆయా బూత్‌లపై అధికార పార్టీ దృష్టి పెట్టింది. మరోవైపు హుజూరాబాద్, జమ్మికుంట మున్సిపాలిటీల్లో కాంగ్రెస్‌ పార్టీ కి చెందిన ఒక్కో మున్సిపల్‌ కౌన్సిలర్‌ ఇటీవలి కాలంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. హుజూరాబాద్‌ ఎన్నికల షెడ్యూల్‌ వెలువడే నాటికి టీపీసీసీ కొత్త కార్యవర్గంపై అసంతృప్తిగా ఉన్న ఒకరిద్దరు కాంగ్రెస్‌ కీలక నేతలు కూడా చేరే అవకాశమున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఇక బీజేపీ మున్సిపల్‌ కౌన్సిలర్‌ ఒకరు కూడా ఇటీవల టీఆర్‌ఎస్‌లో చేరారు. బీజేపీలో ఈటల చేరికపై అసంతృప్తి వ్యక్తం చేసిన మాజీ మంత్రి ఇ.పెద్దిరెడ్డి నియోజకవర్గంలో ఎక్కడా కనిపించడం లేదు. ఆయన రాజకీయ అడుగులు ఎటు పడతాయనే అంశం ఆసక్తి రేపుతోంది.  
 

మరిన్ని వార్తలు